పెనుగొండ: డ్వాక్రా మహిళలకు, రైతులకు అందిస్తున్న వ్యవసాయ రుణాలను, ఇతర రుణాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ వీరభద్రరావు తెలిపారు. శనివారం ఆచంటలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని ఆచంట చాంబర్ కమిటీ హాల్‌లో నిర్వహించి రుణాల చెక్కులను అందించారు. యూనియన్ బ్యాంక్‌లో వ్యవసాయ రుణాలు, ఇతర పథక రుణాలపై అవగాహన కల్పించారు. డిపాజిట్లపై వచ్చే వడ్డీని, తిరిగి తక్కువ వడ్డీకి తీసుకొనే అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఫణి, ఏపీఎం రామకృష్ణ, ఆచంట బ్రాంచ్ మేనేజరు కే సుధాకర్, సీహెచ్ శ్రీనివాస్, దివ్య రాంబాబు, కేతా రామకృష్ణ, కోట వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరం పట్టణం బలుసుమూడి ఎస్టీ కాలనీ చర్చిలో మేరిమాత, ఏసుప్రభు విగ్రహాలను ధ్వంసం చేశారని చర్చి పాస్టర్ ఎన్. స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్‌ఐ రామారావు శనివారం చెప్పారు. ఈ నెల 13వ తేదీ రాత్రి చర్చి పక్కన గల ఖాళీ స్థలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి, అక్రమంగా చర్చిలోనికి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
జంగారెడ్డిగూడెం: అదృశ్యమైన మహిళ మృతదేహం శనివారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎర్రకాలువలో లభ్యమైంది. ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంకు చెందిన తోట మేరీ (45) ఈ నెల 7న ఇంటి నుంచి అదృశ్యమైంది. మేరీ సోదరుడు గండే సురేష్ వద్ద ఉంటోంది. ఆమె కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా.. ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 12వ తేదీన జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తోట మేరీ అదృశ్యంపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తోట మేరీ ఆచూకీ కోసం పోలీసులు, ఆమె కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. ఆమెకు మతిస్థిమితం లేదని సోదరుడు సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శనివారం మధ్యాహ్న సమయంలో మేరీ కోసం వెతుకుతుండగా, ఎర్రకాలువలో కుటుంబసభ్యులకు మృతదేహం లభించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మేరీ మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసును మార్చి దర్యాప్తు చేస్తున్నారు.
భీమడోలు: భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని శనివారం ఏలూరు రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాం ట్రాక్ పక్కనే పడి ఉంది. వయసు 70 నుంచి 75 ఏళ్ల మధ్య ఉంటుందని, తెల్లని గడ్డంతో గళ్ల చొక్కా ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. భీమడోలు రైల్వే హెచ్‌సీ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


