Fear Of Heights: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌.. సహోద్యోగితో పెళ్లి! అమెరికాలో కాపురం.. ఆ ఒక్క విషయం వల్ల

Acrophobia Fear Of Heights How To Overcome Tips By Psychologist - Sakshi

Acrophobia: గోపీ హైదరాబాద్‌లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. నాలుగేళ్లు పనిచేశాక తన సహోద్యోగినే పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే ఆన్‌సైట్‌ అవకాశం వచ్చింది. ఇద్దరూ సంతోషంగా అమెరికా వెళ్లారు. ఆఫీసు 36వ అంతస్తులో ఉందని అక్కడకు వెళ్లాక తెలిసింది. అంతే.. ఒంట్లో వణుకు మొదలైంది.

ఎలాగోలా ధైర్యం చేసి ఆఫీసుకు బయలుదేరాడు. అక్కడ లిఫ్ట్‌లో రాడ్‌ గట్టిగా పట్టుకుని 36వ అంతస్తుకు చేరుకున్నాడు. ఊపిరాగినట్లనిపించింది. ఎవరూ చూడకుండా గోడ సాయంతో కేబిన్‌ చేరుకుని కుర్చీలో కూర్చున్నాడు. 

సాయంత్రం డ్యూటీ అయిపోయేంతవరకు మనసంతా తీవ్రమైన ఆందోళనగా ఉంది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. కుర్చీలోంచి లేస్తే పడిపోతానేమోనని విపరీతమైన భయం. అందుకే సాయంత్రం డ్యూటీ అయ్యేంతవరకు కుర్చీలోంచి కదల్లేదు. సాయంత్రం డ్యూటీ అయ్యాక ఎలాగోలా కష్టపడి ఇంటికి చేరుకున్నాడు. 

అలా వారం రోజులు ఆఫీసుకు వెళ్లాక ఇక తనవల్ల కాదనిపించింది. జాబ్‌ రిజైన్‌ చేస్తానంటూ భార్యకు చెప్పాడు. ఎందుకని అడిగితే.. ఏదో కారణం చెప్పాడు. అది సరైన కారణమని ఆమెకు అనిపించలేదు. దాంతో వాగ్వాదం మొదలై, వాగ్యుద్ధంగా ముగిసింది. 

ఎత్తయిన ప్రదేశాలంటే వణకడాన్ని ఏమంటారు? 
సాధారణంగా అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది. కొందరికి పిల్లంటే భయం, మరికొందరికి కుక్కంటే భయం, ఇంకొందరికి పామంటే భయం. అలాగే ఎత్తయిన ప్రదేశాలంటే అందరికీ ఎంతో కొంత భయం ఉంటుంది. ఎత్తయిన ప్రాంతాల నుంచి కిందకు చూస్తే చాలామందికి అసౌకర్యంగా ఉంటుంది. కొందరికి కొద్దిపాటి వణుకుగా అనిపించవచ్చు. అందుకే ఎత్తులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు.

అయితే ఆ జాగ్రత్త, ఆ భయం అతిగా మారి, ఆ పరిస్థితులను తలచుకుంటేనే వణుకు వస్తే, అలా ఆరు నెలలపాటు ఉంటే దాన్ని ‘ఫోబియా’ అంటారు. ఇది ఒక మానసిక సమస్య. ఇలాంటి ఫోబియాలు చాలా ఉన్నాయి. వాటిలో గోపీలా ఎత్తయిన ప్రదేశాలంటే వణికిపోవడాన్ని ‘అక్రోఫోబియా’ అంటారు. ఈ ఫోబియా ఉన్న వ్యక్తులకు ఎత్తయిన ప్రదేశాలన్న ఊహే వణుకు తెప్పిస్తుంది.

ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోతామనే భయమే మనసులో ఉంటుంది. అందువల్ల మెట్లు ఎక్కడం, బాల్కనీ దగ్గర నిలబడటం, బహుళ అంతస్తుల భవనాల్లో పనిచేయడం లాంటి వాటిని తప్పించుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడయినా ఎత్తయిన ప్రదేశంలో ఉండాల్సి వస్తే ఆందోళనతో గుండె వేగంగా కొట్టుకుంటుంది, తల తిరిగినట్లు, ఊపిరాగినట్లు అనిపిస్తుంది. 

ఎవరికి రావచ్చు?
అక్రోఫోబియా ఏ వయస్సులోనైనా రావచ్చు. అయితే ఇలాంటి నిర్దిష్ట భయాలు బాల్యంలో వచ్చే అవకాశాలు ఎక్కువ. బాల్యంలో ఎదురైన ఏదో ఒక భయం కలిగించే అనుభవాన్ని అతిగా జనరలైజ్‌ చేయడం వల్ల, అతిగా ఆలోచించి భూతద్దంలో చూడటం వల్ల అది ఫోబియాగా మారుతుంది. ఈ భయాలు టీనేజర్స్‌లో, యువకుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మహిళల్లోనూ ఎక్కువగా కనిపిస్తాయి. 

కారణాలేమిటి?
అక్రోఫోబియాకు కారణం ఏమిటో కచ్చితంగా తెలియదు. అక్రోఫోబియా కలిగి ఉండటం అనేది ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోవడం లేదా మనల్ని మనం బాధించు కోవాలనే సహజ మానవ ఆందోళన నుంచి ఉత్పన్నమవుతుందని చెప్తారు. ఎత్తు నుంచి∙పడిపోవడం వల్ల మీరు అనుభవించే నొప్పి గురించి ఆలోచించడం, మనసులో ఆ దృశ్యాన్ని పదేపదే చూస్తూ బాధపడటం అక్రోఫోబియా పెరగడానికి కారణం అవుతుంది. 

నివారణ ఉందా?
దాదాపు మూడు నుంచి ఆరుశాతం మందిలో అక్రోఫోబియా ఉంటుంది. ఈ ఫోబియా మీకుందని మీరు గుర్తిస్తే.. ఎత్తయిన ప్రదేశంలో ఉన్నప్పుడు కిందకు చూడకుండా మీ దృష్టిని హరైజాన్‌పై నిలపండి. మీకు సమీపంలో నిశ్చలంగా ఉన్న వస్తువులను చూడండి. అవసరమైతే మీ కదలికలను ఆపేయండి. మైండ్‌ఫుల్‌నెస్‌ మెడిటేషన్, డీప్‌ బ్రీత్, యోగా వంటివి ప్రాక్టీస్‌ చేయండి.

అయితే ఇవన్నీ అప్పటికి ఉపశమనాన్ని ఇస్తాయే తప్ప మీ ఫోబియాను పరిష్కరించవు. అందువల్ల మీ ఫోబియాకు సరైన సైకోథెరపీ పొందడం అవసరం. మీరెంత త్వరగా కౌన్సెలింగ్‌ తీసుకుంటే అంత త్వరగా మీ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మీలో ఆందోళన, నిరాశ, నిస్పృహలు పెరగడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. అక్రోఫోబియాకు ప్రస్తుతం ఎటువంటి నివారణ లేదు.

అయితే ఎక్స్‌పోజర్‌ థెరపీ, వర్చువల్‌ రియాలిటీ ఎక్స్‌పోజర్‌ థెరపీ, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీవంటి పద్ధతులతో చికిత్స చేయవచ్చు. న్యూరో లింగ్విస్టిక్‌ సైకోథెరపీ ద్వారా ఒకటి నుంచి మూడు సెషన్లలోనే ఫోబియా నుంచి ఉపశమనం పొందవచ్చు. భయాన్ని ఎదుర్కోవటానికి, భయం లేదా ఆందోళన లక్షణాల నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు ఒక్కోసారి మందులు కూడా అవసరమవుతాయి.  
-సైకాలజిస్ట్‌ విశేష్‌

చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి?

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top