దివ్యాంగ విద్యార్థులకు ప్రశస్త్‌ అండ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ విద్యార్థులకు ప్రశస్త్‌ అండ

Sep 1 2026 1:13 AM | Updated on Sep 1 2026 1:13 AM

దివ్యాంగ విద్యార్థులకు ప్రశస్త్‌ అండ

ఉమ్మడి జిల్లా వివరాలు

హెచ్‌ఎంల ఆధ్వర్యంలో..

తొలి దశలోనే గుర్తించేలా..

లక్షణాల గుర్తింపునకు ప్రత్యేక యాప్‌

నేటి నుంచి డిజిటల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

రెండు దశల్లో 21 రకాల వైకల్యాల గుర్తింపు

నిడమర్రు: పాఠశాల విద్యార్థుల్లో ప్రత్యేక అవసరాలు, దివ్యాంగత్వ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రశస్త్‌ 2.0 పేరుతో ప్రత్యేక డిజిటల్‌ స్క్రీనింగ్‌ యాప్‌ రూపొందించింది. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని, ఈ యాప్‌తో నూరుశాతం రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసేలా కృషిచేసినట్టు సమగ్ర శిక్ష పశ్చిమగోదావరి జిల్లా అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ పి.శ్యామ్‌సుందర్‌ తెలిపారు. మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రశస్త్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు ప్రాథమిక స్క్రీనింగ్‌ పరీక్షలను చేపట్టి ఈనెల 15లోపు పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,366 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 24,352 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు యాప్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు చెప్పారు.

21 రకాల వైకల్యాలపై..

యాప్‌ ద్వారా విద్యార్థుల్లో 21 రకాల దివ్యాంగత్వాలకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలను గుర్తించేందుకు అవకాశం ఉంది. శారీరక, మానసిక సమస్యలను చిన్న వయసులోనే గుర్తించడం ద్వారా విద్యార్థులకు ప్రత్యేక బోధన, వైద్య సేవలు, ఇతర ప్రభుత్వ సాయాలు అందించే వీలుంటుంది.

ఉపాధ్యాయులదే కీలక పాత్ర

ప్రశస్త్‌ యాప్‌లో మొదటి దశ స్క్రీనింగ్‌ను సాధారణ ఉపాధ్యాయులు నిర్వహిస్తారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తన, అభ్యాస సామర్థ్యం, వినికిడి, చూపు, మాట్లాడే విధానం తదితర అంశాలను గమనించి యాప్‌లోని స్క్రీనింగ్‌ ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేస్తారు. అవసరమైతే గుర్తించిన విద్యార్థులను తదుపరి దశ పరిశీలినకు పంపిస్తారు. రెండో దశలో ప్రత్యేక విద్యా నిపుణులు, సంబంధిత సిబ్బంది మరింతగా పరిశీలించి విద్యార్థికి ఎలాంటి ప్రత్యేక అవసరం ఉందనే దానిపై నివేదిక రూపొందిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా తదుపరి వైద్య పరీక్షలు, దివ్యాంగత్వ ఽధ్రువీకరణ, అవసరమైన సేవలకు రిఫర్‌ చేయడం సులభవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

యూడైస్‌ ప్లస్‌కు అనుసంధానం

యూడైస్‌ సంఖ్య ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థుల కోసం ప్రశస్త్‌ యాప్‌ను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించింది. ఈ యాప్‌ను యూడైస్‌ ప్లస్‌ వ్యవస్థతో అనుసంధానం చేయడం వల్ల విద్యార్థుల స్క్రీనింగ్‌, గుర్తింపు, పర్యవేక్షణ ప్రక్రియను మరింత క్రమబద్ధంగా నిర్వహించేందుకు వీలుంటుంది

రెండు దశల్లో స్క్రీనింగ్‌

ప్రశస్త్‌ యాప్‌ ద్వారా మొదటి దశ స్క్రీనింగ్‌ ఉపాధ్యాయులు, రెండో దశలో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పూర్తి చేస్తారు. విద్యార్థి అవయవాల ఉపయోగం, పనులు ఎలా చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, పొడవు, పొట్టి, చేతి వేళ్లు మొదలైన శారీరక అవయవాలకు సంబంధించిన సర్వే ప్రశ్న లు ఉంటాయి. అకడమిక్‌ అంశాలకు సంబంధించి విద్యార్థి చదువు, చూపు, రంగుల గుర్తింపు, కంటి చూపు, చేతి రాత, ఇంటి వర్క్‌, తరగతి గదిలో టీచర్‌, తోటి విద్యార్థులతో ప్రవర్తన వంటి 63 అంశాలను పరిశీలిస్తారు.

జిల్లా పాఠశాలలు, ఉపాధ్యాయులు,

కళాశాలలు అధ్యాపకులు

ఏలూరు 2,344 12,945

పశ్చిమగోదావరి 2,022 11,407

మొత్తం 4,366 24,352

వైకల్యం ఉన్న విద్యార్థులకు త్వరగా దివ్యాంగత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ జారీ ప్రక్రియకు, వారి సమగ్ర శిక్ష ద్వా రా తగిన మద్దతు అందించి వారికి అవసరమైన పరికరాలు, ఇతర సహాయం అందించవచ్చు. అన్ని స్కూళ్లలో మంగళవారం నుంచి హెచ్‌ఎంల ఆధ్వర్యంలో మొదటి దశ స్క్రీనింగ్‌ పరీక్షలు ఉంటాయి.

– పి.శ్యాంమ్‌ సుందర్‌, ఏపీసీ, సమగ్ర శిక్ష, పశ్చిమగోదావరి

ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను తొలిదశలోనే గుర్తించేందుకు ప్రశస్త్‌ 2.0 యాప్‌ దోహదపడుతుంది. ఇప్పటికే యాప్‌పై నమోదుపై శిక్షణ ఇచ్చారు. మొదటి దశలో దివ్యాంగ లోపాలు గుర్తించిన విద్యార్థులను రెండో దశకు రిఫర్‌ చేయాలని ఉన్నత అధికారులు సూచించారు.

– ఎంఎస్‌ఎల్‌ఎస్‌ నారాయణ, పీఎస్‌హెచ్‌ఎం, గణపవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement