ఉంగుటూరు: ఉంగుటూరు రైల్వేగేటు వద్ద లారీ నిలిచిపోవడం అందరినీ టెన్షన్‌కు గురిచేసింది. సోమవారం మధ్యాహ్నం నీలాద్రిపురం నుంచి ఉంగుటూరు వస్తున్న లారీ, గేటు దాటే సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఆగిందా, లేక డీజిల్ కొరతనా అనేది కాసేపు స్పష్టత రాలేదు. ఈలోగా రైళ్లు ఏమైనా వస్తాయేమోనని స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై లారీలో డీజిల్ పోయడంతో అది తిరిగి స్టార్ట్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
భీమవరం: సుదీర్ఘ సర్వీసులో వ్యక్తిగత సుఖాలను పక్కన పెట్టి, ప్రజా రక్షణ కోసం శ్రమించి విమర్శలకు తావులేకుండా సగర్వంగా పదవీ విరమణ చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. పోలీసు విభాగంలో సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ పొందిన సిబ్బందిని సోమవారం ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సిబ్బంది సేవలను శాఖ ఎప్పటికీ స్మరించుకుంటుందని, వారికి వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి, పదవీ విరమణ అనంతరం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్సై ఎం.సోమరాజు, తణుకు రూరల్ ఎస్సై ఎన్.వి.త్రిమూర్తులు, కంట్రోల్ రూమ్ ఎస్సై కె.శ్రీనివాసరావు, కమ్యూనికేషన్ ఎస్సై టి.చిట్టిబాబు, ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్ ఎం.కిషోర్ బాబు, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు జి.యేసురత్నం, ఎస్‌కే అక్బర్ ఆలీ, హోమ్‌గార్డ్ పి.వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్.సత్యనారాయణ, ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఇ.ఇందుమతి, పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్.మోజేష్ తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలి: పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం సంకటహర చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అభిషేకం పండిట్ బమ్మిడిపాటి వెంకన్న బ్రహ్మత్వంలో స్వామివారికి హోమం, పూజలు జరిగాయి. పట్టణానికి చెందిన 14 మంది దంపతులు ఈ హోమక్రతువులో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్, ఆలయ సూపరింటెండెంట్ వాసు ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
భీమవరం: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 2 నుంచి 11 వరకు గుంటూరు విద్యాభవన్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరవధిక ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి బి. రెడ్డిదొర తెలిపారు. భీమవరంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు స్పందించకపోవడంతోనే ఈ ధర్నా చేపడుతున్నామని, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు సెప్టెంబర్ 4న జరిగే ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు జి. ప్రకాశం, ప్రధాన కార్యదర్శి బి.వి. నారాయణ పాల్గొన్నారు.
సెక్యూరిటీ గార్డు నిజాయతీ
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన శ్రీ వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద ఓ భక్తురాలు సోమవారం తన కాలి వెండిపట్టాను పోగొట్టు కుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డుకు ఆ పట్టా దొరికింది. దీంతో దానిని భద్రపరిచి సంబంధిత భక్తురాలి భర్తకు అందజేశారు. బాధ్యతగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డు నిజాయతీని పలువురు అభినందించారు.


