మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు
పాలకొల్లు సెంట్రల్: సాంఘిక నాటక రంగానికి పుట్టినిల్లు అయిన పాలకొల్లులో కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని పాలకొల్లు కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ అడబాల థియేటర్ వెనుక భాగంలో ఉన్న స్థలంలో నాటిక పోటీలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం మొదటి పత్రికను సంస్థ గౌరవ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్‌పీఎన్ వర్మ, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముదినేపల్లి రూరల్ : మట్టి లారీల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయంటూ మండలంలోని పెదగొన్నూరు గ్రామస్తులు లారీలను నిలిపివేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజులుగా ప్రజాప్రయోజనాల కోసమంటూ టిప్పర్లతో గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఇటీవలనే నూతనంగా వేసిన రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో మట్టిని తరలించాలని చెప్పినప్పటికీ టిప్పర్లతో తరలిస్తున్నందున రోడ్లు పాడైపోతున్నట్లు శ్రవణం బాలాజీ అనే గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికై నా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ట్రాక్టర్లతోనే మట్టిని తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తణుకు అర్బన్: పూనేలో ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో తణుకుకు చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందిన తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు బంగారు పతకాలు, అండర్–19 బాలుర విభాగంలో రెడ్డి పవన్ హర్షవర్థన్ రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం, అండర్–7 విభాగంలో ఖండవల్ల మయాంక్ కాంస్య, అండర్–5 బాలికల విభాగంలో మండల నిహస్వి కాంస్య పతకం సాధించినట్లు కోచ్ లావణ్య శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరు త్వరలో మాల్దీవుల్లో నిర్వహించే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి సన్నిధిలో మార్చి 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాలు, పాల పోటీలను నిర్వహించనున్నట్టు గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు యు.చక్రపాణి తెలిపారు. ఈ మేరకు పోటీలు జరిగే మార్కెట్ యార్డు స్థలాన్ని శుక్రవారం ఆయన ఏఎంసీ చైర్మన్ వై.బ్రహ్మరాజుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో గోసమ్మేళనం పేరుతో కొంత కాలంగా ఒంగోలు, పుంగనూరు జాతి గోవులకు అందాలు, పాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు, పశువులకు అన్ని సౌకర్యాలను కల్పించి, పోటీల్లో గెలుపొందే గోవులకు బహుమతులను అందిస్తామన్నారు.
జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా (పార్లమెంట్) జంగారెడ్డిగూడెంకు చెందిన బీవీఆర్ చౌదరి నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా బీవీఆర్ చౌదరిని పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు.
మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు
మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు
మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు


