చరిత్రాత్మక విజయం

Sakshi Editorial on India Historic Win Thomas Cup

చరిత్రాత్మక ఘట్టం. చిరస్మరణీయ సందర్భం. భారత బ్యాడ్మింటన్‌లో సువర్ణాక్షర లిఖిత విజయం. ఇలాంటి విశేషణాలు ఎన్ని వాడినా తక్కువే. ప్రపంచ టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌గా పేరున్న ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌లో ఆదివారం భారత పురుషుల జట్టు సాధించిన గెలుపు అలాంటిది మరి. 73 ఏళ్ళ థామస్‌ కప్, ఉబర్‌ కప్‌ల చరిత్రలో భారత్‌కు తొలిసారి దక్కిన విజయం ఇది. అందులోనూ 14 పర్యాయాలు విజేతగా నిలిచిన ఇండొనేషియా జట్టును 3–0 తేడాతో ఓడించడం అనూహ్యం. ఈ విజయానికి దేశమంతటా అపూర్వ స్పందన లభిస్తున్నదంటే కారణం అదే. ఈ విజయం సాధించిపెట్టినవారిలో షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్‌ సాయిరాజ్, కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్‌ గౌడ్, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వంటి తెలుగు తేజాలు ఉండడం మరింత గర్వకారణం. 

ఇప్పటి దాకా కేవలం ప్రాతినిధ్యానికే తప్ప పతకానికి నోచుకోని పురుషుల టీమ్‌ టోర్నమెంట్‌ థామస్‌ కప్‌లో భారత విజయం ఇప్పుడిక కొన్ని తరాల పాటు చెప్పుకొనే కథ. క్వార్టర్‌ ఫైనల్, సెమీ ఫైనల్‌లలో మన విజయాలు గాలివాటువేమో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఫైనల్‌లో మన ఆటగాళ్ళు 3 వరుస విజయాలతో మునుపటి ఛాంపియన్‌ ఇండొనేషియాను ఓడించి, దేశానికి బంగారు పతకం తెచ్చారు. 43 ఏళ్ళ క్రితం ప్రకాశ్‌ పదుకోనే, సయ్యద్‌ మోదీ లాంటి దిగ్గజాలతో కూడిన భారత షట్లర్ల జట్టు సెమీస్‌ దాకా వెళ్ళి, డెన్మార్క్‌ చేతిలో ఓడింది.

ఈసారి సెమీఫైనల్‌లో అదే డెన్మార్క్‌పై గెలిచి ఫైనల్‌కు చేరడం గమ్మల్తైన కాకతాళీయం. యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ మొదటి సింగిల్స్‌లో తొలి గేమ్‌ ఓడినా, పుంజుకొని వరల్డ్‌ నంబర్‌ 5 ఆటగాణ్ణి మట్టికరిపించారు. డబుల్స్‌లో సాయిరాజ్, చిరాక్‌ షెట్టి సైతం మొదటి గేమ్‌ ఓడినా, తరువాత రెండు గేమ్‌లలో సత్తా చాటి, గెలుపు అందించారు. కీలకమైన రెండో సింగిల్స్‌లో మన తెలుగు బిడ్డ శ్రీకాంత్‌ ఆచితూచి ఆడారు. ఆసియా క్రీడోత్సవాల విజేత జొనాథన్‌ క్రిస్టీని ఓడించి, సువర్ణాధ్యాయం లిఖించారు. 

1975లో హాకీ వరల్డ్‌ కప్‌... 1983లో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌... ఈ 2022లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ కప్‌ లాంటి థామస్‌ కప్‌... మూడు వేర్వేరు ఆటలు... మూడు వేర్వేరు సందర్భాలు... మూడింటా సమష్టి కృషితో భారత జట్లే విజేతలు. బ్యాంకాక్‌లోని ఇంప్యాక్‌ ఎరీనాలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడిన ఈ ఘట్టాన్ని – 39 ఏళ్ళ క్రితం 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో కపిల్‌ సేన సాధించిన విజయంతో ఇప్పుడు అందరూ పోలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, 73 ఏళ్ళ చరిత్రను తిరగరాసిన తాజా గెలుపు, 1983 నాటి విజయం కన్నా మించినదని గోపీచంద్‌ లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. ఆ వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లోనూ, ఇప్పుడీ థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌లోనూ భారత జట్టుపై ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. రెండు సందర్భాల్లోనూ భారత జట్టు విజేతగా నిలుస్తుందన్న ఊహా లేదు. కానీ, ఇంగ్లండ్‌లో ఆనాటి భారత క్రికెటర్లు, ఇప్పుడు బ్యాంకాక్‌లో మన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కలసికట్టుగా ఆడితే, అసాధ్యం కూడా సుసాధ్యమేనని నిరూపించారు. 

బ్యాడ్మింటన్‌ ప్రధానంగా వ్యక్తిగత ప్రతిభాపాటవాలకు గీటురాయిగా నిలిచే క్రీడ. వ్యక్తిగత ప్రతిభతో ఆ రంగంలో పతకాలు సాధించడం గొప్పే. కానీ, సమష్టి కృషితో ఒక టీమ్‌ ఈవెంట్‌లో విజయం సాధించడం మరీ గొప్ప. థామస్‌ కప్‌ ప్రాథమికంగా టీమ్‌ ఈవెంట్‌ గనక జట్టులోని ప్రతి సభ్యుడూ టోర్నమెంట్‌ పొడుగూతా విజయ ప్రదర్శనలే ఇవ్వాల్సి ఉంటుంది. పైగా, టీమ్‌ ఈవెంట్లలో మన డబుల్స్‌ జోడీలు ఆట్టే రాణించకపోవడం భారత షటిల్‌ బ్యాడ్మింటన్‌ను చిరకాలంగా వేధిస్తున్న సమస్య. దాన్ని అధిగమించి, అపూర్వమైన ఆట తీరుతో దక్కిన ఈ థామస్‌ కప్‌ ప్రత్యేకమైనదని కోచ్‌ గోపీచంద్‌ భావిస్తున్నది అందుకే! ఈ అపూర్వ విజయాన్ని ఏ ఒక్కరి ఖాతాలోనో పూర్తిగా వేసెయ్యలేం. భారత బ్యాడ్మింటన్‌లో వ్యక్తిగత ప్రతిభతో పాటు కలసికట్టుగా ఆడే ఓ బృంద స్ఫూర్తి వికసిస్తోందనడానికి ఈ విజయం ఓ తార్కాణం. బంగారు భవితకు బలమైన పునాది. 

గతంలో వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్, ఒలింపిక్‌ పతకాలు, ఇప్పుడు థామస్‌ కప్‌ – ఇవన్నీ బ్యాడ్మింటన్‌లో భారత్‌ అంచెలంచెల శిఖరారోహణకు సాక్ష్యాలు. ఇండొనేషియా, మలేసియా లాంటి బలమైన జట్లను థామస్‌ కప్‌లో ఓడించి, స్వర్ణాన్ని సాధించడం రాకెట్‌ వేగంతో మారుతున్న మన షటిల్‌ క్రీడా ముఖచిత్రానికి ప్రతీక. ‘కుbŒ∙భీ హో... జీత్‌నా హై’ అనే లక్ష్యంతో, ఆత్మవిశ్వాసంతో సాగితే ఏదీ అసాధ్యం కాదని షట్లర్లు నిరూపించారు. పదిమంది జట్టూ ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌లో నిర్మొహమాటంగా భావావేశాలు పంచుకుంటూ సాగిన వైనం మరో విజయసూత్రం.

1980లో ప్రకాశ్‌ పదుకోనే, 2001లో పుల్లెల గోపీచంద్, 2010లో సైనా నెహ్వాల్, ఆ పైన పీవీ సింధు... ఇలా ఎప్పటికప్పుడు బ్యాడ్మింటన్‌ తారలు ఉద్భవిస్తూనే ఉన్నారు. అయితే, గ్రామాల నుంచి ఆకలితో వచ్చిన ఆటగాళ్ళతో ప్రస్తుత భారత బ్యాడ్మింటన్‌ జట్టు మునుపెన్నడూ లేనంత పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇది ఒక శుభపరిణామం. పారుపల్లి కాశ్యప్, సాయి ప్రణీత్‌ లాంటి ఆటగాళ్ళ తర్వాత కిడాంబి శ్రీకాంత్‌ లాంటి వాళ్ళ అడుగుజాడల్లో లక్ష్యసేన్‌ లాంటి యువ షట్లర్లు తయారవుతుండడం భవితపై మరిన్ని ఆశలు రేపుతోంది. ఈ కొత్త తరాన్ని తయారు చేయడంలో గోపీచంద్, ఆయన అకాడెమీ లాంటివి నిరంతరం చేస్తున్న కృషి గణనీయం. జూలైలో కామన్వెల్త్, ఆగస్టులో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ – ఇలా మరెన్నో ప్రపంచ శ్రేణి పోటీలు రానున్న వేళ తాజా విజయం మన షట్లర్లకు పెద్ద ఉత్ప్రేరకం. ఆటకూ, ఆశకూ ఇప్పుడిక ఆకాశమే హద్దు.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top