Sakshi News home page

15వేలతో మొదలైన బిజినెస్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో విదేశాల్లోనూ ఆర్డర్స్‌

Published Thu, Nov 23 2023 10:32 AM

65 Year Old Hema Sards And Her Daughter In Law Working With Artisans In Gujarat - Sakshi

వ్యాపారానికి సంబంధించిన ఐడియాలు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తేనే వస్తాయి... అనే గ్యారెంటీ లేదు. వ్యాపార విజయాలు ఫలానా వయసుకు మాత్రమే పరిమితం... అనే నియమాలేవీ లేవు. నగలు అంటే బంగారమే... అనే శాసనం ఏదీ లేదు. ఇందుకు ఉదాహరణ ముంబైకి చెందిన హేమా సర్దా...

కొన్ని సంవత్సరాల క్రితం...
దిల్లీలో జరిగిన హస్తకళల ప్రదర్శనకు హాజరైంది హేమా సర్దా. వినూత్నంగా కనిపించిన అస్సామీ బ్యాంబూ జ్యువెలరీని కొనుగోలు చేసింది. ఈ వెదురు నగలు తనకు ఎంతగా నచ్చాయంటే 65 సంవత్సరాల వయసులో ‘బ్యాంబు అండ్‌ బంచ్‌’ రూపంలో డైరెక్ట్‌–టు–కన్జ్యూమర్‌(డీ2సీ) బ్రాండ్‌కు శ్రీకారం చుట్టేంతగా.అస్సాంలోని గిరిజనులు తయారు చేసిన అందమైన వెదురు నగలను తన బ్రాండ్‌ ద్వారా విక్రయిస్తుంది హేమ. మన దేశంలో జువెలరీ అంటే బంగారం, వెండి... అనే అభిప్రాన్ని తన బ్రాండ్‌ ద్వారా మార్చే ప్రయత్నం చేస్తోంది. బయటి ప్రపంచానికి అంతగా తెలియని వెదురు నగలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.

రకరకాల ప్రాంతాలలో తమ ప్రొడక్ట్స్‌కు సంబంధించి ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేసింది. మౌఖిక ప్రచారం ద్వారా వెదురు నగల అమ్మకాలు ఊపందుకున్నాయి. పదిహేను వేలతో వ్యాపారం ప్రారంభించి తన బ్రాండ్‌ను లాభాల బాట పట్టించింది హేమ. వ్యాపార వృద్ధికి సోషల్‌  మీడియాను ప్రధాన వేదికగా మలుచుకుంది. తమ బ్రాండ్‌కు చెందిన వెదురు నగల చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసేది. దీంతో ఎక్కడెక్కడి నుంచో ఆర్టర్లు రావడం మొదలైంది. సంప్రదాయ వెదురు ఆభరణాలకు మోడ్రన్‌ ట్విస్ట్‌ ఇచ్చి కొనుగోలుదారులను ఆకట్టుకునేలా చేయడంలో హేమ విజయం సాధించింది. నాణ్యమైన వెదురును కొనుగోలు చేసి అస్సాంలోని ట్రైబల్‌ ఆర్టిస్ట్‌ల దగ్గరికి పంపుతుంది.



‘అరవై అయిదు సంవత్సరాల వయసులో మార్కెట్‌ తీరుతెన్నులను గురించి తెలుసుకోవడం కష్టమే కావచ్చు. ఈ వయసులో అవసరమా అని కూడా అనిపించవచ్చు. అయితే నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. కొన్నిసార్లు ప్రయాణమే పాఠాలు నేర్పుతుంది. నా విషయంలోనూ ఇదే జరిగింది. మొదట్లో మా బ్రాండ్‌ పెద్దగా సక్సెస్‌ కాలేదు. జరిగిన తప్పులను సవరించుకొని ముందుకు వెళ్లాను’ అంటుంది హేమ.కోడలు తాన్య సహాయంతో మార్కెట్‌ ప్లేస్‌లను లొకేట్‌ చేయడం నుంచి సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఫొటోగ్రఫీ వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంది హేమ.‘నాణ్యమైన నగల అలంకరణకు బంగారమే అక్కర్లేదు అని చెప్పడానికి బ్యాంబూ జువెలరీ ఉదాహరణ. డబ్బు సంపాదన కోసం ఈ వ్యాపారం ప్రారంభించలేదు. వినూత్నమైన కళను ప్రజలకు చేరువ చేయాలనేది నా ప్రయత్నం’ అంటుంది హేమా సర్దా.
  

Advertisement

What’s your opinion

Advertisement