
బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా నవీకరణ సుప్రీంకోర్టులో విచారణ దశలోనే వున్నా, పార్లమెంటులో అలజడి రేగుతున్నాఆ ప్రక్రియ తన దోవన తాను ముందుకెళ్తున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ గురువారం ఆ వ్యవహారం గురించి వెల్లడించిన వివరాల ప్రకారం, లక్షమందికి పైగా ఓటర్ల ఆచూకీ లేదు. 21.6 లక్షల మంది మరణించారు. మరో 31.5 లక్షల మంది శాశ్వతంగా వేరే చోటుకు వలసపోయారు.
పోలింగ్ కేంద్రం స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) అడుగుతున్నా, మరో ఏడు లక్షల మంది ఇంతవరకూ తమ పత్రాలు దాఖలు చేయలేదు. తాము ఫలానా చోట ఉంటు న్నామని రుజువులు చూపక పోయినా, బతికే ఉన్నామని చెప్పకపోయినా లేదా తగిన పత్రాలుఅందజేయక పోయినా ఈ 61 లక్షల మంది ఓటర్లు జాబితా నుంచి శాశ్వతంగా కనుమరుగవుతారు. రాష్ట్ర ఓటర్లలో వీరు 7.7 శాతం. శుక్రవారం సాయంత్రంతో వీరందరికీ గడువు ముగిసిపోయింది. సవరించిన ఓటర్ల జాబితా ఆగస్టు 1న విడుదలవుతుంది.
అయితే సెప్టెంబర్ 1లోగా ఎవరైనా జాబితాలో తమ పేరు లేదని ఫిర్యాదు చేస్తే పరిశీలించి, తగిన పత్రాలున్న పక్షంలో వారిని చేర్చి తుది జాబితా విడుదల చేస్తారు. నకిలీ లేదా విదేశీయులుగా గుర్తించిన వారిని తొలగించటం కోసం ప్రారంభించిన ఈ ప్రక్రియ దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ‘పరిశుద్ధమైన’ ఓటర్ల జాబితా రూప కల్పనే తమ లక్ష్యమని జ్ఞానేశ్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవాలంటే మెజారిటీ ఆమోదం పొందిన ప్రభుత్వాలు ఏర్పడాలి.
ప్రజల ఆదరణ ఉన్నవారే పాలకులు కావాలి. నకిలీ ఓటర్లు లేదా ఈ దేశ పౌరులు కానివారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే స్థితి ఉంటే ఆ ఎన్నికలే ప్రహసన ప్రాయమవుతాయి. ఎన్నికలు సజావుగా పూర్తవుతున్నాయన్న భావన వల్లే ఫలితాలు వెలువడ్డాక అధికార మార్పిడి శాంతియుతంగా పూర్తవుతోంది. గత దశాబ్దాలతో పోలిస్తే ఎన్నికల హింస గణనీయంగా తగ్గింది. ఇలాంటి కారణాల వల్లే విదేశాల ఎన్నికలకు మన ఈసీ అధికారులు పరిశీలకులుగా వెళ్తున్నారు. వారు సూచిస్తున్న మార్పులకు ఎంతో విలువ ఉంటున్నది.
కానీ గత ఏడాది, రెండేళ్లుగా ఈసీ వ్యవహార శైలిపై విమర్శలూ, ఆరోపణలూ వెల్లువెత్తు తున్నాయి. వాటిపై అసలే స్పందించకపోవటం లేదా మరిన్ని సందేహాలు కలిగే రీతిలో జవాబీ యటం రాజకీయ పక్షాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. బిహార్ ఎన్నికల జాబితా సంగతే తీసుకుంటే సుప్రీంకోర్టు సూచించిన ఆధార్, రేషన్ కార్డు వగైరాలు పరిశీలనకు పనికి రావని అది ఎందుకు తిరస్కరించిందో అంతుపట్టదు. ఆధార్‌ను ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమని, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినాఉంటుందన్నారు.
కానీ జరుగుతున్నది అందుకు విరుద్ధం. మరి విశ్వసనీయత లేని ఆధార్‌ను అన్నిటికీ అనుసంధానం చేయటం ఎందుకు? ఇప్పటికీ ఆ కార్డు సంపాదించటానికి సాధారణ పౌరులు తలకిందులవుతున్నారు. పుట్టిన చోటే నవజాత శిశువులకు ఆధార్ అందేలా తాజాగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటువంటి కార్డు ఓటరు గుర్తింపునకు పనికిరాదని ఈసీ ఎలా చెబుతుందో అర్థంకాని విషయం. పౌరుల్ని గుర్తించటమనే ప్రక్రియ అన్యులకు ఆసాధ్యమని, కేవలం తామే సమర్థులమని ఆ సంస్థ చెప్పదల్చుకుంటే దాన్నెవరూ అంగీకరించరు.
ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తటంపై ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర, హరియాణాల వరకూ ఎన్ని ఉదాహరణలైనా చూపొచ్చు. ఏపీ సంగతే తీసుకుంటే... అక్కడ ఓటింగ్‌కు గడువు ముగిసి కేవలం ప్రాంగణంలో ఉన్న వారితో పోలింగ్ పూర్తి చేయటానికి అర్ధరాత్రి వరకూ సమయం పట్టింది. అలా వేచివున్నవారి సంఖ్య ఏకంగా 51 లక్షలు! ఇది నమ్మేలా ఉందా? ఇక పోలింగ్ శాతంపై మొదటి, చివరి ఈసీ ప్రకటనల్లోని అంకెల మధ్య 12.5 శాతం తేడావచ్చింది.
ఇది గతంలో ఎప్పుడూ ఒక శాతం మించిలేదు. ఇందువల్ల సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో అదనంగా 28,000 ఓట్లు, లోక్‌సభ స్థానంలో 1.96 లక్షల ఓట్లు అమాంతం పెరిగి పోయాయి. తటస్థ సంస్థల లెక్కల ప్రకారం ఇది 87 అసెంబ్లీ స్థానాల గెలుపోటముల్ని తారుమారు చేసింది! వేరే రాష్ట్రాల్లోనూ ఇలాంటి ధోరణే కనబడిందని అక్కడి విపక్షాలు భగ్గుమంటున్నాయి.
ఈ సందేహాలకు సక్రమమైన జవాబు చెబితే బిహార్‌లో చేపట్టిన ‘సర్’పై పెద్దగా అభ్యంతరాలు వచ్చేవి కాదేమో! కానీ ఆ సంస్థ తనకు తోచినప్పుడు మాట్లాడటం తప్ప జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుత వర్తననూ కనబరచటం లేదు. సందేహాలు పటాపంచలు చేద్దామన్న పట్టుదలను ప్రదర్శించటం లేదు. ఈసీ న్యాయబద్ధంగానే వ్యవహరిస్తున్నాననుకోవచ్చు. కానీ అలా అందరూ అనుకునేలా తన వ్యవహార శైలి వుండాలి. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకైనా ఇది తప్పనిసరి.
అందునా ప్రభుత్వాల తలరాతలను మార్చే కీలకమైన వ్యవస్థగా ఉన్న ఈసీకి ఇది మరింత ప్రాణప్రదం. దేశంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి వలసలు ఎక్కువుంటాయి. అలాంటిచోటఇంత తక్కువ వ్యవధిలో ఎక్కడెక్కడినుంచో పనులు మానుకుని వచ్చి ఓటర్లుగా నమోదు చేసు కోవటానికి అవసరమైన పత్రాలు సేకరించి సమర్పించటం బడుగు జీవులకు సాధ్యమేనా? అందుకే సర్వోన్నత న్యాయస్థానం సూచించిన ఇతర ప్రత్యామ్నాయాల గురించి కూడా ఈసీ పరిశీలించాలి. ఈ మాదిరి సవరణకు దేశవ్యాప్త ఆదరణ లభించాలంటే ఇది తప్పనిసరి.