భయపెడుతున్న జోస్యం

IMF cuts 2023 global growth, warns major economies to stall - Sakshi

అవును.. ఇది ప్రపంచాన్ని భయపెడుతున్న జోస్యం. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు సహా అనేక కారణాల వల్ల వచ్చే 2023లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి మునుపు ఆశించినంత ఉండదట. అంతర్జా తీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) జూలైలో వేసిన అంచనా కన్నా 0.2 శాతం తగ్గి, 2.7 శాతమే వృద్ధి సాధిస్తుందట. 2001 నుంచి ఎన్నడూ లేనంతటి అత్యంత బలహీనమైన వృద్ధి ఇది. అదీ కాక, వచ్చే ఏడాది ఆర్థికమాంద్యం లాంటి గడ్డు పరిస్థితి ప్రపంచంలో అత్యధిక జనాభాకు తప్పదని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది. జూలై నాటి అంచనాలను సవరించి, తాజాగా ‘వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌’ను ప్రకటించింది. మంగళవారం ప్రకటించిన ఈ అంచనాలు, ముందున్నది ముసళ్ళ పండగ అనే హెచ్చరికలు సహజంగానే నిరాశాజనకం. అదే సమయంలో ఆర్థిక రథసారథులకు మేలుకొలుపు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు ఈ ఏడాది, లేదంటే వచ్చే ఏడాది కుంచించుకు పోతుందట. ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యూరోపియన్‌ యూనియన్, చైనాలు స్తంభిస్తాయట. ఉక్రెయిన్‌ యుద్ధంతో జర్మనీ, ఇటలీ లాంటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలు సైతం మాంద్యంలో కూరుకుపోనున్నాయట. ఐరోపాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ పూర్తిగా రష్యా నుంచి వచ్చే ఇంధనం మీదే ఆధారపడడం ఇబ్బంది తెచ్చింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు ప్రతిగా ఐరోపాకు చమురు సరఫరాలో రష్యా కోత జర్మనీకి తలనొప్పి అయింది. ఫలితంగా, ఐఎంఎఫ్‌ తాజా అంచనాల ప్రకారం వచ్చే 2023లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం మేర కుంచించుకుపోనుంది. చమురు దిగుమతులపై ఆధారపడ్డ ఇటలీ స్థూల జాతీయోత్పత్తి 0.2 శాతం మేర తగ్గనుంది. మొత్తానికి, ఈ ఏడాది ప్రపంచ ద్రవ్యోల్బణం 8.8 శాతం గరిష్ఠానికి చేరుతుందని ఐఎంఎఫ్‌ అంచనా. వచ్చే 2024కు అది 4.1 శాతానికి తగ్గవచ్చట. మిగిలిన ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, భారత్‌ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా చిక్కులూ చాలా ఉన్నాయి. 

భారత ఆర్థిక వృద్ధి 2022 –23లో తగ్గుతుందంటూ గత వారం రోజుల్లో అటు ప్రపంచ బ్యాంక్, ఇటు ఐఎంఎఫ్‌ – రెండూ అంచనా వేశాయి. ఉక్రెయిన్‌ యుద్ధం, తత్ఫలితంగా ఇంధన సరఫరా ఇక్కట్లు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ దోవలో వివిధ కేంద్ర బ్యాంకులు ద్రవ్య వినియోగాన్ని కట్టుదిట్టం చేయడం లాంటివన్నీ ఇందుకు కారణాలే. గత ఆర్థిక సంవత్సరం 8.7 శాతం ఉన్న భారత వృద్ధి ఈసారి 6.8 శాతమే ఉండవచ్చని ఐఎంఎఫ్‌ తాజా మాట. ఏప్రిల్‌ నాటి అంచనా కన్నా ఇది 1.4 శాతం తక్కువ. ఇక, ప్రపంచ బ్యాంకు అయితే తన తాజా ‘దక్షిణాసియా ఆర్థిక అప్‌డేట్‌’ (ఎస్‌ఏఈయూ)లో మన దేశ వృద్ధిరేటు 1 శాతం మేర తగ్గి, 6.5 శాతం దాకా ఉండవచ్చంటోంది. భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) ఒక్కటీ మాత్రం మిగిలినవాటికి భిన్నంగా, కాస్తంత మెరుగ్గా ఏడాది మొత్తం మీద 7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా కట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం తాజాగా వాషింగ్టన్‌లో మాట్లాడుతూ ఈ ఏడాది మన వృద్ధి 7 శాతం ఉంటుందని బింకంగా చెప్పారు. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావానికి మనం అతీతులం కామని ఒప్పుకున్నారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకున్న భారత్‌ ఈ ఏడాది ఆ కిరీటాన్ని సౌదీ అరేబియాకు కోల్పోయే సూచనలున్నాయి. వచ్చే ఏడాది మళ్ళీ ఆ ఘనత సాధిస్తామని భావిస్తున్నా, ఆశ పెట్టుకోలేం. ప్రపంచ పరిణామాలు, పర్యవసానాలు భారత్‌ పైనా ప్రభావం చూపుతాయి. అలా వృద్ధి 5.2 శాతానికి జారిపోతుందనే అనుమానం ఉంది. మిగిలిన వారితో పోలిస్తే పైకి బాగున్నట్టు కనిపిస్తున్నా, 2020లో తగిలిన దెబ్బతో  దేశంలో అత్యధికంగా 5.6 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. దారిద్య్రరేఖ దిగువకు పడిపోయారు. ప్రమాదాలూ పొంచి వున్నాయి. ఇప్పుడు పెరిగే ముడిచమురు, ఎరువుల ధరలతో దేశీయ ద్రవ్యోల్బణం హెచ్చు తుంది. ప్రపంచ మందగమనం ఎగుమతుల్ని దెబ్బతీసి, వృద్ధిని నీరసింపజేసి, వాణిజ్యలోటును పెంచు తుంది. డాలర్‌ దెబ్బతో రూపాయి మారకం రేటుపై ఒత్తిడి పెరిగి, విదేశీమారక నిల్వలు తగ్గుతాయి.

ఇప్పుడున్న నిరాశావహ ప్రపంచ వాతావరణంలోనూ పరిస్థితులు మెరుగవ్వాలంటే ఎప్పటి లానే విధాన నిర్ణేతలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముందుగా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవాలి. అందుకు తగ్గ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూ, ద్రవ్య వినియోగంపై పట్టు బిగించి జీవన వ్యయాన్ని అదుపు చేయాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి పగ్గాలు వేశామనీ, అదేమంత ఆందోళన చెందాల్సిన విషయం కాదనీ పాలకులు అంటున్నారు. కానీ, వాస్తవంలో జూలైలో కాస్తంత తెరిపి నిచ్చినా, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో ధరలు పెరుగుతూనే పోయాయి. ద్రవ్యోల్బణం 7 శాతానికి పైనే ఉంటూ వచ్చింది. దేశంలో తలసరి ఆదాయం తక్కువ గనక, ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇంటి ఖర్చులు చుక్కలు చూపిస్తాయి. అలాగే, ఆహార ధరలు రెక్కలు విప్పుకొన్న కొద్దీ ఆర్బీఐకి సవాలు పెరుగుతుంది. అందుకే, ఆహార ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయాలి. కేంద్రం, రాష్ట్రాలు తెలివైన ఆర్థిక చర్యలు చేపట్టాలి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రైవేట్‌ రంగం పెట్టుబడులు పెట్టేందుకు సందేహిస్తుంది గనక, ప్రభుత్వాలు మూలధన వ్యయంలో కోతలు విధించకుండా ముందుకు సాగాలి. అది ఆర్థిక వృద్ధికి కారణమవుతుంది. ఏప్రిల్‌ – ఆగస్టు మధ్య భారత సర్కార్‌ 47 శాతం మేర మూలధన వ్యయాన్ని పెంచి, దోవ చూపడం ఆనందించాల్సిన విషయమే. కానీ, దేశ వృద్ధిగమనం నిదానిస్తున్న వేళ కళ్ళు తెరిచి, సత్వర కార్యాచరణకు దిగాలి. అదే మన తక్షణ కర్తవ్యం!  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top