సంబరం
లెక్కల్లో సున్నా మార్కులు తెచ్చుకునే తెలుగు పిల్లాడి కథ. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘ఉత్తమ బాలల చిత్రం’ గా ఎంపికై నూరు మార్కులు తెచ్చుకుంది. 2024 సెప్టెంబర్‌లో విడుదలై నోటిమాటతో హిట్టయిన ‘35 చిన్న కథ కాదు’. ఇప్పుడు ఢిల్లీలోనూ హిట్ కొట్టింది. పిల్లల తెలివిని మార్కులతో కొలవ వద్దనే సందేశం నేటి అవసరంగా భావించి కమిటీ ఈ సినిమాను అవార్డుతో గౌరవించింది.
‘సున్నాకే విలువ లేనప్పుడు మైనస్ వన్, మైనస్ టూలకు విలువ ఎలా వస్తుంది సార్’ అని పెదబ్బ ప్రశ్న. వాడి అసలు పేరు అరుణ్. ఇంట్లో ‘పెదబ్బ’ అని పిలుస్తారు. క్లాస్‌లో అందరూ ‘జీరో బాబు’ అని పిలుస్తుంటారు. దానికి కారణం వాడికి లెక్కల్లో ‘సున్నా’ రావడమే కాదు ‘సున్నా’కు విలువ లేకపోవడం అంటే ఏంటో అర్థం కాకపోవడం వల్ల కూడా. పరీక్షల్లో వాడు సున్నాను దాటి 35 మార్కులు తెచ్చుకుని నెక్స్›్ట క్లాస్‌కు వెళ్లడమే ‘35 చిన్న కథ కాదు’ స్టోరీ. ఈ కథలో పిల్లాడు 35 దాటినట్టుగానే సినిమా సరిహద్దులు దాటింది.
30 ఏళ్ల తర్వాత తెలుగుకు...
1996లో గుణశేఖర్ తీసిన ‘బాల రామాయణం’కు జాతీయ ఉత్తమ బాలల చిత్రం అవార్డు వచ్చింది. 30 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ‘35 చిన్న కథ కాదు’తో తెలుగు సినిమా రంగం ఆ అవార్డును సాధించింది. పిల్లల మనస్తత్వాన్ని, చదువులో పసి మనసులు ఎదుర్కొనే సవాళ్ళను ఈ సినిమా చర్చించింది. పిల్లల్ని అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలా అవగాహనా లేమితో వ్యవహరిస్తారో ఈ సినిమా చూపుతుంది. నందకిషోర్ ఈమని దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో విడుదలైన ఈ సినిమా ‘ప్రతి ఇంటా చర్చించాల్సిన నిజాయితీ గల కథ’ అని ఈ జాతీయ పురస్కార ప్రకటనతో మరోసారి రుజువైంది.
తల్లి తోడుగా నిలిచి...
‘స్కూల్లో కావాల్సింది మేము పిల్లలతో బాగుండటం కాదు. పిల్లలు బాగు పడటం’ అంటాడు ఈ సినిమాలో లెక్కల మాష్టారు. అతని దృష్టిలో అరుణ్ ఒక మొద్దు. అలాంటి పిల్లల్ని అవమానించి, బాధించి దారికి తేవాలనేది అతని ఉద్దేశం. కాని ఉపాధ్యాయుడు బాధించే కొద్దీ పిల్లలు ఇంకా భీతావహులవుతారని ఎందుకు అర్థం చేసుకోరు? అరుణ్ అటు తండ్రి ఒత్తిడికీ, ఇటు ఉపాధ్యాయుడి పీడనకీ మధ్య నలిగిపోతాడు. ఒకసారి ఇంట్లో నుంచి పారిపోతాడు. అలాంటి సమయంలో తల్లే అతనికి తోడు నిలుస్తుంది.
పిల్లాడు చేతికందకుండా పోతాడేమోనన్న భయంతో పదో తరగతి కూడా పాస్ కాని ఆ అమ్మ వాడితో కలిసి తానూ లెక్కలు నేర్చుకుని, కొడుకును గెలిపించేందుకు పోరాటం చేస్తుంది. ‘తనకు తానుగా విలువ లేని సున్నా... ఒకటి పక్కన చేరితే పది అవుతుంది..... అలా ఎదుటివారికి విలువ పెంచుతుంది’ అని చెబుతుంది. ప్రకృతి కూడా ఇదే నియమం మీద పని చేస్తుందని అరుణ్ అర్థం చేసుకుంటాడు. వాడికి లెక్కల్లోని ముడి మెల్లగా విడిపోతుంది. పరీక్ష పాసై విజయ దరహాసం చేస్తాడు. బట్టీ పట్టే విధానం కాకుండా, చదువు వెనుక ఉండే అసలైన సత్యాన్ని, పిల్లల ఆలోచనా విధానాన్ని గౌరవించాలని ఈ కథ ఉద్దేశం.
ఎవరెవరు?
తల్లి పాత్రలో నివేదా థామస్, తండ్రి పాత్రలో విశ్వదేవ్, అలాగే కఠినమైన లెక్కల మాష్టారు పాత్రలో ప్రియదర్శి నటించారు. ఇటీవల మరణించిన దర్శకుడు కె. భాగ్యరాజా ఈ సినిమాలో ప్రిన్సిపాల్‌గా కనిపిస్తారు. నివేదా థామస్ నటనకు తెలంగాణ ‘గద్దర్’ అవార్డు లభించడం మరో గుర్తింపు.
అర్థం చేసుకోండి...
పిల్లలు పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుండి ‘ర్యాంకులు’, ‘మార్కులు’ అనే పెద్ద బరువును మోపుతున్నాం. తక్కువ మార్కులు వస్తే జీవితంలో దేనికీ పనికిరారు అనే ముద్ర వేసే విద్యా వ్యవస్థకు వంత పాడుతున్నాం. అందుకే ‘మాకు మార్కులు కాదు, మమ్మల్ని అర్థం చేసుకునే మనసులు కావాల’ని ఈ సినిమా ద్వారా పిల్లలు అడుగుతున్నారు. ప్రతి పిల్లాడిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ఒకరికి లెక్కలు రాకపోవచ్చు, కానీ కళలలో అపారమైన సృజనాత్మకత ఉండవచ్చు. తల్లిదండ్రుల అండ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే ఏ పిల్లాడూ జీవితంలో సున్నా కాదు అనే నమ్మకాన్ని ఈ సినిమా కలిగించింది. ‘35’ అనేది కేవలం పాస్ మార్క్ మాత్రమే కాదు, అది ఒక పిల్లాడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చాటిచెప్పిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావడం పెద్ద తెలుగు సంబరం.
అది ఈ రోజు నిజం అయింది
‘35: చిన్న కథ కాదు’ సినిమాకి ఉత్తమ బాలనటుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు అందుకున్నాను. అయితే జాతీయ అవార్డుకి ఎంపిక అవుతానని ఊహించలేదు. నేను ఈ స్థాయి వరకు రాగలిగానంటే మా అమ్మ సత్యవాణి ఇచ్చిన ధైర్యం, నాన్న సురేష్‌కుమార్ ఇచ్చిన ఆత్మవిశ్వాసం, చెల్లి బాల ఇచ్చిన బలం. నాకు చాన్స్ ఇచ్చిన డైరెక్టర్ నంద కిశోర్ సార్‌కి థ్యాంక్స్. నా నటన చూసిన తర్వాత తప్పకుండా అవార్డు వస్తుందని చాలామంది చెప్పారు.. అది ఈరోజు నిజం అయింది. ‘35: చిన్న కథ కాదు’ని ప్రేక్షకులందరూ గుండెల్లో పెట్టుకున్నారు.
ఈ సినిమాలో నా నటనకు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అటు కేంద్ర ప్రభుత్వ అవార్డు రావడంతో నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. ఏడుపొస్తోంది. నేను ఈ అవార్డుకి ఎంపిక అయినట్లు ముందు మా డైరెక్టర్‌గారు, ఆ తర్వాత విశ్వదేవ్‌గారు, టీమ్ మెంబర్స్ చెప్పారు. ప్రస్తుతం నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లకు కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. నేను ఎంచుకునే పాత్రలు సవాల్‌గా ఉండటంతో పాటు అవార్డులు వచ్చేలా ఉండాలని ఎంచుకుంటాను.
– ఉత్తమ బాలనటుడు
(అరుణ్ దేవ్ – ‘35: చిన్న కథ కాదు)


