పీహెచ్‌సీలో నవజాత శిశువు మృతి | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలో నవజాత శిశువు మృతి

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

పీహెచ్‌సీలో నవజాత శిశువు మృతి

పీహెచ్‌సీలో నవజాత శిశువు మృతి

భీమడోలు: పూళ్ల పీహెచ్‌సీలో మగ నవజాత శిశువు మృతిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్లితే.. పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం గ్రామానికి చెందిన పసుపులేటి పావనికి ఉంగుటూరు మండలం బొమ్మిడికి చెందిన వీరే శ్రీనివాస్‌తో ఏడాది క్రితం వివాహమైంది. వారిద్దరు దుబాయ్‌లో జీవనోపాధి కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. పావని తొలి కాన్పు కోసం ఆరు నెలల క్రితం పుట్టిల్లు ఎంఎంపురం గ్రామానికి వచ్చింది. భర్త శ్రీనివాస్‌ దుబాయ్‌లో ఎలక్ట్రిక్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు పావనిని పీహెచ్‌సీలో చేర్చారు. సాయంత్రం సాధారణ కాన్పు అయ్యింది. పుట్టిన మగ బిడ్డను చూసి ఆనందంగా ఉన్న పావలి, కుటుంబ సభ్యులకు కొద్ది సేపటికే విషాదం మిగిలింది. బిడ్డ తక్కువ బరువుతో పాటు ఉమ్మనీరు తాగేసిందని చెప్పి బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంవీ ప్రదీప్‌ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. వారు ఏలూరులోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు నిర్థారించారు. దీనితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోపోద్రిక్తులై మృత శిశువును రాత్రి పీహెచ్‌సీ వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న సీఐ యూజే విల్సన్‌ ఆధ్వర్యంలో ఎస్సై ఎస్‌కే మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, వైద్యుల నుంచి వేర్వేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి అన్న పసుపులేటి మోహన్‌ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ చేస్తామని సీఐ తెలపడంతో ఆందోళన విరమించారు. నవజాత శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపర్చారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటుల సీఐ విల్సన్‌ తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement