నిరుద్యోగులను నిండా ముంచారు
ఏలూరు (టూటౌన్): ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంతవరకూ నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి రాగానే డీఎస్సీ ప్రకటన చేస్తామని చెప్పి.. 10 నెలలైనా ఉలుకూ పలుకూ లేదు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. ఇక గత ప్రభుత్వం అమలు చేసిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే యోచనపై కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మండిపడుతున్నారు.
జిల్లాలో 1.50 లక్షలకు పైగా నిరుద్యోగులు
నిరుద్యోగ యువతకు ప్రతీ నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. కూటమి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని డప్పాలు కొట్టిన నాయకులు ప్రస్తుతం దాని ఊసే ఎత్తక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు జిల్లాలో 16.50 లక్షల మంది వరకు జనాభా ఉన్నారు. వీరిలో 8 నుంచి 10 శాతం నిరుద్యోగ యువత ఉన్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 1.50 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పిస్తుందనే ఆశలో ఉన్నారు. లేని పక్షంలో ప్రతీ నెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు చొప్పున అందిస్తుందని ఓటు వేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి ప్రకనట చేయలేదు. అధికారం చేపట్టి 10 నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్‌లో భాగంగా హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలును కొండెక్కించడం పట్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అవకాశం వస్తే తమ సత్తా చూపేందుకు సన్నద్ధమవుతున్నారు.
డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన
అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యయ ఖాళీలను భర్తీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే డీఎస్సీ అభ్యర్థుల కంటి నీరు తుడిచేలా డీఎస్సీ ప్రకటన చేశారు. 10 నెలలు కావస్తున్నా దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పాలకులు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులైన తమను మోసం చేసారని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆట లాడుకోవడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహాం
గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆప్కాస్ విధానం రద్దు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉండటం పట్ల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు, సంస్థలు, వ్యక్తులు లేకుండా ఆప్కాస్ ద్వారా నేరుగా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించడం, పీఎఫ్, ఈఎస్‌ఐ ఖాతాలలో తమ వాటాను జమ చేయడం వంటి వాటి వల్ల సుమారు 10 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. ఆప్కాస్ రద్దు చేసి మళ్లీ పాత విధానాన్ని ప్రవేశపెడితే తమకు కష్టాలు తప్పవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగ భృతి ఊసే లేదు
మెగా డీఎస్సీ దగా డీఎస్సీనే..
ఆప్కాస్ రద్దు యోచనపై అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన
జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది ?
ఏటా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామంటూ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇవ్వాలి. తొలగించిన వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారికి నెలకు రూ.10 వేలు వేతనం ఇవ్వాలి.
– జి.సూర్యకిరణ్, జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్‌ఐ
సూపర్ సిక్స్ అమలులో విఫలం
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైంది. ఇంట్లో చదువుకునే ప్రతి పిల్లవాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పేరుతో వేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం తగదు. తక్షణం మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి.
– కే.లెనిన్, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ, ఏలూరు జిల్లా
నిరుద్యోగులను నిండా ముంచారు
నిరుద్యోగులను నిండా ముంచారు


