సంచలనం రేకెత్తించిన విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్/ఇరగవరం: ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో గురువారం నిర్వహించిన విజిలెన్స్ దాడుల్లో ఎరువులు, పురుగుమందుల అనధికార నిల్వల వ్యవహారం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సరుకు కొనుగోళ్లు చేసి ఎక్కడైనా అమ్మేసుకుంటాం అనే రీతిలో అనధికారిక గోడౌన్‌లో నిర్వహిస్తున్న బ్లాక్ వ్యాపారాన్ని విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ దాడిలో కంతేరు గ్రామంలో దీవెన ఆగ్రో కెమికల్స్ పేరుతో నడుస్తున్న అనధికార గోడౌన్‌లో రూ. 80,01,059 విలువైన 22,893 కిలోల పురుగుమందులు, రూ. 14,34,142 విలువైన 26,474 మెట్రిక్ టన్నుల ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎరువులు, పురుగుమందుల వ్యాపారం నిర్వహణ, అవసరమైన లైసెన్స్‌లు ఉన్నప్పటికీ గోడౌన్‌కు ఎటువంటి అనుమతి లేదని, వ్యవసాయాధికారుల నుంచి డోర్ నంబరుతో సహా తీసుకోవాల్సిన ధ్రువపత్రాలు లేవని గుర్తించారు. అలాగే ఎరువుల నిల్వల్లో తేడాలు ఉండడం వంటి కారణాలతో దీవెన ఆగ్రో కెమికల్స్ సంస్థ ప్రొప్రైటర్ గంటా సురేంద్రపై 6ఏ కేసు నమోదు చేశారు.
వ్యవసాయాధికారుల నిర్లక్ష్య వైఖరి
ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో గత సీజన్‌లో ఎరువుల కొరతతోపాటు అరకొర పంపిణీలో సైతం తమకు కావాల్సిన వారికి మాత్రమే ఇచ్చారంటూ రైతుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తణుకు మండలం ముద్దాపురం సొసైటీలో టీడీపీ నాయకులు తమకు అనుకూలమైన వారికి ముందుగానే ట్రాక్టర్లలో ఎరువుల బస్తాలు ఎక్కించి వారి ఇళ్లలో నిల్వలు చేశారు. ఈ వ్యవహారాన్ని రైతులు నిలదీయడంతో గతేడాది అక్టోబరు నెలలో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. నాయకులు వ్యవసాయాధికారులను సైతం ప్రసన్నం చేసుకుని అధికంగా నిల్వలు చేసుకుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అనధికార నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


