బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు 11వ పీఆర్‌సీ, డీఏ, సరెండర్ లీవ్, సీపీఎస్ ఉద్యోగుల బకాయిలతో కలిపి రూ.23 వేల కోట్ల నిధులు చెల్లించాల్సి ఉందని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ గుగులోతు మోహన్‌రావు అన్నారు. ఈ బకాయిల చెల్లింపుకు తక్షణమే రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్‌టీయూ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన జిల్లా స్థాయి ఫ్యాప్టో సమావేశంలో చైర్మన్ మోహన్‌రావు మాట్లాడుతూ 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు విడతల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. సీపీఎస్, జీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారిని పాత పింఛన్‌లోకి తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోని సైతం అమలు చేయని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ రెండో తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో చైర్మన్‌లు జీ వెంకటేశ్వరరావు, జీ ప్రకాశరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌లు ఎం.శామ్యూల్, ఈసీ సభ్యులు ముస్తఫా ఆలీ, కె.ఆర్.పవన్ కుమార్, ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ బీ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


