రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

May 17 2026 1:00 AM | Updated on May 17 2026 1:00 AM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి అనుమతి లేకుండానే భూసేకరణ 20, 21 తేదీల్లో ఏలూరులో పోటీలు రేషన్‌ బియ్యం పట్టివేత

తాడేపల్లిగూడెం రూరల్‌: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. మండలంలోని కుంచనపల్లి హైవేను ఆనుకొని ఉంటున్న పమ్మి పుష్ప (40) శుక్రవారం రాత్రి చర్చికి వెళ్ళింది. జాతీయ రహదారి డివైడర్‌ను దాటుతుండగా తణుకు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆమె మృతి చెందింది. శనివారం ఉదయం హైవే పోలీసులు గుర్తించి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏఎస్సై గోపీనాథ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉంగుటూరు: చేబ్రోలు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి తమ స్థలాలు, ఇళ్లు కోల్పోతున్నామని.. కనీసం తమతో చెప్పకుండా, ఎటువంటి సమావేశం జరపకుండా భూసేకరణ చేస్తున్నారని నారాయణపురం మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం నారాయణపురం బాధితులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మా అనుమతులు లేకుండా, కనీసం చర్చలు జరపకుండా భూమిని ఎలా తీసుకుంటారు అని వారు అధికారులను ప్రశ్నించారు. రైల్వే, రెవెన్యూ అధికారులు తమ భూముల జోలికి రావద్దని, అవి తమకు జీవనాధారమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా రోడ్డున పడకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఆర్‌ఓబీ నిర్మాణానికి ఇతర అనువైన ప్రదేశాలు ఉన్నా, వాటిని వదిలేసి పేద ప్రజలు జీవించే ప్రాంతాలలో భూసేకరణ చేయవద్దని డిమాండ్‌ చేశారు. బొమ్మిడి అనిల్‌, శీలం పల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది.

ఏలూరు రూరల్‌: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన శ్రీశాప్‌ లీగ్‌శ్రీ పోటీల్లో భాగంగా.. ఈ నెల 20, 21 తేదీల్లో ఏలూరులో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ ఎస్‌.ఏ.అజీజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మే 20న ఉదయం 9 గంటలకు ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో వెయిట్‌లిఫ్టింగ్‌ యూత్‌ అండర్‌–17 బాలుర విభాగంలో 56 కేజీల నుంచి 95 ప్లస్‌ కేజీల వరకు పోటీలు జరుగుతాయి. దీంతో పాటు యూత్‌ అండర్‌–17 బాలికలు, జూనియర్‌ మెన్‌, జూనియర్‌ అండర్‌–20 విభాగాల్లో వివిధ కేటగిరీల పోటీలు ఉంటాయి. మే 21న స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అండర్‌–16 బాలబాలికలకు హైజంప్‌, లాంగ్‌జంప్‌, జావలిన్‌ త్రో, రన్నింగ్‌ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు జిల్లా జట్లకు ఎంపికై , రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధిస్తారని ఆయన వివరించారు. మరింత సమాచారం కోసం 9440375277, 7981635592 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.

చాట్రాయి: రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్‌ సప్లయిస్‌ డీటీ బాజీ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని పోలవరంలో అక్రమంగా రేషన్‌ బియ్యం దాచారన్న సమాచారం రావడంతో ఏలూరు, నూజివీడు, చింతలపూడి సివిల్‌ సప్లయ్‌ డీటీలు దాడులు చేయగా సాతాని శివాజీ వద్ద 3.50 క్వింటాళ్లు, సాయి కుమార్‌ వద్ద 1.40 క్వింటాళ్లు రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement