శ్రీవారి దర్శనం టికెట్ల గోల్‌మాల్
● రీప్రింట్ చేసి సొమ్ములు స్వాహా
● ‘సాక్షి’ కథనంతో బట్టబయలు
● ఆలయ చైర్మన్ తక్షణ చర్యలు
ద్వారకాతిరుమల: చినవెంకన్న దర్శనం టికెట్ల రీప్రింట్ వ్యవహారం సంచలనం రేపింది. అంతరాలయ దర్శనం రూ.500 టికెట్లను కొందరు పెద్ద మొత్తంలో రీప్రింట్ చేసి, రూ.లక్షల సొమ్మును స్వాహా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ల దందాపై ఈనెల 15న ‘సాక్షి’లో ‘దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు’ శీర్షికన ప్రచురించిన కథనంపై దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్ నివృతరావు చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు పలువురు అధికారుల విధులను ఆలయ ఈఓ వై.భద్రాజీ మార్పు చే శారు. సూపరింటెండెంట్ ఐవీ రామారావును ఆలయంలో సమస్యలు, ఫీడ్‌బ్యాక్ కౌంటర్, రూ.100, రూ.200 దర్శనం టికెట్ల కౌంటర్లు, మరికొన్ని విభాగాలపై పర్యవేక్షణాధికారిగా నియమించారు. అయితే రూ.500 టికెట్ల రీప్రింట్ వ్యవహారంపై విచారణ జరిపితే పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని భక్తులు అంటున్నారు. అయితే అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంతరాలయ దర్శనం టికెట్ల ద్వారా..
గత నవంబర్ 27న శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని దేవస్థానం పునః ప్రారంభించింది. ఈ మేరకు రూ.500 టికెట్లను విక్రయిస్తోంది. కొందరు సిబ్బంది ఆన్‌లైన్‌లో టికెట్లను డౌన్‌లోడ్ చేసి, వా టిని రీప్రింట్లు చేసి, టికెట్లు స్కానింగ్ చేసే సిబ్బందిని మేనేజ్ చేయడం ద్వారా భక్తులకు దర్శనాలకు పంపి కాసులు దండుకున్నారు. ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందిస్తారు. ఇటీవల శని, ఆదివారం రోజుల్లో ఈ టికెట్లకు సంబంధించి 250 లడ్డూ ప్రసాదాలు తగ్గాయి. అంటే ఆయా రోజుల్లో 125 టికెట్లు రీప్రింట్ జరిగినట్టు స్పష్టమవుతోంది. ఈ ఒక్క ఉదంతంలోనే రూ.62,500 స్వాహా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కనివ్వకుండా మళ్లీ లడ్డూ ప్రసాదాలను తీసుకొచ్చి, అందులో కలిపి మేనేజ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొందరు సిబ్బంది లడ్డూ ప్రసాదాలను సొంతంగా కొని తీసుకొచ్చి మరీ, రీప్రింట్ టికెట్ల ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు ఇస్తున్నట్టు సమాచారం. పలువురు సిబ్బంది సాఫ్ట్‌వేర్ ఆగిందని చెప్పి, తమ ఫోన్‌పేలకు నగదును బదిలీ చేయించుకుని, ఈ రీప్రింట్ టికెట్లు ఇవ్వడం ద్వారా దందాకు పాల్పడినట్టు తెలిసింది.
మా నోటీసుకు రాగానే సీట్లు మార్చాం..
ఆలయ ఈఓ వై.భద్రాజీ వివరణ ఇస్తూ టికెట్లు రీప్రింట్ జరగడం కాదు గానీ, విషయం మా నోటీసుకు రాగానే ట్రస్టుబోర్డులో చర్చించి, టెంపుల్ స్టాఫ్ సీట్లు మార్చామని చెప్పారు.


