పులోకేశి ఘోషయాత్ర!

Nara Lokesh Has No Political Efficiency Guest Column By Vardelli Murali - Sakshi

జనతంత్రం

దుష్ట సంకల్పంతో కౌరవులు చేసిన ఘోషయాత్ర గుర్తుకొస్తున్నది. మాయాజూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తుంటారు. ద్వైతవనమనే నిర్జనారణ్యంలో వారు అష్టకష్టాలు పడుతున్నారనే మాట ఆనోటా ఈనోటా కౌరవుల చెవిన పడుతుంది. కర్ణపేయంగా తోచిన ఈ కబురు విని సంతోషిస్తారు. పాండవులు నివసించే ప్రాంతానికి వెళ్లి, వారి ఎదుట తమ అష్టఐశ్వర్యాలను ప్రదర్శిస్తే వారు మరింత కుళ్లికుళ్లి చస్తారని శకుని మామ సలహా ఇస్తాడు. ‘భళారే మామా’ అంటాడు దుర్యోధనుడు. ఐతే మందీమార్బలాన్ని తరలించు కొని వెళ్లాలంటే రాజుగారైన ధృతరాష్ట్రుని అనుమతి కావాలి.

అప్పట్లో రాజుల ప్రధాన ఆదాయ వనరు పశుసంపదే. అర ణ్యాల్లో అక్కడక్కడా ఆలమందలుండేవి. గోపాలకులు రక్షణగా ఉండేవాళ్లు. ఆలమందల్ని, వాటి సంతాన వృద్ధి లెక్కల్నీ తనిఖీ చేసుకోవడానికి రాజ్యాధికారులో, రాజకుమారులో తరచుగా వెళ్లడం ఒక ఆనవాయితీ. పాండవులు నివసిస్తున్న ద్వైతవనం చేరువలో కూడా కురు రాజ్యానికి ఒక ఆలమంద ఉన్నది. దాని తనిఖీకి వెళ్లదలచుకున్నామని ధృతరాష్ట్రుని అనుమతి కోరతారు. 

గోవుల పరిశీలనకు వెళ్లే యాత్ర కనుక ‘ఘోషయాత్ర’ అనే అర్థం ఉన్నది. స్వయంగా యువరాజులవారు బయల్దేరినప్పుడు కొన్ని వందలమంది భటులను రక్షణకోసం తీసుకొనిపోవడం ఒక సంప్రదాయం. కానీ ఈసారి మాత్రం ఒక మహా సామ్రాజ్యంపై దండయాత్రకు వెళ్లినట్టుగా సమీకరణ జరిగింది. రథ గజతురగ పదాతి దళాలతో కూడిన వేలాదిమంది సైనికులు బయల్దేరారు. అంతఃపుర కాంతలూ, దాసదాసీ జనం, నర్తకీమణులు, గాయకులు, విడిది భవ నాలు నిర్మించడానికి శిల్పులూ తదితరులంతా పయనమ య్యారు. పాండవుల కుటీరానికి చేరువలోనే విడిది భవనాల నిర్మాణానికి ఉపక్రమించారు. ఇది తమ ప్రాంతమంటూ గంధర్వులు వారిని అడ్డుకుంటారు. గంధర్వ సేనల ధాటికి కౌరవసేన చెల్లాచెదురవుతుంది.

సోదరులతో సహా దుర్యోధనుడు గంధర్వ రాజు చిత్రసేనుడికి బందీలుగా చిక్కుతారు. విషయం తెలుసు కున్న ధర్మరాజు తన నలుగురు సోదరులను దుర్యోధనుడి రక్షణకోసం పంపిస్తాడు. పాండు కుమారులు గంధర్వ సేనను ఓడించి చిత్రసేనుడి చెర నుంచి దాయాదుల్ని విడిపిస్తారు. సిగ్గుతో, అవమానభారంతో దించిన తలలు ఎత్తకుండానే కౌర వులు ఇంటి దారి పడతారు. ఇది అందరికీ తెలిసిన కథే. కానీ ఈ కథలోని నీతిని గురించి మాత్రం తప్పక తెలుసుకోవాలి. కడు పులో దుష్ట సంకల్పాన్ని పెట్టుకొని పైకి మాత్రం పరిశీలన యాత్ర, పరామర్శ యాత్ర, పలకరింపు యాత్ర అనే మారు పేర్లతో దొంగయాత్రలు చేస్తే భంగపాటు తప్పదు.

ఒక సమర్థుడైన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందడా నికి చాలాకాలంగా లోకేశ్‌బాబు తంటాలుపడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అదృష్టవశాత్తు అధికారం దక్కడంతో చంద్ర బాబు అన్ని జాగ్రత్తలూ తీసుకుని లోకేశ్‌బాబును నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. పార్టీ మొత్తాన్ని ఆయన గుప్పెట్లో పెట్టారు. అధికారులంతా ఆయన మాట వినేలా ఏర్పాట్లు జరి గాయి. సీనియర్‌ మోస్ట్‌ మంత్రులున్న శాఖల్లో కూడా మంత్రు లకంటే లోకేశ్‌బాబు ప్రభే ఎక్కువగా వెలిగింది. అయినప్పటికీ రాజధాని ప్రాంతంలో పోటీచేసి, కోట్లు గుమ్మరించినా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆయన నాయకత్వం పట్ల నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. భవిష్యత్తులో పార్టీ పగ్గాలు స్వీకరించడానికి ఆయన పనికిరారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా ఉన్నది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కార్యకర్తలు ఈమేరకు తమ మనోభావాలను చంద్రబాబుకు తెలియజేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

మీడియా అండదండలు పూర్తిగా ఉన్నప్పటికీ, ధనబలం ఉన్నప్పటికీ, చంద్రబాబు ఆశీస్సులు వందశాతం ఉన్నప్పటికీ లోకేశ్‌బాబు నెగ్గుకురాలేకపోవడంపై తీవ్రస్థాయిలోనే అంతర్మ థనం జరిగిందని వినికిడి. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికంటే తనయుని ఓటమే చంద్రబాబును ఎక్కువగా బాధించిందట. ఆంతరంగికులు, సలహాదారుల సూచన మేరకు లోకేశ్‌బాబుకు తర్ఫీదును ఇచ్చేందుకు కన్సల్టెంట్లను నియమించారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తన స్వీయ చేష్టల వల్ల నైతేనేమి, రాజకీయ ప్రత్యర్థుల ప్రచారం ఫలితంగానైతేనేమీ, ఆహార విహార వాచిక ఆహార్యాది అలవాట్ల వల్లనైతేనేమీ ఆయ నకు ‘పప్పు’ అనే ముద్ర పడింది. రాజకీయాల్లో ‘సమర్థత’ అనే మాటకు పూర్తి వ్యతిరేక అర్థం ఈ ఇమేజ్‌ వల్ల వస్తుంది. జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీ కూడా ఇదే ఇమేజ్‌ వల్ల ఎదగలేక పోయారు. బర్మాకు వెళ్లి బౌద్ధ సన్యాసుల శిక్షణలో భావాతీత ధ్యానాన్ని అభ్యాసం చేసి వచ్చారట. కానీ, ఎందుకో ఫలితం మాత్రం కలుగలేదు. పిండికొద్దీ రొట్టే కదా!

ఈరకమైన జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను రంగరించి లోకేశ్‌బాబుకు సిలబస్‌ను తయారుచేశారట. ఇప్పుడా యన జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌లో ఉండట్లేదట. కొండాపూర్‌లోని సొంత ఫామ్‌హౌస్‌లో ఎక్కువగా ఉంటున్నారట. ఫామ్‌హౌస్‌ అనగానే అదేదో సిటీకి దూరంగా ఉండే వ్యవసాయ క్షేత్రం అనుకోవద్దు. ‘హార్ట్‌ ఆఫ్‌ ద ఐటీ సిటీ’గా పేరున్న కొండాపూర్‌ లోని పన్నెండెకరాల స్థలంలో ఉన్న లగ్జరీ హౌస్‌. ఈమధ్య వేలం పాటలో ఎకరం 50 కోట్లు పలికిన కోకాపేట భూముల కంటే కొండాపూర్‌ భూముల ఖరీదు చాలా ఎక్కువ.

ఈ లెక్కన కొంచెం అటూఇటు వెయ్యికోట్లు ఖరీదు చేసే పర్ణశాలలో ఆయనకు థియరీ క్లాసులు చెబుతున్నారు. నెలకోసారి మాత్రం ప్రాక్టికల్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తుంటారు. శిక్షణలో భాగంగా ఆయన శరీర బరువు కొంచెం తగ్గింది. గడ్డం కొంచెం పెరిగింది. ఉపన్యాసాల్లో ఏకాగ్రత చెదరకుండా ఉండడం, వివిధ విష యాల పట్ల ప్రాథమిక అవగాహన ఏర్పరచడం, భాషలో తప్పులు దొర్లకుండా చూడటం అనే మూడు అంశాలపై కన్స ల్టెంట్లు కుస్తీలు పడుతున్నారు.

లోకేశ్‌బాబు బ్రాండ్‌ ఇమేజ్‌ను మార్చడమే ఇప్పుడు కన్సల్టెంట్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్‌. ఇందుకోసం వాళ్లీ మధ్యన ఒక చిట్కాను కనిపెట్టారు. ప్రాక్టికల్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ఏమాత్రం మిస్సవ కుండా ఆయన ఒక డైలాగ్‌ను వాడుతున్నారు. ‘నన్ను చూసి ఈ ప్రభుత్వం భయపడుతున్నది. నేనంటే ఎందుకంత భయం?..’ ఏకకాలంలో కనుబొమలెగరేస్తూ ఈ వాక్యాల్ని ఆయన చూడ కుండా చదువుతున్నారు. లోకేశ్‌బాబును చూసి ప్రభుత్వం భయ పడటమేమిటి? అనే కామన్‌సెన్స్‌ ప్రశ్న ఇక్కడ అనవసరం. ఏదో తెలుగు సినిమాలో నాజర్‌ను ఉద్దేశించి బ్రహ్మానందం ఒక సెటైర్‌ వేస్తాడు. ‘వీళ్ల ఇంటిపేరు పిల్లి. దాన్నెటూ మార్చుకోలేరు. అందుకని పేర్ల వెనక సింహా, సింహా అని తగిలించుకుంటారు’. ఆ కథలో అదొక చిట్కా. ఈ కథలో కన్సల్టెంట్లు కనిపెట్టిన చిట్కా ఇది. అంతే!ప్రాక్టికల్స్‌ కోసం రెండురోజుల కింద లోకేశ్‌బాబు ఆంధ్రప్రదేశ్‌లో చేసిన పర్యటన ఒకసారి పరిశీలిద్దాం.

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఫిబ్రవరి నెలలో అనూష అనే యువతి హత్యకు గురైంది. ఏడు నెలలు గడిచిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఏడు నెలల తర్వాత పరామర్శ ఏమిటి? ఇక్కడ పరామర్శ అనేది ఒక సాకు. మనసులో ఉన్న సంకల్పం వేరు. ఫామ్‌హౌస్‌ శిక్షణలో నేర్చు కున్న ‘పోరాట పటిమ’ను ప్రాక్టికల్‌గా ఆంధ్రప్రదేశ్‌ వీధుల్లో ప్రదర్శించాలి. ఈ ప్రదర్శనకు సంబంధించిన ఆదేశాలు అధినేత నుంచి ముందుగానే పార్టీ శ్రేణులకు చేరుకున్నాయి. ఆరుగురు మాజీమంత్రులు, ఐదుగురు మాజీ ఎంపీలు, ఐదుగురు ప్రస్తుత ఎమ్మెల్యేలు, 21 మంది మాజీ ఎమ్మెల్యేలు, మూడు వేలమంది పార్టీ కార్యకర్తలు ఈ స్ట్రీట్‌ ప్లేలో పాల్గొనేలా కార్యక్రమాన్ని డిజైన్‌ చేశారు.

రోజంతా ఎల్లో మీడియా ఈ కార్యక్రమానికే అంకితమయ్యేలా ప్లాన్‌ చేసుకున్నారు. వీధి భాగోతం మాటున విధ్వంసం జరిగే అవకాశముందని పోలీసులకు కొంత ఆల స్యంగా ఉప్పందినట్లుంది. చివర్లో కొంతమంది నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. వీధి భాగోతాన్ని అడ్డుకున్నారు. షరా మామూలుగా ‘ఈ ప్రభుత్వానికి నేనంటే భయం’ అంటూ లోకేశ్‌బాబు ప్రెస్‌మీట్‌ పెట్టుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు ఆశించిన ఫలితం నెరవేరలేదు. దక్షిణ భారత చరిత్రలో దండ యాత్రల స్పెషలిస్టుగా పేరొందిన చాళుక్య చక్రవర్తి రెండో పులకేశి స్థాయి బిల్డప్‌ను వారు ఆశించారు.  తమిళ కమెడియన్‌ వడివేలు టైటిల్‌ రోల్‌ పోషించిన ‘హింసించే రాజు 23వ పులకేశి’ స్థాయి ఇమేజ్‌ మాత్రమే దక్కింది.

అనేక లింకులతో అల్లిన ఇనుప గొలుసు బలమెంత? అత్యంత బలహీనమైన లింకుకు ఉండే బలమెంతో ఆ గొలుసు బలం కూడా అంతే! ఇది సైన్స్‌ సూత్రం. ఇది సామాజిక, రాజకీయ, యుద్ధతంత్ర సూత్రం కూడా! జగద్విజేతలందరూ కూడా ఈ సూత్రాన్ని పాటించే విజేతలయ్యారు. బలమైన శత్రువును ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ శత్రువు బలహీన తలను వెతికి పట్టుకోవాలి. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. లోకేశ్‌బాబు ఎదుర్కోవాలని భావి స్తున్న శత్రువు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అత్యంత బలీయమైన శక్తి. శత్రుదుర్భేద్య దుర్గం ఆయన ప్రభుత్వం.

లోకేశ్‌బాబు దుర్బలుడు. అటువంటప్పుడు యుద్ధవ్యూహం ఎలా ఉండాలి? దాడికోసం లోకేశ్‌బాబు ఎంపిక చేసుకున్న లింకేమిటి? మహిళల రక్షణ. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ గొలుసులో ఇది బలమైన లింకు. మహిళల రక్షణ, సాధికారత, బలహీన వర్గాల సాధికారత, సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాల్లో ప్రభుత్వం వంక తేరిపార చూసే అవకాశమే లేదు. ఈ ఏడు రంగాల్లోనూ అభివృద్ధి బెంచి మార్కులను ఈ ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించింది. ఈ రంగాల మీద కత్తి దూయడానికి పూనుకోవడం ఆత్మహత్యా సదృశం కాదా?

మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని ట్రాక్‌ రికార్డు పరమ దరిద్రంగా ఉన్న రంగాల్లో మహిళల రక్షణ, సాధికారత అగ్ర స్థానంలో ఉన్నాయి. తాము ఎంపిక చేసుకున్న ముద్దుల రాజ ధాని నీడలోనే చెలరేగిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ ఒక హేయమైన అధ్యాయం. మహిళా గౌరవాన్ని మంటగలిపిన దుర్మార్గపు చర్య. అప్పుల ఊబిలోకి దింపి వేధింపులు, లైంగిక దాడులకు పాల్ప డిన ఈ నికృష్ట చర్య వెనుక పాలక పార్టీ పెద్దల పాత్ర ఉండడం విషాదాల్లోకెల్లా విషాదం. వందలాది అత్యాచారం ఘటనల్లో కేసులు రిజిస్టర్‌ చేయడానికి కూడా పోలీసు యంత్రాంగం మొరాయించిన అరాచక పాలన. మహిళా తాసిల్దార్‌ మీద పాలక పార్టీ ఎమ్మెల్యే పబ్లిగ్గా దాడిచేస్తేనే నో కేస్‌. నో పోలీస్‌. ముఖ్య మంత్రి స్వయంగా జోక్యం చేసుకొని కేసు లేకుండా సర్దుబాటు చేశారు. బాధితులు పెద్దఎత్తున ఆందోళన చేస్తేనే అప్పట్లో కేసులు నమోదయ్యేవి.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ కేసుల కోసమే దిశ పోలీస్‌ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న మహిళ వెంటనే పోలీస్‌ రక్షణ కోరే విధంగా దిశ యాప్‌ను రూపొందించింది. ఇప్పటికే 45 లక్షలమంది మహిళలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. జిల్లాకొకటి చొప్పున 13 దిశ కోర్టులు ఏర్పాటయ్యాయి. ఇందుకోసం 13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం నియమించింది. 148 మంది దోషు లకు ఇప్పటికే శిక్షలు కూడా పడ్డాయి. మహిళలపై లైంగిక దాడు లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుకాలం 2019 నాటికి సగటున 200 రోజులకు పైగా ఉండేది. ఇప్పుడది 42 రోజులకు తగ్గింది. మూడు వారాల్లోనే దోషులకు శిక్ష పడేలా రూపొం దించిన దిశ బిల్లు కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది. ఆమోదం లభించగానే చట్టం రూపుదాల్చుతుంది. ఇంకా చట్టం కాని ఈ చట్టం ప్రకారం ఎందుకు శిక్షించడంలేదంటూ లోకేశ్‌ బాబు దిశ బిల్లు ప్రతులను తగలబెట్టారు. పౌర హక్కులను హరించే నల్ల బిల్లుల, నల్ల చట్టాల తాలూకు ప్రతులను తగు లబెట్టడం గతంలో చూశాము. ప్రగతిశీలమైన బిల్లు ప్రతులను, అదీ అమలుచేయాలని తామే డిమాండ్‌ చేస్తున్న బిల్లు ప్రతులను తగలబెట్టడం ఇక్కడే చూస్తున్నాము. వారి మేధస్సు చిరకాలం వర్ధిల్లు గాక!

-వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top