ఎర్రకాల్వలో ఇసుక దందా
ప్రజాప్రతినిధి అండదండలతో..
స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతోనే ఈ వ్యవహారమంతా సాగుతుంది. వీఆర్‌ఓ మొదలుకొని మైనింగ్ అధికారుల వరకు అందరికీ నెలవారీ ముడుపులు ఖరారు చేశారు. ప్రజాప్రతినిధి సహకారం అన్ని విధాలుగా ఉండటంతో పాటు మామూళ్లు సక్రమంగా అందుతున్నట్లు సమాచారం. వీఆర్‌ఓ, ఇతర రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్, మైనింగ్, ఎస్‌ఐ, పొలిటికల్ ఇలా అందరికీ ముడుపులు చెల్లించి బహిరంగంగా సాగిస్తున్నారు. అక్రమ దందాపై స్థానికంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారుల నుంచి వెంటనే ఇసుక మాఫియాకు సమాచారం అందిస్తారు. సంఘటన స్థలం నుంచి లారీలు, జేసీబీలు పంపి ఒకటి, రెండు ట్రాక్టర్లు పెట్టి నామమాత్రపు కేసులు పెట్టేలా వ్యవహారం సాగిస్తున్నారు. నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున సాగుతున్నా ట్రాక్టర్లతో అక్రమంగా రవాణా చేస్తున్న కేసులు మాత్రమే నమోదు చేస్తున్నారు. రోజూ స్థానిక లారీలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చే లారీలు 20 వరకూ ఉంటాయి. మూడు జేసీబీలతో తవ్వకాలు కొనసాగుతున్నారు. అక్రమ ర్యాంపుల నిర్మాణంతో ఎర్రకాల్వ ప్రవాహానికి అడ్డుకట్ట పడింది.
గంగవరం సమీపంలోని ఎర్రకాల్వలో జేసీబీతో తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎర్రకాల్వను దోచేస్తున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల వెంట ఉన్న ఎర్రకాల్వలో ఇసుక మాఫియా పగలూ రాత్రి తేడా లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తుంది. కాల్వకు నాలుగు ప్రాంతాల్లో ప్రైవేటు పొలాలను లీజుకు తీసుకుని ర్యాంపులు నిర్వహించి అక్రమ రవాణా సాగిస్తున్నారు. కొయ్యలగూడెం మండలం గంగవరం కేంద్రంగా ఈ ఇసుక దందా సాగుతోంది. రోజూ 50కి పైగా లారీలతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఇసుక తరలిస్తున్నారు. గ్రామ స్థాయి అధికారి మొదలుకొని ప్రజాప్రతినిధి వరకు అందరికీ ముడుపులు ఖరారు చేసి నెలరోజులుగా దందా సాగిస్తున్నారు.
ఆరు నెలలుగా అక్రమ తవ్వకాలు
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం నుండి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ఎర్రకాల్వ విస్తరించింది. కరాటం కృష్ణమూర్తి జలాశయం వద్ద బయనేరు, జల్లేరు కాల్వలు ఎర్రకాల్వలో కలిసి దిగువన నిడదవోలు దగ్గర గోదావరి కాల్వలో కలుస్తుంది. గత ఆరు నెలలుగా జంగారెడ్డిగూడెం మొదలుకొని నల్లజర్లలోని సుభద్రపాలెం వరకు యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగించారు. నెల రోజుల నుంచి కొయ్యలగూడెం మండలాన్ని కేంద్రంగా చేసుకుని దోపిడీ పర్వానికి తెరదీశారు. కొయ్యలగూడెం మండలంలోని గంగవరం, రాజవరంలో రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. సుమారు 3 కిలోమీటర్ల మేర ఎర్రకాల్వను పూర్తిగా తవ్వేశారు. కొయ్యలగూడెం మండలంలోని మంగపతిదేవునిపేట వద్ద ప్రారంభమై నల్లజర్ల మండలంలోని పోతిరెడ్డిపాలెం వరకు ఎర్రకాల్వపై అక్రమ రవాణాకు వీలుగా నాలుగు ర్యాంపులు నిర్మించి రాకపోకలు సాగిస్తున్నారు.
ఎర్రకాల్వ సమీపంలోని పొలాలను లీజుకు తీసుకున్నారు. ఎకరాకు ఏటా లక్ష చెల్లించి ఆ పొలంలో ఎలాంటి సాగు చేయకుండా పొలం వెంట రహదారి నిర్మించి జేసీబీలతో కాల్వ గర్భంలో ఇసుక తవ్వి లారీల్లో నింపి తోడేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో దాదాపు వెయ్యికిపైగా లారీల్లో ఇసుకను ఏలూరు, చింతలపూడి, గోపాలపురం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో విక్రయించారు. దూరాన్ని బట్టి రూ.5 వేలు మొదలుకొని రూ.30 వేల వరకు లారీకి వసూలు చేస్తున్నారు.
ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే అక్రమంగా రవాణా
కాల్వ గట్లకు ర్యాంపులేసి మరీ భారీగా తవ్వకాలు
రోజూ 50కు పైగా లారీల ఇసుక తరలింపు
మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులకు తెలిసే అక్రమ దందా
ఎర్రకాల్వలో ఇసుక దందా
ఎర్రకాల్వలో ఇసుక దందా


