మంత్రిగారూ.. మెడికల్‌ కాలేజీ గుర్తుందా? | - | Sakshi
Sakshi News home page

మంత్రిగారూ.. మెడికల్‌ కాలేజీ గుర్తుందా?

May 21 2025 1:41 AM | Updated on May 21 2025 1:41 AM

మంత్రిగారూ.. మెడికల్‌ కాలేజీ గుర్తుందా?

మంత్రిగారూ.. మెడికల్‌ కాలేజీ గుర్తుందా?

సాక్షి, భీమవరం: వైద్య విద్యను పేద విదార్థులకు చేరువ చేసేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కారు జిల్లాకో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీఇక్కడ బురద తప్ప మెడికల్‌ కళాశాల పనులేమి జరగడం లేదుశ్రీ అంటూ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు ఎంతో హడావుడి చేశారు. పనుల వేగం పెంచాలంటూ పార్టీ పెద్దలను సైతం తీసుకువచ్చి నిరసనలు తెలిపారు. కూటమి వచ్చాక ఆయన్ను మంత్రి పదవి వరించడంతో ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని అంతా ఆశించారు. ఇంతవరకూ ఆయన కళాశాల వైపు కన్నెత్తి చూడలేదు. పాలకొల్లు మండలం దగ్గులూరులోని సుమారు 60 ఎకరాల్లో రూ.475 కోట్లతో కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కళాశాల నిర్మాణంతో జిల్లా వాసులకు మేలు జరుగుతుందని, ఎంతో మందికి ఉపాది లభిస్తుందని స్థానికులు ఆశించారు.

నిధుల లేక నిలిచిన పనులు

2023 ఆగస్టులో నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది. ఇనన్‌పేషెంట్‌, అవుట్‌ పేషెంట్‌, ఎమర్జన్సీ సేవల బ్లాకులకు సంబంధించి రూ.75 కోట్ల విలువైన పునాది పనులు దాదాపు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మెడికల్‌ కళాశాల పనులకు బ్రేక్‌ వేసింది. ఈ పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. సైట్‌లోని ఐరన్‌, ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామగ్రిని తరలించుకుపోతోంది. పనులు ఆగిపోవడంతో స్థానికుల ఆశలపై నీళ్లు చల్లారు. కాలేజీని ప్రైవేట్‌ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవనుంది.

కళాశాల వైపు చూడని మంత్రి నిమ్మల

గత ప్రభుత్వంలో ఒకపక్క పనులు జరుగుతుంటే.. బురద తప్ప ఇక్కడ నిర్మాణాలు ఏమీ చేయడం లేదంటూ పలుమార్లు సైట్‌ వద్దకు వచ్చి నిమ్మల హడావుడి చేశారు. మాజీ మంత్రి నిమ్మ కాయల రాజప్ప, తదితర పార్టీ పెద్దలను తీసుకొచ్చి నిరసనలు తెలిపి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. అప్పట్లో వైద్య కళాశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేసిన నిమ్మల మంత్రిగా ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా ఇటు వైపు వచ్చి చూసిన దాఖలాలు లేవు. పబ్లిసిటీ కోసమే గతంలో హడావుడి చేశారని అంటున్నారు.

గత ప్రభుత్వంలో పనులు ప్రారంభం.. రూ.75 కోట్ల విలువైన పనులు పూర్తి

గతంలో పలుమార్లు సైట్‌ వద్దకు వచ్చి హడావుడి చేసిన నిమ్మల

కూటమి వచ్చాక కన్నెత్తి చూడని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement