ఉండిలో రగులుతున్న దేశం | - | Sakshi
Sakshi News home page

ఉండిలో రగులుతున్న దేశం

Feb 20 2026 7:01 PM | Updated on Feb 20 2026 7:01 PM

ఉండిలో రగులుతున్న దేశం

ఉండిలో రగులుతున్న దేశం

మంతెనకు నో వాయిస్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజుపై నియోజకవర్గంలో ధిక్కారస్వరం మొదలైంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగుతమ్ముళ్ల అసమ్మతి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరాజు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఎమ్మెల్యే రఘురామ అరాచకాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది.

ఎమ్మెల్యే వర్సెస్‌ తెలుగు తమ్ముళ్లు

ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్‌ తెలుగు తమ్ముళ్ల వ్యవహారం హాట్‌హాట్‌గా మారింది. దశాబ్దాలుగా టీడీపీలో పనిచేస్తున్న కేడర్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రజాప్రతినిధి దగ్గరకు కూడా రానివ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ ఏదోక వివాదాస్పద చర్యలతో హాట్‌టాఫిక్‌గా నిలిచే ఎమ్మెల్యే వ్యవహారం మరో సారి జిల్లాలోని చర్చగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అందరి వద్ద భారీగా డబ్బులు దండుకుని ఎమ్మెల్యే దోపిడీకి తెరతీశారని, రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలిచాక కోడిపందాలు, జూదం విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆక్వా రైతులను భయాభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్యరాజు) విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసే అరాచకాలను త్వరలోనే ముఖ్యమంత్రికి, లోకేష్‌ను కలిసి ఫిర్యా దు చేస్తానని తెలిపారు. అనధికారిక మట్టి మాఫి యాను అధికారికం చేశారని, ఏ అధికారి కూడా అడ్డుకునే పరిస్థితి లేకుండా చేసి భారీగా దోచుకుంటున్నారని, జిల్లా ఉన్నతాధికారులు కూడా రఘురామకృష్ణరాజుకు మద్దతుగా ఉండి అరాచకాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద గొడవలు చేయాలని రఘురామకృష్ణరాజు ఆదేశిస్తూ తాను వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ శివరామరాజు కార్యాలయం వద్ద రచ్చ చేశానని అన్నారు. తనతో సహా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కలవడానికి ఎవరు వెళ్లినా చేతులు కట్టుకుని నుంచోవాలని, కొత్తపల్లి నాగరాజు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా మారి అక్రమాలు, దందాలు చేస్తున్నారని పొత్తూరి ఆరోపించారు. తాజా పరి ణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదులకు పార్టీ నేతలే సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

ఉండి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజుకు బలమైన వర్గం ఉంది. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామరాజు వర్గాన్ని దూరంగా పెట్టారు. ఎన్నికల సమయంలో టికెట్‌ సర్దుబాటుకు అవకాశం లేకపోతే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రా మరాజు టికెట్‌ను రఘురామకృష్ణరాజుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇబ్బంది ఉండదని మంతెన రామరాజుకు భరోసా ఇచ్చారు. కట్‌చేస్తే.. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మంతెన పాత్రను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కనీసం చిన్నపాటి బదిలీ మొదలు కేడర్‌కు పోస్టింగ్‌లు వేయించడం వరకు కూడా ఏ అంశంలోనూ మంతెన పాత్ర లేకుండా చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామరాజు ఉండి రాజకీయాలు, నియోజకవర్గ పరిస్థితులపై టీడీపీ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో వెంకటేశ్వరరాజు ఆరోపణలను నియోజకవర్గంలోని మూడు మండలాల టీడీపీ అధ్యక్షులు విలేకరుల సమావేశం పెట్టి ఖండించారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడి హోదాలో మంతెన రామరాజు క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని, ఎవరూ మాట్లాడవద్దంటూ ఏకవాక్యంలో ముగించడం విశేషం.

డిప్యూటీ స్పీకర్‌పై ధిక్కార స్వరం

టీడీపీ కేడర్‌ తిరుగుబాటు

రఘురామపై తారాస్థాయిలో అసమ్మతి

తీవ్రంగా వేధిస్తున్నారంటూ రాష్ట్ర కార్యదర్శి ధ్వజం

అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరతీశారంటూ విమర్శలు

నివురుగప్పిన నిప్పులా అసమ్మతి నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement