ముగిసిన మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు
● అమ్మవారికి మహానివేదన సమర్పణ
● అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు
భీమవరం(ప్రకాశం చౌక్): దాదాపు నెల రోజుల నుంచి నీరుల్లి కూరగాయపండ్లు వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమావుళ్లమ్మ వారి 62వ వార్షిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి, అన్నసమారాధన నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు, ఉత్సవ నిర్వాహకులు అమ్మవారికి పలు రకాల పిండి వంటలు, స్వీట్స్,పులిహోర తదితర వాటిని మహా నివేదనగా సమర్పించారు.
రూ.1.45 లక్షలు పలికిన లడ్డూ
ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి సమర్పించిన 36 కిలోల లడ్డును వేలం వేయగా భీమవరానికి చెందిన బోడపాటి చినబాబు అనే భక్తుడు రూ 1.45 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు.
లక్ష మందికిపైగా అన్నప్రసాదం
ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన ప్రసాదం వితరణ నిర్వీరామంగా కొనసాగింది. భీమవరం పట్టణంతో పాటు జిల్లా నలుమూలు నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ప్రత్యేక క్యూలైన్లు ద్వారా భక్తులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అన్నదాన ప్రసాదం స్వీకరించారు. మిగిలిన వారికి అమ్మవారి ఆలయం ముందు ఖాళీ ప్రదేశంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయం పడమటివైపు తాలూకాఫీసు సెంటర్, దక్షిణంవైపు వేణుగోపాల స్వామి ఆలయం సెంటర్, ఆదివారం బజారు రోడ్డు, అన్నదానానికి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు లక్ష మంది అన్నప్రసాదం తీసుకున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
ముగిసిన మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు
ముగిసిన మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు


