అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

Nov 29 2026 12:14 AM | Updated on Nov 29 2026 12:14 AM

● బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

● కొత్తపల్లిలో అధికార లాంఛనాలతో

అంతిమ సంస్కారాలు

గోకవరం: అస్సోంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ కడిమి వేణుకు తన స్వగ్రామం కొత్తపల్లిలో కన్నీటి వీడ్కోలు పలికారు. శనివారం తెల్లవారు జామున అతని భౌతికకాయం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చేరుకుంది. గ్రామస్తుల సందర్శనార్థం వేణు పార్ధీవదేహాన్ని గ్రామంలో ప్రధాన సెంటర్‌లో ఉంచారు. దేశ సేవలో తమ గ్రామానికి చెందిన జవాన్‌ మృతి చెందాడన్న వార్తతో తెలియడంతో గ్రామస్తులు చివరిసారిగా వేణును చూసేందుకు భారీగా తరలివచ్చారు. శనివారం ఉదయం అధికార లాంఛనాలతో వేణు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బీఎస్‌ఎఫ్‌ అధికారులు, గ్రామ పెద్దలు, బంధువులు, గ్రామస్తులు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీగా అంతిమయాత్ర నిర్వహించారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ప్రధాన రహదారికి ఇరువైపులా నిలబడి వేణు అమర్‌రహే అంటూ జోహార్లు అర్పించారు. భారీ అంతిమయాత్ర అనంతరం స్థానిక క్రైస్తవ శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. బీఎస్‌ఎఫ్‌ అధికారులు గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం అర్పించారు. స్థానిక ఎంపీపీ జనపరెడ్డి హిమశైలుబాబు, వివిధ పార్టీల నాయకులు, ఎస్సై పవన్‌కుమార్‌ తదితరులు వేణు మృతదేహానికి నివాళులర్పించారు.

చిన్నారిని చూసి చలించిపోయి..

రెండేళ్ల క్రితమే వివాహమైన వేణుకు ఐదు నెలల చిన్నారి అన్విత ఉంది. ఇటీవలే పాపతో ఏడు రోజులు గడిపి తిరిగి విధులకు వెళ్లిన వేణు విగతజీవిగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తల్లి రమణమ్మ, భార్య సుగుణ, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఐదు నెలల పసిపాపను చూసి అందరూ చలించిపోయారు.

ఎమ్మెల్యే హాజరు కాకపోవడంపై అసంతృప్తి

దేశ రక్షణ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్‌ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంపై గ్రామస్తులు అసహ నం వ్యక్తం చేశారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement