భీమవరం: ఆశా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తూ, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఉమ్మడి జిల్లాల డీసీఎం వెంకట్‌ను విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో జిల్లా స్థాయి ఆందోళనలు చేపడతామని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ సిరిబేగం, సీహెచ్ లక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏఓ వెంకటేశ్వరరావుకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసిన సందర్భంగా వారు మాట్లాడారు. ఆశా కార్యకర్త బ్యాంక్ అకౌంట్ మార్చాలని కోరితే, డీసీఎం వెంకట్ ఏడాది కాలంగా తన కార్యాలయానికి తిప్పుకుంటూ, ఆశా కార్యకర్త పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించడం దారుణమన్నారు. ఫోన్‌లో అసభ్య సందేశాలు (చాటింగ్ మెసేజ్‌లు) పంపి మనోవేదనకు గురిచేస్తున్న విషయాన్ని గతంలో డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఈ ఏడాది మే 25వ తేదీన భీమవరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనా, కొంతమంది అధికారుల పలుకుబడితో వెంకట్ స్టేషన్ బెయిల్ తీసుకొని దర్జాగా బయట తిరుగుతున్నారని ఆరోపించారు. వెంకట్ వేధింపులకు గురైన ఆశా కార్యకర్త గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసినా తీసుకోకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు బి. వరలక్ష్మి, పి. పద్మ, ఆర్. అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.


