మయన్మార్‌లో సైన్యం ఆగడం

Sakshi Editorial On Myanmar Coup

అరకొరగానైనా ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తున్నట్టు నటించటం మొదలుబెట్టి నిండా ఆరేళ్లు కాకుం డానే మయన్మార్‌ సైన్యం అప్పుడే తన ప్రతాపం చూపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై  కీలక నేత ఆంగ్‌సాన్‌ సూకీ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని సోమవారం కూల్చి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించింది. మయన్మార్‌లో గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూకీ నాయకత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమాక్రసీ (ఎన్‌ఎల్‌డీ) ఘన విజయం సాధించినప్పుడే మయన్మార్‌ సైన్యం ఎలాంటి అడుగులు వేస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో సైన్యం ప్రాభవం పూర్తిగా అడుగం టింది. ప్రజలు ఎన్నుకోవటానికి కేటాయించిన 476 స్థానాల్లో సూకీ పార్టీ 396 (83 శాతం) గెల్చుకుని ఘన విజయం సాధించింది.

సైన్యం కనుసన్నల్లో నడిచే యూనియన్‌ సాలిడారిటీ అండ్‌ డెవెలప్‌మెంట్‌ పార్టీ (యూఎస్‌డీపీ) కేవలం 33 స్థానాలకే (7శాతం) పరిమితమైంది. సైన్యానికి తోకలావుండే మరికొన్ని చిన్న పార్టీలు అంతకన్నా చాలా తక్కువ స్థానాలకు పరిమితమయ్యాయి. పార్లమెంటులో సైన్యం ముందుజాగ్రత్త చర్యగా తనకు తాను కేటాయించుకున్న 166 సీట్ల(25శాతం) కోటా వుండనే వుంది. ఇంతచేసినా పార్లమెంటులో సైన్యం కోసం గొంతెత్తే వారు 32 శాతం మించిలేరు. 2015లో చాన్నాళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించినప్పుడు పరిస్థితి వేరు. ఎన్‌ఎల్‌డీ అప్పుడు కూడా విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నా సైన్యం పలుకుబడి తగ్గలేదు.

తనను కాదని చట్టాలు చేసే పరిస్థితి ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వానికి లేదు. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. పైగా సైన్యం అధికారాలను కత్తిరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్న దన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదంతా మింగుడు పడని సైన్యం పథక రచన చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. సైనిక కుట్ర జరగొచ్చునన్న కథనాల్లో నిజం లేదని, తాము ఆ మాదిరి చర్యకు పాల్పడబోమని సైన్యం చెబుతూ వచ్చింది. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తించి తన నైజాన్ని వెల్లడించుకుంది.  

ఇంచుమించు మనతోపాటే బ్రిటిష్‌ వలసపాలకులపై పోరాడి మయన్మార్‌ స్వాతంత్య్రాన్ని సాధించుకోగా స్వల్పకాలంలోనే అది సైనిక నియంతల ఏలుబడిలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి అడపా దడపా సైనిక నియంతలు ఎన్నికల తతంగాన్ని నడిపిస్తూనే వున్నారు. 1990లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ 80 శాతం స్థానాలు గెల్చుకోగా అప్పుడు కూడా సైన్యానికి మింగుడుపడక వాటిని రద్దు చేసింది. యధాప్రకారం మరికొన్నాళ్లు సైనిక పాలన కొనసాగింది. ఈలోగా అంతర్జాతీ యంగా ఒత్తిళ్లు పెరగటంతో 2010లో మరోసారి తప్పనిసరై ఎన్నికలు నిర్వహించారు. అందులో 80 శాతం ప్రజానీకం సైన్యం ప్రాపకం వున్న పార్టీలకే అధికారం కట్టబెట్టారని ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేశారు. కానీ ఎవరూ ఆ కపట నాటకాన్ని ఆమోదించడానికి సిద్ధపడలేదు. దాంతో 2015లో ఎన్నికల నిర్వహణ తప్పలేదు.

చాన్నాళ్ల తర్వాత తొలిసారి అంతర్జాతీయ పర్యవేక్షణలో ఆ ఎన్నికలు జరగటం, అందులో ఎన్‌ఎల్‌డీ ఘన విజయం సాధించటంతో ఇష్టం లేకున్నా సైనిక పాలకులు ఆ పార్టీకి అధికారం అప్పగించారు. అప్పట్లో ఇలా అధికారం అప్పగించటానికి రెండు కారణాలు న్నాయి. అందులో మొదటిది–పాలనపై తమ పట్టు పూర్తిగా సడలకపోవటం. రెండోది ఆంగ్‌ సాన్‌ సూకీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ సైనిక నియంతలు రాజ్యాంగం రాసుకున్నారు. సూకీకి అధికార యోగం లేకుండా చేశామని సంబరపడ్డారు.

ఆ సమయంలోనే పార్లమెంటునుంచి అట్టడుగు ప్రజాస్వామ్య వ్యవస్థలవరకూ అన్నిచోట్లా తమ కోసం 25 శాతం సీట్లు దఖలు పరచుకున్నారు. తమకు ఇష్టమైనవారిని చట్టసభల్లో కూర్చోబెట్టుకుని, ఎన్నికైన ప్రభుత్వం హద్దుమీరకుండా చూశారు. ఎందుకైనా మంచిదని  వీటో అధికారాలు సైతం పెట్టుకున్నారు. అందుకే గత అయిదేళ్లుగా ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వం సైన్యం నిర్దేశించిన హద్దుల్లోనే పాలించింది. మైనారిటీ వర్గమైన రోహింగ్యా ముస్లింలను సైనిక దళాలు కళ్లముందే ఊచకోత కోసినా సూకీ పట్టనట్టే వ్యవహరించారు. పైగా సైన్యాన్నే సమర్థించారు. అందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొ న్నారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత సైనికుల ఆగడాలను సమర్థించటం దారుణమని అనేకులు దుమ్మెత్తిపోశారు. కానీ సూకీని విశ్వసించటానికి సైన్యం సిద్ధంగా లేదని తాజా పరిణా మాలు తేటతెల్లం చేస్తున్నాయి.  

అత్యవసర పరిస్థితుల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకోవచ్చునన్న రాజ్యాంగ నిబంధనకు అను గుణంగానే ఈ పని చేశామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ చెల్లదు. అలాగే ఏడాదిపాటు మాత్రమే పాలిస్తామని, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ ప్రజా పాలకులకు అధికారం కట్టబెడతామని చెబుతున్న మాట కూడా బూటకమే. నవంబర్‌ ఎన్నికల్లో తాము సమర్థించినవారు చిత్తుగా ఓడారన్న దుగ్ధతో, తమకు సర్వాధికారాలు కట్టబెడుతున్న రాజ్యాంగాన్ని ఇప్పుడొచ్చిన మెజారిటీతో ఎన్‌ఎల్‌డీ సర్కారు మారుస్తుందనే భయంతో సైన్యం ఈ దారుణానికి తెగించిందని ప్రపంచానికి అర్థమైంది. ఇప్పుడు ఆంగ్‌ సాన్‌ సూకీ, అధ్యక్షుడు విన్‌ మియింత్‌ల ఆచూకీ తెలియకుండా పోయింది. వారిని ఎక్కడ నిర్బంధించారో, జరుగుతున్నదేమిటో వెల్లడించాల్సిన బాధ్యత సైనిక పాలకులది. ఈ కుట్రలో చైనా పాత్ర ఏమేరకుందో ఆ దేశం జవాబివ్వాలి. ఒకటైతే నిజం... ఇతర దేశాల మాదిరి సైనిక తిరుగుబా టును ఆ దేశం ఖండించలేదు. విభేదాలను రాజ్యాంగం పరిధిలో అన్ని పక్షాలూ పరిష్కరించు కోవాలని సలహా ఇచ్చింది. ఇది సరికాదు. ప్రపంచ దేశాలన్నీ సైన్యంపై ఒత్తిడి తెస్తేనే... అక్కడి ప్రజ లకు నైతిక మద్దతునిస్తేనే ప్రజాస్వామ్యం మళ్లీ చివురిస్తుంది. అందుకోసం అందరూ కృషి చేయాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top