‘అగ్నివీరుల’ ఆగమనం!

Sakshi Editorial On National Defense Reforms Agnipath Scheme

దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాల్లో సంస్కరణలకు అంకురార్పణ చేస్తూ కేంద్రం ‘అగ్నిపథం’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేర్చుకునేవారికి కూడా ఘనమైన పేరే పెట్టారు. వారిని ‘అగ్నివీర్‌’లు అంటారు. 17.5– 21 ఏళ్ల మధ్యవయస్కులను సైనికులుగా ఎంపిక చేస్తారని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ప్రకటించారు.

ఇది నాలుగేళ్ల కాంట్రాక్టు నియామకానికి సంబంధించిందే అయినా, మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారి సర్వీసు కొనసాగుతుంది. ఏటా నాలుగోవంతు మంది బయటకు రాకతప్పదు. సాంకేతిక నైపు ణ్యాలు తప్పక అవసరమైన వైమానిక, నావికా దళాలకు ఈ పథకం సాధ్యపడకపోవచ్చు. కనుక ప్రధానంగా సైనికదళంలోనే ఈ ‘అగ్నివీర్‌’ల ఉనికి ఉంటుందనుకోవాలి.

ఈ పథకానికి లభించే ఆదరణనుబట్టి ప్రస్తుత నియామక విధానానికి క్రమేపీ స్వస్తి పలుకుతారు. సైనిక వ్యవస్థలో సంస్కర ణలు తీసుకురావాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. కార్గిల్‌ యుద్ధ సమయం నుంచీ అది తరచు ప్రస్తావనకొస్తూనే ఉంది. కానీ జరిగిందేమీ లేదు. 2014లో అధికారంలోకొచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం 2016లో ఒక కమిటీని నియమించింది.

ఫలితంగా ఈ ‘అగ్నిపథం’ ఆవిష్కృతమైంది. పరిపాలకు లెలా ఉండాలో, ఆర్థిక రాజకీయ వ్యవహారాలు ఎలా చక్కబెట్టాలో చెప్పిన చాణక్యుడు ఏ పనైనా మొదలెట్టినప్పుడు పాలకులు మూడు ప్రశ్నలు వేసుకోవాలన్నాడు. ‘ఎందుకు చేస్తున్నాను... ఇలాచేస్తే రాగల ఫలితం ఏమిటి... ఈ కృషిలో విజయం సాధిస్తానా’ అనేవి ఆ ప్రశ్నల సారాంశం. 

ప్రపంచవ్యాప్తంగా సైనికరంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతం మాదిరి దీర్ఘకాలిక యుద్ధాలకు ఇప్పుడు పెద్దగా అవకాశం లేదు. చాలా యుద్ధాలు మొదలైనంత వేగంగా ముగిసిపోతున్నాయి. పైగా వీటిలో సాంకేతిక నైపుణ్యానిదే పైచేయి. రిమోట్‌ కంట్రోల్‌ ఆయుధాలు, లక్ష్యంవైపు మారణాయుధాలతో దూసుకుపోగల డ్రోన్‌లు, కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే స్వయంచాలిత ఆయుధాలదే ఇప్పుడు కీలకపాత్ర. అందుకే అమెరికా మొదలుకొని చైనా వరకూ సైనిక రంగంలో సంస్కరణలు మొదలై చాన్నాళ్లయింది.

అయితే అమెరికాకైనా, ఇతర పాశ్చాత్య దేశాలకైనా జనాభా తక్కువ గనుక సైనిక రిక్రూట్‌మెంట్‌ మొదటినుంచీ సమస్యే. మనకుండే సమస్యలు వేరు. మన త్రివిధ దళాలు సంఖ్యాపరంగా చూస్తే దాదాపు 14 లక్షలు. ఇందులో పౌర సిబ్బంది దాదాపు 3.75 లక్షలు. మొత్తంగా ఏటా రిటైరయ్యేవారి సంఖ్య 55,000. సంస్కరణలు ప్రతి పాదించే కమిటీలన్నీ సైన్యంకన్నా పౌరసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని సూచిస్తూనే ఉన్నాయి. కానీ అనేక కారణాలవల్ల కేంద్రంలో ఎవరున్నా వారి జోలికిపోరు.

పైగా ఈ పౌర సిబ్బందికి జీతాలు, రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే పింఛన్‌ అదే క్యాడర్‌లో సైన్యంలో పనిచేస్తున్నవారికన్నా చాలా ఎక్కువ. ఎందుకంటే సైన్యంలో కనిష్ఠంగా పదేళ్లకు రిటైర్‌ కావొచ్చు. పౌరసిబ్బంది దాదాపు మూడున్నర దశాబ్దాల సర్వీసు పూర్తిచేస్తారు. అంకెలు ఘనంగా కన్పించవచ్చుగానీ ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకుంటే 80వ దశకం మధ్యనుంచీ మన రక్షణ కేటాయింపులు క్రమేపీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం మన జీడీపీలో ఆ రంగం వాటా 1.5 శాతం. ఇందులో గణనీయమైన భాగం జీతాలకూ, పింఛన్లకూ పోతుందంటారు.  

సంస్కరణలను వ్యతిరేకించాల్సిన పని లేదు. కానీ అవి ఎక్కడ, ఎలా ఉండాలన్నదే ప్రశ్న. కార్గిల్‌ యుద్ధం ముగిశాక ఆనాటి సీనియర్‌ అధికారులు మన దగ్గర కాలం చెల్లిన ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రి అధికమని ఎత్తిచూపారు. ఎన్‌డీఏ అధికారంలోకొచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఈ విషయంలో పెద్దగా మారిందేమీ లేదు. నిజమే... రాఫెల్‌ యుద్ధ విమానాలవంటి అత్యంతాధునిక యుద్ధ విమానాలు, అణు క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం ఉండే ఎస్‌–400 క్షిపణి వ్యవస్థ వంటివి మన రక్షణ అమ్ములపొదిలో వచ్చి చేరాయి.

శత్రువును నిలువరించడంలో, మట్టికరిపించడంలో అవి తిరుగులేని అస్త్రాలు. కానీ ఇతరత్రా రక్షణ సామగ్రి మాటేమిటి? సాధారణ సైనికులకు అవసరమైన ఆయుధాల సంగతేమిటి? కాంట్రాక్టు పద్ధతిలో చేర్చుకుంటే పెన్షన్, ఇతరత్రా ప్రయోజనాలకయ్యే వ్యయం చాలా వరకూ తగ్గుతుందనీ, ఆ మొత్తాన్ని సైనికదళాల ఆధునికీకరణకు ఖర్చు చేయొచ్చనీ ‘అగ్నిపథం’ పథకాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు.

కానీ ఆమేరకు సామాజిక అశాంతి ప్రబలదా? రిటైరైనప్పుడు వచ్చే మొత్తం మినహా మరేంలేకపోతే కుటుంబాలన్నీ ఎలా నెట్టు కొస్తాయి? అసలు వచ్చింది కొలువో, కాదో తెలియని అయోమయం... నాలుగేళ్ల తర్వాత బయటికి రావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ పథకం ప్రకటించి 24 గంటలు తిరగకుండానే బిహార్‌లో నిరసన స్వరాలు వినిపించాయి.

నాలుగేళ్లు సైన్యాన్ని నమ్ముకుని పనిచేశాక మళ్లీ కొత్త కొలువు కోసం వేట మొదలుపెట్టాలా అన్నది వారి ప్రశ్న. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని మాత్రమే సర్వీసులో కొనసాగిస్తారు. 75 శాతం మంది బయటకి రావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్నట్టు వారందరికీ కొత్త ఉపాధి చూపడం సాధ్యమేనా? అక్కడ నేర్చుకున్న విద్యలతో, కొలువుపోయిందన్న అసంతృప్తితో పెడదోవ పట్టేవారుండరా? అసలు ‘అగ్నివీర్‌’లను సాధారణ సైనికుల మాదిరి పరిగణించి బాధ్యతలు అప్పగించడం ఆచరణలో అధికారులకు సాధ్యమేనా? అనుకోని పరిణామాలు వచ్చిపడితే ఇతర సైనికుల తరహాలో ‘అగ్నివీర్‌’లు పూర్తి సంసిద్ధత ప్రదర్శించగలరా? కేంద్రం జాగ్రత్తగా ఆలోచించి అడుగులేయాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top