విద్యార్థుల రవాణా చార్జీలు ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల రవాణా చార్జీలు ఎక్కడ?

May 14 2026 12:49 AM | Updated on May 14 2026 12:49 AM

విద్యార్థుల రవాణా చార్జీలు ఎక్కడ? ఆర్‌టీఈ చట్టం నిర్వీర్యం

గతంలోనూ ఇదే తీరు

దెందులూరు: ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, సకాలంలో చెల్లింపులు చేయకుండా కూటమి ప్రభుత్వం మాట తప్పింది. పాఠశాలల విలీనం నేపథ్యంలో విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదు. సమీపంలో పాఠశాలలు లేని గ్రామాల నుంచి వెళ్లే 6–14 ఏళ్ల వయసున్న విద్యార్థులకు నెలకు రూ. 600 చొప్పున, ఏడాదికి రూ.6,000 రవాణా భత్యం అందిస్తామని పేర్కొంది.

ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటరు పరిధిలో లేకపోయినా, ఉన్నత ప్రాథమిక లేదా హైస్కూల్‌ మూడు కిలోమీటర్ల దూరంలో లేకపోయినా రవాణా భత్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై గ్రామ సభలు నిర్వహించి పాఠశాలల విలీనానికి ప్రభుత్వ యంత్రాంగం ముందడుగు వేసింది. విద్యార్థులను దూర ప్రాంత పాఠశాలలకు తరలించిన తర్వాత ఒక్క రూపాయి కూడా రవాణా ఖర్చులుగా చెల్లించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

విలీనం పేరిట విద్యా వ్యవస్థకు దెబ్బ

పాఠశాలలను తొమ్మిది రకాల విభజన పేరిట పునఃవ్యవస్థీకరించి, తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల గ్రామీణ విద్యార్థులు రోజువారీ ప్రయాణ భారాన్ని భరించాల్సి వస్తోంది. రవాణా భత్యం అందకపోవడంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. దీనివల్ల వేల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి, ఇంటి వద్దకే వస్తున్న ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో తరలిపోతున్నారు.

విద్యాహక్కు చట్టానికి విరుద్ధమా?

ఆర్టీఈ చట్టం ప్రకారం విద్యార్థులకు సమీపంలో పాఠశాల లేదా రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ రెండింటిలో ఏదీ సరైన విధంగా అమలు చేయకుండా పాఠశాలల విలీనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాగితాలపై పాఠశాలలు విలీనం అయినట్లు చూపిస్తున్నప్పటికీ, భౌతికంగా విద్యార్థులు ఆ పాఠశాలలకు చేరకపోవడం గమనించాల్సిన అంశం. రవాణా సౌకర్యం లేకపోవడం, రవాణా చార్జీలు చెల్లించకపోవడం వల్ల అనేకమంది విద్యకు దూరమవుతున్నారు.

పాఠశాల ఉనికికే ప్రమాదం

ఈ ఏడాది ఏప్రిల్‌–మే నెలల్లో చేపట్టబోయే కొత్త విలీన ప్రక్రియతో జిల్లా స్థాయిలో వందలాది పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమలు కాని హామీల నేపథ్యంలో మరింత పెద్ద స్థాయిలో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే అవకాశముంది.

రవాణా చార్జీలు విడుదల చేయాలి

విద్యార్థుల హాజరు, ప్రయాణ సౌకర్యాలపై సమగ్ర సమీక్ష చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సమీప పాఠశాలల బలోపేతంపై దృష్టి పెట్టాలి. 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక పాఠశాలలు, 1 నుంచి 8వ తరగతి ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 నుంచి 10వ తరగతి ఉన్నత పాఠశాలలతో కూడిన మూడంచెల విద్యా వ్యవస్థను పునఃవ్యవస్థీకరించాలి.

2015లో కూడా గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ యూనిట్‌గా 100 మంది విద్యార్థులు గల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు, సమీపంలోని రెండు మూడు పాఠశాలలను విలీనం చేస్తూ నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా పాఠశాలలకు ప్రత్యేక పద్దుల్లో నిధులు మంజూరు చేస్తూ, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, ప్రత్యేక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టును, గ్రంథాలయ, భాషా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అవేవీ కార్యరూపం దాల్చకపోగా అనేక పాఠశాలలు మూతపడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement