లారీ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి

Mar 22 2025 1:14 AM | Updated on Mar 22 2025 1:11 AM

పెనుమంట్ర: మండలంలోని నెగ్గిపూడి గ్రామ పంచాయతీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టిప్పర్‌ లారీ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మార్టేరులోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సిర్ల సుజాత (55) అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహం తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యింది. భోజన విరామ సమయంలో తన యాక్టివా మోటార్‌ సైకిల్‌పై పాఠశాల నుంచి నెగ్గిపూడిలోని ఇంటికి వెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె భర్త సిర్ల చిన్న సూర్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు పెనుమంట్ర ఎస్సై కె.స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి

ఏలూరు(మెట్రో): సరెండర్‌ లీవ్‌లు, ఆర్జిత సెలవుల బకాయిలు వెంటనే చెల్లించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి నెరుసు రామారావు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6200 కోట్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఉద్యోగ వర్గానికి రెండు విడతల సరెండర్‌ లీవులు సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రాన్‌ అకౌంట్‌లో జమ చేయాలని డిమాండ్‌ చేశౠరు. రిటైలర్‌ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్‌, ఆర్జిత సెలవుకు సంబంధించిన బకాయిలు, పోలీసులకు సరెండర్‌ లీవ్‌ నిధులను కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు కనకదుర్గమ్మ గుడి వద్ద శుక్రవారం ఓ మోటార్‌ బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం వేగివాడకు చెందిన గంటా భరత్‌(21), గోపాలపురానికి చెందిన చల్లా సుబ్రహ్మణ్యం ఇద్దరూ స్నేహితులు. వారు శుక్రవారం వ్యక్తిగత పనుల నిమిత్తం ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం బైక్‌పై వెళ్లి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు భీమడోలు వైపుగా వస్తున్నారు. కనకదుర్గ గుడి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయాయ్యి. వారిని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి ఏలూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గంటా భరత్‌(21) మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సుబ్రహ్మణ్యాన్ని విజయవాడ తరలించారు. ఈ మేరకు భీమడోలు ఎస్సై వై.సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు

పదోన్నతులు కల్పించాలి

తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు మార్చి నెలాఖరులోగా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు, అమరావతి జేఏసీ సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. యూనియన్‌ పశ్చిమగోదావరి జిల్లా రీజనల్‌ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం స్థానిక సూర్యవంశీ ఎన్‌క్లేవ్‌లో రీజినల్‌ అధ్యక్షుడు ఎన్‌వీ ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆరేళ్లు గడిచినా ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. మూడు వేల మంది సిబ్బంది ప్రమోషన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పదోన్నతులతో పాటు 11వ పీఆర్‌సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరండర్‌ లీవ్‌ సొమ్ములు దశలవారీగా చెల్లించాలని కోరారు. తొలుత పట్టణంలో ఈయూ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.డీ ప్రసాద్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్‌,సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల బీమారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement