అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య

Feb 14 2026 7:59 AM | Updated on Feb 14 2026 7:59 AM

అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య

అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య

అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు కోడి పుంజుల స్వాధీనం కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్‌

ముదినేపల్లి రూరల్‌: అత్త వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దేవపూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గురిండి గ్రామానికి చెందిన సింధుపురం సంతోషిని(27) దేవపూడికి చెందిన చేడు మహేష్‌ను ప్రేమించి 2023లో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సంతోషిని బంధువులు అంగీకరించినప్పటికీ మహేష్‌ తల్లి ఒప్పుకోలేదు. అయినప్పటికీ వీరిరువురు వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కూతురు ఉండగా తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. దీంతో అత్త అప్పలనరసమ్మ తరచూ కోడలైన సంతోషిని అనారోగ్యవంతురాలైన కూతురిని కన్నావంటూ వేధిస్తోంది. అయితే ఇటీవల మళ్లీ సంతోషిని గర్భం దాల్చింది. అయినప్పటికీ అత్త వేధింపులు ఆపకపోవడంతో పడక గదిలో ఫ్యాన్‌కి ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి సంతోషిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సంతోషిని సోదరుడు సింగుపురం శేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వీరభద్రరావు గుడివాడ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దెందులూరు: మండలంలోని గాలాయగూడెంలో 2022లో సలాది ఉదయ కిరణ్‌ను హత్య చేసిన పాలడుగు దుర్గాప్రసాద్‌కు శుక్రవారం జీవిత ఖైదును, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ ఏలూరు 5వ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి మురళీకృష్ణ తీర్పు చెప్పారు. ఎస్సై రాజమల్లు శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఉదయ్‌ కిరణ్‌కు దుర్గాప్రసాద్‌ తమ్ముడు డబ్బులు ఇవ్వాలి. డబ్బుల గురించి దుర్గాప్రసాద్‌ తమ్ముడికి, ఉదయ కిరణ్‌కు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ విషయాన్ని తన అన్న దుర్గాప్రసాద్‌కి చెప్పడంతో ఉదయ్‌ కిరణ్‌ ఇంటికి వెళ్లి నిలదీశాడు. ఇరువురి మధ్య వాగ్వివాదం పెరిగి దుర్గాప్రసాద్‌ కత్తితో ఉదయ్‌కిరణ్‌ తల వెనుక భాగంలో నరికాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్‌కిరణ్‌ను గుంటూరు వైద్యశాలకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ కేసులో తాజాగా న్యాయమూర్తి నిందితుడికి శిక్ష వేశారు.

ఉండి: మండలంలోని ఆరేడులో చోరీకి గురైన కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణపవరం గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి రవితేజ రొయ్యల చెరువుల గట్లపై పెంచుతున్న కోళ్లను బుధవారం రాత్రి చోరీ చేసిన ఘటన పాఠకులకు విధితమే. గురువారం సాయంత్రం ఆ కోళ్లను ఆటోలో తరలిస్తున్న వీరవాసరం మండలం వడ్డిగూడేనికి చెందిన సైదు మోహన్‌రావును ఎన్నార్పీ అగ్రహారం వద్ద పోలీసులు అరెస్టు చేసి, కోళ్లను స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్‌ చేశారు. శుక్రవారం నిందితుడిని రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు.

పెదపాడు: నిషేధిత కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని సీజ్‌చేసి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెదపాడు పోలీసులు శుక్రవారం విలేకరులకు తెలిపారు. మండలంలోని తోటగూడెం వైపునకు కోళ్ల వ్యర్థాల వాహనం వస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తోటగూడెం సెంటర్‌లో కాపుగాసి వాహనం సీజ్‌ చేశామని తెలిపారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement