వైభవంగా శ్రీనివాస కల్యాణోత్సవం
జంగారెడ్డిగూడెం: పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్‌లో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలతో ఈ కల్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరులతో కూడిన కల్యాణమూర్తికి ఐవీ రామాంజనేయులు ఇంటి వద్ద అభిషేకాలు విశేష అర్చన వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం శోభాయాత్రగా కల్యాణ వేదిక వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి ప్రత్యేక అలంకరణ చేసి గోదా పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా ఏర్పాటు చేసిన భక్తిసంగీత విభావరి భక్తులను అలరించింది. కార్యక్రమ వ్యాఖ్యాతగా బ్రహ్మశ్రీ ఈమని శశి కుమార్ శర్మ వ్యవహరించగా, ఎమ్మెల్యే ఎస్.రోషన్ కుమార్, రాజాన సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.కాంతారావు, ఎం.ఆదినారాయణ డీటీఎఫ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమం కోసం శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కార్యవర్గం జూమ్ సమావేశం నిర్వహించింది. సంఘ నాయకులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని, పాఠశాలలో మాతృభాషా మాధ్యమం అమలు తదితర డిమాండ్లతో విజయవాడలో ఈ ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో డీటీఎఫ్ ఉపాధ్యక్షుడు ఎస్‌ఏవీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.


