బీపీకి కారణాలు
అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ఎన్‌సీడీ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేలో ఎక్కువగా అధిక రక్త పోటు కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో సుమారు 2 లక్షల 70 వేల మంది రక్తపోటు ఉన్న వారిని గుర్తించాం. వైద్యుల సూచనలు పాటిస్తూ బీపీ, సుగర్ వ్యాధులను నియంత్రించుకోవచ్చు.
– డాక్టర్ నరేంద్రకృష్ట, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్
ప్రస్తుత జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార శైలితో అధిక రక్తపోటును అధిగమించవచ్చు.
– డాక్టర్ డాక్టర్ డి.వంశీకృష్ణ, బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం
బుట్టాయగూడెం: ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. బీపీతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. సైలెంట్ కిల్లర్‌గా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అందువల్ల దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండా గుండె, బ్రెయిన్, కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అధిక రక్త పోటు కారణంగా మధుమేహం, స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్‌స్ట్రోక్ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తరచూ రక్తపోటును పరీక్షించుకోవడం, ఆరోగ్య కరమైన జీవనశైలితో రక్తపోటు నివారించ వచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నేడు ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీసాక్షి శ్రీ ప్రత్యేక కథనం
ఆధునిక కాలంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక ప్రభావం వల్ల దినచర్యలో చాలా మార్పులు వచ్చాయి. పూర్వ కాలంతో పోలిస్తే వ్యాయమం లేకపోవడం, శ్రమ లేని పనులు పెరిగిపోయాయి. ప్రతి పనిలో ఒత్తిడి పెరిగిపోయింది. దీనివల్ల బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతుంది. జిల్లా వ్యాప్తంగా బీపీ బాధితులపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సుమారు 2.70 లక్షల మందికి రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు.
బీపీ అంటే..
రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహించి అధిక ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే సమస్యే హై బీపీ. ఒక వ్యక్తి సాధారణ స్థితిలో బ్లడ్ ప్రెజర్(బీపీ) 120/80గా పేర్కొంటారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వయసులో కొన్ని పరిస్థితుల్లో 140/90గా ఉన్నా సాధారణ స్థితిగానే నిర్ధారిస్తున్నారు. చాలా మందికి రక్తపోటు ఉన్నట్లు తెలియకపోడం వల్ల ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. తల నొప్పి, అలసట అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రధించి బీపీ చెక్ చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ అసాధరణ రీతిలో రావడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మెదడు, గుండెలో నరాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవల 20 – 30 ఏళ్ల లోపు యువత గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలతో మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
జాగ్రత్తలు తీసుకోవాలి
అధిక రక్తపోటుతో బాధపడే రోగులు ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా వినియోగించుకోవాలి. మసాలాలు, నిల్వ చేసిన పచ్చళ్లు, కారం తగ్గించాలి. రోజూ గంట పాటు సాధారణ వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
సాధారణంగా వయసు మళ్లిన వారికి రక్తపోటు వస్తుంది. జన్యుపరమైన కారణాలతో కూడా వస్తుంది.
ధూమపానం, ఊబకాయం, ఏ పని చేయకుండా ఒకే చోట గంటల తరబడి ఉండడం, హైపో థైరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకర ఆహార అలవాటుతో పాటు కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్ర పిండాల జబ్బుల వల్ల బీపీ వస్తుంది.
మెడ నరాల లాగేస్తున్నట్లు ఉండడం, కళ్లు తిరగడం, ఆకస్మికంగా తూలిపోవడం, తరచూ తలపోటు రావడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, యూరిన్ తక్కువగా రావడం, కాళ్లు తిమ్మిరిగా ఉండడం బీపీ లక్షణాలు
అధిక రక్తపోటుతో అనర్థాలు
ముందస్తు గుర్తింపుతో ప్రమాద నివారణ
ఆరోగ్యకరమైన జీవన శైలితోనే రక్తపోటు నివారణ
నేడు ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం


