నయనానందకరం శ్రీవారి గ్రామోత్సవం
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగుతున్న శ్రీవారికి అడుగడుగునా భక్తులు హారతులు పట్టి, నీరాజనాలు సమర్పిస్తున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన స్వామివారి గ్రామోత్సవం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ ప్రతి ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీవారికి భక్తులు హారతులిచ్చి, నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవం అనంతరం గుడి సెంటర్‌లోని ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు.


