ఆక్వా రైతులకు ప్రభుత్వం మొండిచేయి
అగమ్యగోచరంగా రైతుల పరిస్థితి
భీమవరం: రొయ్యల రైతులకు పెరిగిన బెల్లం ధరలు గుడిబండగా మారాయి. ఒక పక్క వైరస్, మరొక పక్క ఫీడ్ ధరల పెంపుతో సతమతమవుతున్న రైతులకు బెల్లం ధర విపరీతంగా పెరగడం గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించింది. రొయ్యల చెరువుల్లో పీహెచ్ తగ్గించడానికి రైతులు బెల్లం వాడుతుంటారు. వారానికి ఒకసారి బెల్లం, తవుడు, ఈస్ట్ కలిపి నీటిలో నానబెట్టి చెరువుల్లో చల్లుతుంటారు. ఇటీవల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బెల్లం వాడకం ఎక్కువైందని ఇటువంటి పరిస్థితిలో బెల్లం ధర కిలోకు రూ.30 వరకు పెరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో ఇబ్బందులు
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సక్రమంగా వర్షాలు లేకపోగా అధిక ఉష్ణోగ్రతతో రొయ్యలకు వైరస్ వ్యాపిస్తోంది. ప్రధానంగా నీటిలో నాణ్యత లేకపోవడం, ఆక్సిజన్ సక్రమంగా అందకపోవడంతో రొయ్యలు చనిపోతున్నాయి. ఫ్రొ బయోటిక్స్ పెంచేందుకు రొయ్యలు, చేపల చెరువుల్లో బెల్లం తరచూ వాడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తుండగా వాటిలో ప్రతినెలా సుమారు 500 మెట్రిక్ టన్నుల బెల్లం వినియోగిస్తున్నట్లు అంచనా. గతంలో కిలో రూ.40లకు లభించిన బెల్లం ప్రస్తుతం రూ.70 లకు పెరగడంతో దాదాపు నెలకు రూ.కోటి అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన మేత ధరలకు బెల్లం ధర అదనం
ఆక్వా సాగులో రొయ్యల మేతకు ఎక్కువ పెట్టుబడి పెడుతుండగా ఇటీవల ఫీడ్ ధరలను టన్నుకు రూ. 15 వేలకు పెంచాలని ఫీడ్ తయారీ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఫీడ్ తయారీ ముడిసరుకు ధరలు పెరిగినందున ఫీడ్ ధరలు పెంచకతప్పదంటున్నాయి. ఇప్పటికే ఫీడ్ ధరలు అధికంతోపాటు కూలీల ఖర్చు, చెరువుల లీజులు పెరిగిపోయి ఆక్వాసాగుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి తరుణంలో బెల్లం ధరలు పెరగడం మరింత భారాన్ని పెంచింది. పంచదార ధరలు పెరిగిన నేపథ్యంలో బెల్లానికి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్లం ధరలను అదుపుచేయాలని రైతులు కోరుతున్నారు.
వైరస్, ఫీడ్ దెబ్బకు తోడు.. ఆకాశాన్నంటుతున్న బెల్లం ధరలు
ఉమ్మడి జిల్లాలో ఆక్వాకు ప్రతి నెలా 500 టన్నుల బెల్లం వినియోగం
పెరిగిన ధరలతో నెలకు రూ.కోటి అదనపు భారం
చోద్యం చూస్తున్న ప్రభుత్వం
ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల ఫీడ్ ధరలు కిలోకు రూ.4 తగ్గిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగా ఫీడ్ కంపెనీలు కేవలం రూ. 2 మాత్రమే తగ్గించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రొయ్యల ధరల్లో నిలకడలేకపోయినా ప్రభుత్వం చర్యలు శూన్యం. ప్రస్తుతం బెల్లం ధర పెరిగి ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది తప్ప ధరలను అరికట్టడంలేదు.
– బొల్లెంపల్లి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, అండలూరు
పెరిగిన ఫీడ్ ధరలు, రొయ్యలకు వైరస్ కారణంగా ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరొక పక్క వైరస్ కారణంగా రొయ్యలు చనిపోతున్నాయి. మూలిగేనక్కపై తాటిపండు పడిన సామెత చందాన బెల్లం ధరలు విపరీతంగా పెరగడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రొయ్యల సాగుకు వినియోగించే మేతలు, మందులు, బెల్లం ధరలు తగ్గించకపోతే రొయ్యల సాగు కష్టమే.
– కూనపరెడ్డి వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు, పంజా వేమవరం


