
పశ్చిమ మన్యంలోని అటవీ ప్రాంతం
● అడవుల పెంపునకు ప్రభుత్వం ప్రత్యేక కృషి ● ఉమ్మడి జిల్లాలో 1.32 లక్షల హెక్టార్లలో అడవులు ● నేడు అంతర్జాతీయ అటవీ దినోత్సవం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది అడవులు. పొడవాటి చెట్లు, ఎత్తయిన కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్లు ఆకట్టుకుంటాయి. అయితే అడవులు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అడవుల సంరక్షణ కోసం ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు తగు చర్యలు చేపడుతున్నా స్మగ్లర్లు యథేచ్చగా అడవిలో చెట్లను నరికి అక్రమంగా కలప తరలించుకుపోతున్నారు. కలప అక్రమ రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి స్మగ్లర్లను పట్టుకుని కేసులు పెట్టినా ఆగడం లేదు. ప్రతీ సంవత్సరం మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులను నరుకుతూ పోతే జీవరాశుల మనుగడకు ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
జిల్లాలో 1.32 లక్షల హెక్టార్లలో అడవి
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అడవులు 1.32 లక్షల హెక్టార్లుగా ఉంది. 85 శాతం ఏజెన్సీ ప్రాంతంలోనే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 48 మండలాల్లో 1,32,302 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, కుక్కునూరు, పోలవరం, వేలేరుపాడు, జీలుగుమిల్లి ఐదు గిరిజన మండలాల్లో 1,12,445 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. బుట్టాయగూడెం మండలంలో 21,879 హెక్టార్లు, పోలవరం మండలంలో 27,927 హెక్టార్లు, జీలుగుమిల్లి మండలంలో 8,903, వేలేరుపాడు మండలంలో 29,476, కుక్కునూరు మండలంలో 22,259, టి.నర్సాపురం మండలంలో 4,384, చింతలపూడి మండలంలో 6,580, కామవరపుకోట మండలంలో 1,178, లింగపాలెం మండలంలో 2,119, గోపాలపురం మండలంలో 649, ద్వారకా తిరుమల మండలంలో 813, నల్లజర్ల మండలంలో 2,174, పెదవేగి మండలంలో 1,332, ఉంగుటూరు మండలంలో 1,226 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఒకప్పుడు 23 శాతంగా ఉన్న అడవులు ప్రస్తుతం 22.02 శాతంగా ఉన్నాయి.
పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకం
వాతావరణంలోని కార్బన్‌డయాకై ్సడ్, ఆక్సిజన్ సమతుల్యతను కాపాడడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయి. ఉష్ణోగ్రతల్ని తగ్గించడంలో అడవులు సాయపడతాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టం ఎక్కువగా ఉండకుండా సాయపడతాయి. ఇలాంటి అడవులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంద.ఇ
చెట్లు నరికితే కఠిన శిక్షలు
అడవులను కాపాడుకుంటేనే రేపటి తరాలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అడవిలో ఎవరైనా చెట్లను నరికితే కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లో ఉన్న ఇరుగుడు సేవ, టేకు వంటి విలువైన వృక్షాలను నరికిన వ్యక్తులను నేరుగా అరెస్ట్ చేసి ఫారెస్ట్ అధికారులు ఆ వ్యక్తిని కోర్టులో హాజరు పరుస్తారు. కోర్టులో నేరం రుజువైతే సుమారు 7 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. చెట్టుకు వెలకట్టి దానిని 10 రెట్లు పెంచి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అభయారణ్యంలో చెట్లు నరికినా, వన్యప్రాణులను వేటాడినా కఠినమైన శిక్షలు ఉంటాయి.
మానవ మనుగడలో అడవుల పాత్ర కీలకం
మానవ మనుగడలో అడవుల పాత్ర ఎంతో కీలకమైనది. అడవులు భూమిపై ఉన్న అన్ని ప్రాణులకు అవసరం. అలాంటి అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అడవులను రక్షించాల్సి ఉంది.
తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే
అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అడవి నరికివేతపై నిఘా ఏర్పాటు చేశాం. ఇప్పటికే అనేక మందిని పట్టుకుని కేసులు నమోదు చేశాం. అడవిలో ప్రవేశించకుండా అడవిచుట్టూ రక్షణ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా అడవులు అంతరించిపోతే కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం

