వరాల మాసం.. రంజాన్
దైవ భీతిని కలగజేస్తుంది
దయా భావం పెరుగుతుంది
● జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
● పవిత్రతకు ప్రతిరూపం.. క్రమశిక్షణకు నిదర్శనం
చింతలపూడి: ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ నెల ఉపవాసాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. బుధవారం నెల వంక దర్శనంతో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు సాగే ఈ కఠిన దీక్షలు కేవలం ఆకలిని తట్టుకోవడమే కాదు.. అంతరాత్మను శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక ప్రయాణం.
ఆధ్యాత్మిక శిఖరం.. రంజాన్
ఇస్లాం ఐదు స్తంభాలలో ‘సౌమ్’ (ఉపవాసం) అత్యంత కీలకమైనది. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లింలు సూర్యోదయానికి ముందు నుంచి (సహర్) సూర్యాస్తమయం వరకు (ఇఫ్తార్) నీరు కూడా సేవించకుండా నిష్ఠగా గడుపుతారు. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు. రంజాన్ దీక్షలో కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అసత్యాలు పలకకూడదు, ఎవరినీ దూషించకూడదు. చెడు దృశ్యాలను చూడకూడదు. చెడు మాటలు వినకుండా భగవన్నామ స్మరణలో గడపాలి. తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచడం (జకాత్) ఈ మాసంలో విధి. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. రంజాన్ నెల ముస్లిం విశ్వాసుల పండుగ. అభిమానానికి, స్నేహానికి ప్రతీకగా దీనిని ఆచరిస్తారు. రంజాన్ నెలలో ముస్లింలు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనతో అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, కై కలూరు, పట్టణాల్లో రంజాన్ పండుగను ముస్లింలు ఏటా ఘనంగా జరుపుకుంటారు.
నిష్ఠతో ఉపవాసాలు
రంజాన్ మాసం ప్రారంభమైన నాటినుంచి ముగిసేవరకు ముస్లింలు పగలు నిష్ఠగా (రోజా) ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానేయడం మాత్రమే కాదు. నియమాలతో కూడుకున్న జీవన విధానాన్ని ఆచరిస్తారు. తెల్లవారు జామున ఆహారం తీసుకోవడాన్ని సహర్ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఇలా ప్రతి రోజు సుమారు 13 గంటలపాటు కఠిన ఉపవాస దీక్షను అవలంభిస్తారు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో ఉపవాసం ఉండలేక పోతే అలాంటి వారు రంజాన్ తర్వాత వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది.
షబ్–ఎ–ఖద్ర్
రంజాన్ నెల ప్రారంభమైన 27వ రోజు షబ్–ఎ–ఖద్ర్ ను ముస్లింలు జరుపుకుంటారు. ఈ రోజున దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఈ రోజున రాత్రంతా జాగరణ చేసి ప్రార్థనలతో గడుపుతారు. ఆ రాత్రి భక్తి శ్రధ్ధలతో ప్రార్థనలు చేసిన వారికి ఎన్నో సంవత్సరాల పాటు ప్రార్థనలు చేస్తే వచ్చే పుణ్యం దక్కుతుందని విశ్వాసం.
జకాత్
ముస్లింలకు నమాజ్, రోజా ప్రకారమే జకాత్ కూడా నిర్ణయింప బడింది. దైవం కోసం, దైవ ప్రసన్నత పొందడానికి ఒక బాధ్యతగా సంపదలో కొంత మొత్తాన్ని పేదలకు అందించడమే జకాత్ ముఖ్య ఉద్దేశం. రంజాన్ నెలలోనే ముస్లింలు విధిగా జకాత్ చెల్లిస్తారు. పేద, ధనిక అంతరాలను రూపుమాపడానికి జకాత్ తోడ్పడుతుందని నమ్ముతారు. జకాత్ అంటే పరిశుధ్ధ పరిచేది అని అర్థం.
ఫిత్రా
రంజాన్ నెల అంతా నమాజులు, ఉపవాసాలు, జకాత్ చెల్లించడంతో పాటు నెల ముగిసి పండుగ జరుపుకునే ముందు ఫిత్రా అంటే దానం చేస్తారు. పేదలుకూడా పండుగ రోజు సంతోషంగా పాల్గొనాలని చేసిన ఏర్పాటు ఇది. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అందరి తరుపున విధిగా ఫిత్రా చెల్లిస్తారు. ఒక్కో ఫిత్రా కింద రెండున్నర కిలోల ఆహార ధాన్యాలు, లేదా అందుకు సమానమైన నగదు చెల్లించాలి.
పది రోజులకో ప్రత్యేకత
30 రోజుల ఉపవాస దినాల్లో ప్రతి 10 రోజులకు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి 10 రోజులు కారుణ్య దినాలుగా భావిస్తారు. అల్లాహ్ కారుణ్యం కోసం ఈ పది రోజులు ఉపవాసం ఉంటారు. 11 నుంచి 20వ రోజు వరకు క్షమాభిక్ష దినాలుగా పరిగణిస్తారు. తమ పాపాలను క్షమించమని అల్లాహ్‌ను వేడుకుంటూ ఉపవాసాలు ఉంటారు. చివరి పదిరోజులు నరకాగ్ని నుంచి కాపాడమని దువాలు చేస్తూ ఉపవాసాలు పాటిస్తారు.
ఉపవాసం మనిషిలో దైవ భీతిని కలుగ చేస్తుంది. కోరికలకు కళ్లెం వేస్తుంది. ఉపవాసం ఉండే మనిషికి మనసు మీద నియంత్రణ సులువు అవుతుంది. ఆరోగ్యంతో పాటు ఇతరుల పట్ల సోదర భావం పెరుగుతుంది. త్యాగ నిరతిని పెంపొందించే ఉపవాస దీక్షలు ప్రతి ముస్లిం విధిగా చేయాలి.
– ఎండీ అక్బర్ ఆలి, జామియా మస్జిద్ కార్యదర్శి
రంజాన్ ఉసవాసాల వల్ల పాపాలు తుడిచి పెడ్తాయి. ఆరోగ్యంతో పాటు ఇతరుల పట్ల సోదర భావం పెరుగుతుంది. ఆకలితో ఉన్నవారు, అవసరాలతో ఉన్న వారి పట్ల దయా భావం పెరుగుతుంది. నెల రోజుల ఉపవాసాల వల్ల పుణ్యం కలుగుతుంది.
– సయ్యద్ మీర్ జాఫర్ ఆలి,
జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు
వరాల మాసం.. రంజాన్
వరాల మాసం.. రంజాన్


