ఈ ఒత్తిడి భరించలేం.. | - | Sakshi
Sakshi News home page

ఈ ఒత్తిడి భరించలేం..

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

ఈ ఒత్

ఈ ఒత్తిడి భరించలేం..

కార్యదర్శులు తక్కువ.. పనులు ఎక్కువ

నూజివీడు: నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తయిందా? అంటూ అధికారుల నుంచి పంచాయతీ కార్యదర్శులకు తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. రోజువారీ టార్గెట్‌లు పెట్టి మరీ పరుగులెత్తిస్తుండటంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగినా లక్ష్యానికి తగ్గట్టుగా పన్నులు వసూలు కాకపోవడంతో ఏం చేయాలో తెలియక పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీల్లో పన్నుల వసూలుపై ఉన్నతాధికారులు గ్రూపు కాల్స్‌, కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండటం, లక్ష్యాలను నిర్దేశించడంతో కార్యదర్శులకు ఊపిరి సలపడం లేదు. దీనికి తోడు సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండటంతో అధిక శాతం సర్పంచులు సహకరించకపోవడంతో పన్నుల వసూళ్లు వేగమందుకోలేదు.

జిల్లాలో 3,96,714 అసెస్‌మెంట్‌లు

ఏలూరు జిల్లాలోని 27 మండలాల్లో కలిపి 3,96,714 అసెస్‌మెంట్‌లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటిపన్ను, పన్నెతర టాక్స్‌లు కలిపి మొత్తం రూ.84.42కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇంతవరకు రూ.31.77 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ.52.65 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మొత్తం 37.64 శాతం మాత్రమే వసూలైంది. దీంతో ఉన్నతాధికారులు ఇంటి పన్ను వసూలుపైనే నిరంతరం సమీక్ష చేస్తున్నారు. మార్చి 31 వరకు సమయమున్నా.. వెంటనే వసూలు చేయాలనడంతో కార్యదర్శులు నలిగిపోతున్నారు.

ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తే...

గ్రామాల్లో ఇంటి పన్ను వసూలు ఆర్థిక సంవత్సరం ముగిసే ఒకటి రెండు నెలల్లో కాకుండా ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తే పంచాయతీ కార్యదర్శులపై ఇంత ఒత్తిడి ఉత్పన్నం కాదు. చివరి రెండు నెలల్లో వసూలు చేయాలంటూ వారి మెడపై కత్తి పెట్టడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అక్టోబర్‌ నుంచి వసూళ్లు ప్రారంభిస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా పన్నుల వసూలు నిర్వహించవచ్చు. దీనికి తోడు నవంబరు, డిసెంబర్‌ నెలల్లో వరి పంట తాలూకా డబ్బులు కూడా చేతిలో ఉంటాయి కాబట్టి పన్నులు చెల్లిస్తారు.

మండలాల్లో పంచాయతీలను కార్యదర్శుల కొరత పీడిస్తోంది. ఒక్కొక్క కార్యదర్శి కనిష్టంగా రెండు పంచాయతీల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీంతో రెండు పంచాయతీల్లో చెత్త సేకరణ ప్రక్రియను, రోజువారీ సమస్యల పరిష్కారం, మంచినీటి సమస్యల పరిష్కారం తదితర అనేక పనులను చూసుకోవాల్సి వస్తోంది. వీటన్నింటిని చూసుకుంటూనే పన్నుల వసూలుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను చేరుకోవాలంటే ఒత్తిడి పెరిగిపోతోందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వయసు పైబడిన వారు లేని బీపీ, సుగర్‌ వంటి వ్యాధుల బారిన పడతామేమోనని ఆందోళన చెందుతుంటే, బీపీ, సుగర్‌ ఉన్నవారు అవి కంట్రోల్‌ గాక సతమతమవుతున్నారు. వీటన్నింటికి తోడు ఆన్‌లైన్‌లో సర్వర్‌ సమస్యలు వస్తుండటంతో కార్యదర్శుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

పంచాయతీ కార్యదర్శుల తీవ్ర ఆవేదన

వచ్చే నెలాఖరుకు 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని లక్ష్యం

ఏలూరు జిల్లాలో పెండింగ్‌లో రూ.52.65 కోట్ల పన్ను

ఈ ఒత్తిడి భరించలేం.. 1
1/1

ఈ ఒత్తిడి భరించలేం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement