పచ్చ నేతల మట్టి మేత | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల మట్టి మేత

Sep 1 2026 1:13 AM | Updated on Sep 1 2026 1:13 AM

గట్లు మాయం చేస్తూ..

ఏదైనా జరిగితే బాధ్యులెవరు ?

సాక్షి ప్రతినిధి, ఏలూరు : మట్టి మాఫియా రాజ్యమేలుతోంది.. కనిపించిన చిన్నపాటి గుట్టలు మొదలు చెరువుల వరకూ స్వాహా చేయడమే పనిగా పెట్టుకున్న పచ్చనేతలు పోలవరం కుడి కాలువ గట్ల ధ్వంసాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలవరం గట్లను కొట్టి మట్టి, గ్రావెల్‌ దందాకు తెగబడుతున్నారు. అధికార పార్టీ నేతలే కావడం, అన్నింటిలో స్థానిక ఎమ్మెల్యే అండదండలు పూర్తిగా ఉండటం, అధికారులకు కొందరికి నెలవారీలు ఉండటంతో మట్టి దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తాజాగా గుణ్ణంపల్లిలో పోలవరం గట్ల విధ్వంసకాండ కొనసాగుతుంది.

ద్వారకాతిరుమల మండలంలో..

ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం, ఎం.నాగులపల్లి, లైన్‌ గోపాలపురం, గుళ్లపాడులో పచ్చనేతలు రెండేళ్లుగా నిరాటంకంగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్‌, టిప్పర్‌లకు ధరలు నిర్ణయించి అడ్డగోలుగా మట్టి దందాకు తెరలేపారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి ఉద యం 6 గంటల వరకు పదుల సంఖ్యలో లారీల్లో మట్టి మాయమవుతుంది. ద్వారకాతిరుమల మండలం నుంచి భీమవరం, ఉండి, పాలకొల్లులోని చేపల చెరువుల గట్ల పటిష్టత కోసం, కొన్నిచోట్ల వెంచర్ల కోసం, లెవెలింగ్‌ వర్క్‌లకు ఉపయోగిస్తున్నారు. మూడు క్యూబిక్‌ మీటర్ల మట్టిని రూ.800కు, 15 క్యూబిక్‌మీటర్ల టిప్పర్‌ను రూ.3,500కు విక్రయించి నెలకు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పంగిడిగూడెం, ఎం.నాగులపల్లిలో తారాస్థాయిలో మైనింగ్‌ దందా సాగింది. సుమారు ఏడాదిపాటు నిత్యం 100కు పైగా లారీల్లో మట్టి జిల్లాంతటా ఇక్కడి నుంచే రవాణా అయ్యిందంటే ఏ స్థాయిలో దందా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సీరియస్‌ అయి కట్టడి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో మూడు రోజులు తూతూమంత్రంగా నిలిపివేసి నాల్గో రోజు నుంచి పగటి పూట కాకుండా దందా రాత్రి పూటకు మార్చి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలు ఏమయ్యాయి?

జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాను అరికట్టాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఈ ఏడాది మార్చి 28న అధికారులను ఆదేశించారు. కాలువలు, చెరువు గట్లు తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మట్టిని తవ్వి, తరలించడం నేరమని సూచించారు. ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు శాఖలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని, అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాలను అధికారులే బేఖాతరు చేస్తున్నారు. ఫలితంగా మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు.

గుణ్ణంపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై పొక్లెయిన్‌తో అక్రమ మట్టి తవ్వకాలు, బారులు తీరిన టిప్పర్లు

తాజాగా గుణ్ణంపల్లిలో కొద్దిరోజుల నుంచి మట్టి దందా భారీగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కనుసన్నల్లో ఇదంతా జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. దీంతో పాటు స్థానిక పచ్చనేతలు పోలీసులకు, రెవెన్యూ, మైనింగ్‌, ఇరిగేషన్‌కు ప్రత్యేక ప్యాకేజీలు చెల్లించి వేళాపాళా, కనీసం నామమాత్రపు అనుమతులు లేకుండా అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. వాస్తవానికి మైనింగ్‌ శాఖ నుంచి ఇరిగేషన్‌ నుంచి, రెవెన్యూ నుంచి అనుమతి పొంది సెస్‌ చెల్లించి పర్మిట్లు పొంది మైనింగ్‌ చే యాల్సి ఉంటుంది. అలాగే పోలవరం గట్ల తవ్వకాలపై పూర్తి నిషేధం ఉన్నా ఇవేమీ పట్టించుకోకుండా అడ్డగోలుగా గట్ల ధ్వంసం చేస్తుండటంతో గ్రామాలకు ముప్పు వాటిల్లుతుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. కాలువ గట్లను తవ్వడం వల్ల వాటి గట్టు పటిష్టత దెబ్బతింటుంది. భారీ వర్షాలు, కాలువలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు గట్లు బలహీనంగా ఉంటే గండ్లు పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే పరిసర గ్రామాలు, పంట పొలాలు వరద ముంపుకు గురవుతాయి. అప్పుడు ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

పోలవరం గట్టు.. కొల్లగొట్టు

గుణ్ణంపల్లిలో కుడి కాలువ గట్లు స్వాహా

టిప్పర్‌ లోడింగ్‌కు రూ.3,500 వసూలు

ద్వారకాతిరుమల మండలంలో యథేచ్ఛగా మట్టి దందా

నాలుగు గ్రామాల్లో గట్లు ధ్వంసం

గట్ల్లు పటిష్టతపై ప్రజల్లో తీవ్ర ఆందోళన

కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశాలు బేఖాతరు

మామూళ్ల మత్తులో ప్రభుత్వ శాఖలు

కాలువ గట్లపై అక్రమంగా తవ్వుతున్న వారు కొన్ని ప్రాంతాల్లో నాణ్యమైన గ్రావెల్‌ కోసం భారీగా లోతైన గోతులు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన సమయంలో ఈ గోతులు నీటితో నిండిపోతున్నాయని చెబుతున్నారు. ఈ గోతుల్లో రైతులు, కూలీలు లేదా పశువులు ప్రమాదవశాత్తూ పడితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అందుకు బాధ్యత ఎవరిదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement