వేసవి తాపం.. చేపకు శాపం | - | Sakshi
Sakshi News home page

వేసవి తాపం.. చేపకు శాపం

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

వేసవి తాపం.. చేపకు శాపం

సన్న, చిన్నకారు రైతులు కుదేలు

పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది

ఈ ఏడాది ఎండలు ఎక్కువ

వాతావరణంలో మార్పులతో కొట్టుకుంటున్న మత్స్యం

చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్న ఆక్వా రైతులు

భీమవరం అర్బన్‌: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా రంగం ప్రస్తుతం వాతావరణ మార్పులతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఆక్వా రైతులు చెరువుల్లో చేపలను రక్షించేందుకు ఇంజిన్‌ బోట్లు, ఏరియేటర్లు తిప్పుతూ మరికొన్ని చోట్ల ఆక్సిజన్‌ ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నారు. చేపలను రక్షించుకునేందుకు రైతులు రాత్రులు, పగలు తేడా లేకుండా చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో భీమవరం, ఉండి, నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో సుమారు లక్షా 40 వేల ఎకరాల్లో శీలావతి, కట్ల, ఫంగస్‌, రూప్‌చంద్‌, తిలాఫీ, గడ్డిచేప తదితర సప్పనీటి చేపలను పెంచుతున్నారు. చేపల పెంపకంలో నష్టాలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైతులు వాటిని పెంచేందుకు మొగ్గు చూపిస్తున్నారు. రోజుకు సుమారు 1000 టన్నుల పైగా చేపలు కోల్‌కత్తా, బెంగాల్‌, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. దీంతో కోట్లాది రూపాయలు విదేశీ మారకద్రవ్యం జిల్లాకు చేరుకుంటుంది.

దినదిన గండం

గతేడాది కంటే ఈ ఏడాది ప్రారంభంలోనే ఎండలు ఎక్కువగా ఉండటంతో చేపలు చెరువుల్లోని నీరు ఇంకిపోయి ఉప్పుశాతం పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. గత మూడు వారాలుగా వడగాల్పులు కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఆక్సిజన్‌ శాతంలో హెచ్చుతగ్గులు ఏర్పడడంతో చేపలు ఉపరితలంపై అసహనంగా ఈదుతున్నాయి. దీంతో వాటికి తాటాకు తెగులు, మొప్ప తెగులు, పేను పట్టడం వంటి వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా ఉప్పు శాతం నాలుగుపైగా ఉంటే చేపలు ఒక్కొక్క సారి హఠాత్తుగా మృత్యువాత పడడంమే కాకుండా ఎదుగుదల మందగిస్తుందని రైతులు చెబుతున్నారు.

వేసవి అంటేనే చేపకు గడ్డు కాలం

ఫిబ్రవరి నుంచి పంట కాలువల ద్వారా వచ్చే సాగునీరు వంతుల వారీ విధానంతో చేపలు చెరువులకు నీళ్లు పెట్టడానికి ఆస్కారం తక్కువ ఉండటంతో జూలై నెల వరకు వేసవి తాపానికి తట్టుకుని చెరువులో చేపలు బతికితేనే రైతుకు పెట్టుబడులు వస్తాయని లేకుంటే నష్టాలే మిగులుతాయని రైతులు చెబుతున్నారు. చేపలు చెరువు సాగు చేసే రైతులు ప్రతి వారానికి ఒకసారి నీటిని నింపడంతో పీహెచ్‌, అమ్మోనియా, నైట్రేట్‌ తదితర క్షార గుణాలు అదుపులో ఉంటాయి. సుమారు 4 నెలలు సప్పనీరు లేకపోవడంతో నీటిలో ఉన్న క్షారగుణాల్లో మార్పులు వచ్చి చేపలు మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. నీటి పరమాణువులను అదుపులోకి తీసుకువచ్చేందుకు రసాయనిక మందులు, ఎరువులు వాడాల్సి వస్తుంది.

చేపలు పెంపకంపై ఆధారపడ్డ సన్నచిన్న కారు రైతులు వాతావరణ మార్పులతో కుదేలవుతున్నారు. ఎండలు వల్ల చెరువులో నీటి వేడిమికి తట్టుకోలేక మృత్యుపడతున్నాయని దీంతో ఏటా తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరం చేపల సాగు చేసేందుకు సుమారు రూ.2 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. చేపల సాగు చేయాలంటే 15 ఎకరాలు పైగా చేపలు చెరువు ఉండాలని వెల్లడిస్తున్నారు. చేపలకు మేతలుగా డీఓపీ తవుడు, చెక్క, పత్తిపిండి, పిల్లేట్స్‌ వేస్తుంటారు. చేపకు పెట్టే మేతను బట్టీ 6 నుంచి 9 నెలల్లో కేజీ చేప తయారవుతుందని చెబుతున్నారు. చేప ఎదుగుదల మందగిస్తే చివరకు అప్పులు మిగులుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

వాతావరణంలో మార్పులు కారణంగా ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయించుకుని వాటికి అనుగుణంగా మందులు వినియోగించాల్సి వస్తుంది. దీంతో పెట్టుబడులు ఎక్కువతున్నాయి. ప్రతి రోజు చెరువు వద్దే ఉండి పరిశీలించాల్సి వస్తుంది.

– ఆర్‌ బాలకృష్ణ, ఆక్వా రైతు, దొంగపిండి

నేను రెండు ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నాను. అయితే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడంతో చేపలు మృత్యువాత పడుతుండడంతో పట్టుబడికి రాకముందే పట్టేశాను. దీంతో ఈ ఏడాది నష్టాలు ఎదురయ్యాయి.

– వాటాల విజయకృష్ణ, ఆక్వా రైతు, నాగేంద్రపురం

Advertisement
 
Advertisement
Advertisement