రెసిడెన్షియల్ శిక్షణ
ఒత్తిడితో చిత్తవుతున్న విద్యార్థులు
●సీ, డీ గ్రేడుల విద్యార్థులకు 30 రోజుల ప్రణాళిక
●హాస్టళ్లలో ఉండి చదవాల్సిందేనని ఉన్నతాధికారుల హుకుం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వరంగ విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎంతగా భ్రష్టు పట్టించాలో? అంతగా భ్రష్టుపట్టిస్తోందని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. కొత్తకొత్త విధానాలను తెరపైకి తీసుకువచ్చి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెసిడెన్షియల్ శిక్షణ పేరుతో విద్యార్థులను కచ్చితంగా హాస్టల్స్‌లో ఉండి చదివించాల్సిందేనని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులపై పలు యాప్‌ల బారం మోపడంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి వాటికి నిధులు విడుదల చేయకపోవడంతో సొంత ఖర్చుతో ఉపాధ్యాయులు ఆయా కార్యక్రమాలను బలవంతంగా చేయాల్సి వచ్చింది. పదో తరగతి పర్యవేక్షణకు విద్యాశాఖ అధికారులను కాక విద్యారంగంపై ఏ మాత్రం అవగాహన లేని ఇతర శాఖల అధికారులను నియమించడం, ఇన్విజిలేషన్‌కు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా నియమించాలని నిర్ణయం తీసుకోవడం విద్యారంగ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆచరణ సాధ్యంకాని నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేయాలని పీకల మీద కత్తిపెట్టడంతో ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారు.
30 రోజుల ప్రణాళిక పేరుతో...
మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే విద్యార్థుల విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వారిని ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా విభజిస్తూ ప్రత్యేకంగా దృష్టి చదివిస్తూ ఉంటారు. తాజాగా పబ్లిక్ పరీక్షలు ముందున్న నేపథ్యంలో సీ, డీ గ్రేడుల విద్యార్థుల కోసం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చింది. వారిని బలవంతంగా చదివించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. అలాగే విద్యార్థులను సైతం ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది.
హాస్టల్స్‌కు రావాల్సిందే
సీ, డీ గ్రేడు విద్యార్థులను బలవంతంగా చదివించడానికి రెసిడెన్షియల్ శిక్షణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు సీ, డీ గ్రేడ్ విద్యార్థులతో పాటు తరగతులకు ఎక్కువ రోజుల పాటు హాజరు కాని విద్యార్థులను గుర్తించి వారిని రెసిడెన్షియల్ శిక్షణకు హాస్టళ్లకు తరలించారు. విద్యార్థినులను ఏలూరుకు సమీపంలోని వట్లూరు గురుకుల బాలికల వసతి గృహానికి తరలించారు. అలాగే బాలురను నగరంలోని అమీనా పేటలో ఉన్న బీసీ బాలుర హాస్టల్‌కు తరలించారు. ఈ మేరకు ఏలూరు పరిధిలో 120 మంది విద్యార్థిని, విద్యార్థులను ఇప్పటికే ఆయా హాస్టళ్లకు తరలించి శిక్షణకు ఏర్పాటు చేశారు.
మామూలుగానే చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థులు రెసిడెన్షియల్ శిక్షణ పెద్ద శిక్షగా భావిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా బలవంతపు చదువులు వారిని మానిసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు ఇంటిపై, తల్లిదండ్రులపై బెంగ పెట్టుకుని రోధిస్తుండడంతో హాస్టళ్ల వార్డెన్లు వారిని ఇళ్లకు పంపేస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులు కొత్త ప్రదేశంలో ఇమడలేక అనారోగ్యానికి గురవుతున్నారు. వారిని సముదాయించి అక్కడే ఉంచాలంటే విద్యాశాఖాధికారులకు సమస్యగా మారింది. ఇప్పటికై నా ప్రభుత్వం రెసిడెన్షియల్ శిక్షణపై పునరాలోచించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.


