కాంబినేషన్‌ వ్యాక్సిన్లు అంటే... 

About Combination Vaccines for Children - Sakshi

గతంలో ఒక్కో రకం వైరస్‌కు నిర్దిష్టంగా ఒక్కో వ్యాక్సిన్‌ ఇచ్చేవారు. అటు తర్వాత ఒక్క వ్యాక్సిన్‌ డోస్‌లోనే అనేక రకాల వ్యాక్సిన్‌లను ఒకేసారి ఇవ్వడం సాధ్యమైంది. ఇలా ఒకే డోస్‌లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనేలా రూపొందించిన వ్యాక్సిన్లనే కాంబినేషన్‌ వ్యాక్సిన్లు అంటారు. ఉదాహరణకు ‘ఎమ్‌ఎమ్‌ఆర్‌ ప్లస్‌ వారిసెల్లా’ అనే వ్యాక్సిన్‌ ద్వారా మీజిల్స్, మంప్స్, రుబెల్లా, వారిసెల్లా అనే సమస్యలకూ, ‘డీటీఏపీ ప్లస్‌ ఐపీవీ’ అనే వ్యాక్సిన్‌ వల్ల డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, పోలియో అనే సమస్యలకు ఒకే ఒక ఇంజెక్షన్‌ ద్వారానే నివారణ లభిస్తుంది. ఇలాంటి రకరకాల కాంబినేషన్‌ వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల మాటిమాటికీ ఇంజెక్షన్‌లు తీసుకోవాల్సిన అగత్యం తప్పుతుంది.

ఒకే ఇంజెక్షన్‌ ద్వారా మూడు/ నాలుగు/ఐదు సమస్యలను నివారించవచ్చు. చిన్నారులు డాక్టర్‌ దగ్గరకు వెళ్లడానికి అంత సుముఖంగా ఉండరు. అందుకే కాంబినేషన్‌ వ్యాక్సిన్లతో మాటిమాటికీ హాస్పిటల్‌కు వెళ్లాల్సిరావడంతో పాటు కొన్ని వ్యాక్సిన్లను మిస్‌ అయ్యే అనర్థాల్లాంటివి చాలావరకు తప్పుతాయి. టీకా వేయించాల్సిన చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు తమ పీడియాట్రీషియన్‌ను కలిసి, ఏయే కాంబినేషన్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయో, తమ బిడ్డకు ఏవేవి అవసరమవుతాయో తెలుసుకుంటే, తక్కువ ఇంజెక్షన్లలోనే ఎక్కువ వ్యాక్సిన్లు ఇవ్వడానికి వీలవుతుంది. 

చదవండి: (కిడ్నీలో రాళ్ల తొలగింపు ఇప్పుడు తేలికే!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top