డబుల్‌ ధమాకా!

New Delhi: Ugc Allows Students Pursue Two Degree Course At Once - Sakshi

అవును... విద్యార్థులకు ఇది అచ్చంగా డబుల్‌ ధమాకా! ప్రస్తుత విద్యావిధానంలో లాగా ఒకసారి ఒకే డిగ్రీ కాకుండా, ఏకకాలంలో రెండు కోర్సులు చదివి, రెండు డిగ్రీలూ పొందే అరుదైన అవకాశం. నూతన విద్యావిధానంలో భాగంగా వీలు కల్పిస్తూ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చేసిన సరికొత్త ప్రతిపాదన. ప్రతిపాదిత ఏకకాలపు రెండు డిగ్రీల చదువుకు మార్గదర్శకాలను బుధవారం యూజీసీ ప్రకటించింది.

కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో రెండు డిగ్రీలు చదువుకొనే వీలు కల్పించే ఈ విధాన మార్పు సంచలనం సృష్టిస్తోంది. నిర్ణీత వ్యవధిలోనే ఒకటికి రెండు డిగ్రీలు చేసేందుకు ఇది మంచి అవకాశమని కొందరు స్వాగతిస్తున్నారు. ఇంకొందరు ప్రొఫెసర్లేమో ఒకేసారి లెక్కలు– సంగీతం... ఇలా రెండు విభిన్న అంశాల్లో డిగ్రీలు చేయడం ఏం విడ్డూరమంటున్నారు. వెరసి ఉన్నత విద్యలో అత్యున్నత చట్టబద్ధ సంస్థ యూజీసీ ప్రతిపాదన చర్చనీయాంశమైంది. 

ఈ కొత్త ప్రతిపాదన పుణ్యమా అని విద్యార్థులు ఒకేసారి రెండు అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలు కానీ, రెండు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలు కానీ, రెండు డిప్లమోలు కానీ చేయవచ్చు. రెండింటిలోనూ స్వయంగా తరగతి గదికి హాజరై కానీ, లేదంటే ఒక డిగ్రీకి స్వయంగా హాజరై – మరొకటి ఆన్‌ లైన్‌లో కానీ, అదీ కాదంటే రెండు డిగ్రీలూ ఆన్‌లైన్‌ విధానంలో కానీ చదవవచ్చు. ‘అటు విద్యావిషయకంగానూ, ఇటు విద్యకు సంబంధంలేని ఇతర రంగాల్లోనూ విద్యార్థుల సమగ్ర పురోగతిని ప్రోత్సహించడం కోసమే’ ఈ రెండు డిగ్రీల చదువనేది యూజీసీ ఆలోచన. దీనివల్ల సైన్స్, సోషల్‌ సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, వివిధ భాషలతో పాటు ప్రొఫెషనల్, టెక్నికల్, ఒకేషనల్‌ – ఇలా ఏ అంశమైనా తీసుకొని చదివే వీలు విద్యార్థికి కలుగుతుంది. ఆ ఉన్నత సంస్థకు చైర్మన్‌ పదవిలో ఉన్న తెలుగు వ్యక్తి ఎం. జగదీశ్‌ కుమార్‌ ఈ ఆలోచనను మంగళవారం ప్రకటించారు. ఆ మర్నాడే దేశవ్యాప్తంగా కాలేజీలు, యూనివర్సిటీలన్నిటికీ దీనిపై మార్గదర్శకాలు చేరాయి. 

ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకొని, లోతుగా చదువుకొని, జ్ఞానతృష్ణ, శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత పెంచుకోవచ్చని యూజీసీ భావిస్తోంది. ఆ మాటెలా ఉన్నా, ఎక్కువమంది చదవని సంగీతం, సాహిత్యం, లలిత కళలు లాంటి కోర్సులకు ఈ సరికొత్త విధాన మార్పుతో కొత్త ఊపు రావచ్చని కొందరు ఆచార్యుల ఆశాభావం. కానీ, అదే సమయంలో అసలే ఒత్తిడితో కూడిన చదువులతో సతమతమవుతున్న విద్యార్థులకు ఇది మరింత ఒత్తిడి కలిగించవచ్చు. అసలే అస్తుబిస్తుగా ఉన్న చదువుల నాణ్యత ఈ ఒకటికి రెండు డిగ్రీల ప్రతిపాదనతో మరింత క్షీణించవచ్చు. పలువురు ప్రొఫెసర్ల అభ్యంతరం కూడా అదే! అయితే గమ్మత్తేమిటంటే – వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్న ఈ కొత్త విధానాన్ని విద్యాలయాలు యథాతథంగా అమలుచేయాలన్న నిబంధన ఏదీ లేకపోవడం! కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సొంత టై–అప్‌లు పెట్టుకోవచ్చట. ప్రవేశపరీక్షలు ఏమైనా పెట్టుకోవాలా అన్నది నిర్ణయించుకోవచ్చట.

కొత్త పద్ధతిలో సైన్సు డిగ్రీ చేస్తూనే, కామర్స్, సోషల్‌ సైన్స్‌ లాంటివి చదవచ్చు. కామర్స్‌ డిగ్రీ చేస్తూనే, సైన్స్‌ చదవచ్చు. ఇది విభిన్న శాఖల మధ్య జ్ఞానపంపిణీకీ, అర్థవంతమైన సంభాషణలకూ ఉపయుక్తం. సరిగ్గా ఆచరణలో పెడితే, విద్యార్థుల్లో విశాల దృక్పథానికీ, ఆలోచనా పరిధి పెరగడానికీ ఈ ఉదార విద్య దీర్ఘకాలంలో ప్రయోజనకరమే. కానీ, కొత్త విధానం ఏ మేరకు ఆచరణ సాధ్యం? డిగ్రీతో పాటు సర్టిఫికెట్‌ ప్రోగ్రామో, డిప్లమోనో చేస్తే ఫరవాలేదు. అలాకాకుండా ఏకంగా రెండు డిగ్రీలు చేస్తూ, ఏకకాలంలో అటూ ఇటూ కుప్పిగంతులు వేస్తుంటే ఒక్కటైనా ఒంటపడుతుందా? ఇప్పటికే ‘నాలుగేళ్ళ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌’ (ఎఫ్‌వైయూపీ) ఉంది గనక ఇప్పుడీ కొత్త రెండు డిగ్రీల పథకంతో ఒరిగేదేమిటి? దీర్ఘకాలంగా ఉన్న ఆనర్స్‌ కోర్సులకు విలువ పోదా? ఇలా అనేక సందేహాలూ ఉన్నాయి. కొత్త విధానం అమలులో నిర్వహణపరమైన సవాళ్ళు సరేసరి.

ఆర్థిక సరళీకరణ అనంతర ప్రపంచంలో పెరిగిన ఆకాంక్షలకు తగ్గట్టు దేశంలో విద్యాసంస్థలు ఏ మేరకు సిద్ధమయ్యాయన్నది ప్రశ్నార్థకమే. వివిధ విశ్వవిద్యాలయాలు దేశంలో టాప్‌ 100 లో ఉండడమే అరుదు. ఇక, అంతర్జాతీయ ర్యాకింగుల చిట్టాలో వాటి పరిస్థితి చెప్పనక్కర లేదు. విభిన్న ఆర్థిక, సామాజిక నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులకు తగ్గట్టు చదువు చెప్పేలా అధ్యాపకులందరికీ ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తున్నారా? ఇప్పుడీ కొత్త రెండు డిగ్రీల చదువంటే, దానికి తగ్గట్టు కోర్సులు తయారు చేయాలి. బోధన పద్ధతుల్ని తీర్చిదిద్దుకోవాలి. భౌతిక శాస్త్రంలోనో, అర్థశాస్త్రంలోనో ఒక డిగ్రీ చేస్తున్న విద్యార్థి వచ్చి, చరిత్ర, సాహిత్యం తరగతి గదిలో రెండో డిగ్రీ చదువుకు కూర్చుంటారు. వాళ్ళకు ప్రధాన పరిజ్ఞానానికి తగ్గట్టుగా రెండో చదువు నేర్పేందుకు కొత్త బోధనా శైలి అవసరం.

మారిపోతున్న ఈ తరగతి గది స్వరూప స్వభావాలకు అనుగుణంగా ఆచార్యులకు బోధనలో యూజీసీ శిక్షణనివ్వాలి. కానీ, అది నేటి వరకు పెడుతున్న శిక్షణ తరగతుల సరుకు, సారం జగద్విదితం. ఇదే మూసలో వెళితే ఈ నూతన విద్యావిధాన ప్రయోగం నిష్ఫలమయ్యే ప్రమాదం ఉంది. నేటికీ మన యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో విద్యాప్రమాణాలు అంతటా ఒకేలా లేవు. వసతులు, బోధన సహా వివిధ అంశాల్లో హస్తిమశకాంతరం. దేశమంతటా ఒకేలా ఉండేలా ప్రమాణాలను పెంచకపోతే కష్టం. కాలేజీలో చదువు బాగా చెప్పకపోతే, ఇప్పుడు విద్యార్థి ఒక డిగ్రీ చేసినా, రానున్న రోజుల్లో రెండు డిగ్రీలతో బయటకొచ్చినా ఒరిగేది జ్ఞానశూన్యమే. తస్మాత్‌ జాగ్రత్త!

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top