● బ్యాలెట్ బాక్సుల భద్రతపై
యంత్రాంగ నిర్లక్ష్య వైఖరి
● స్టేట్ ఎలక్షన్ కమిషనర్
వెంటనే స్పందించాలి
● మాజీ ఎంపీ భరత్ రామ్
రాజమహేంద్రవరం సిటీ: గ్రేటర్ రాజమహేంద్రవరం ఎన్నికల ప్రక్రియతో పాటు స్ట్రాంగ్‌రూమ్‌లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే విషయంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ విమర్శించారు. ఆయన శనివారం రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా పరిగణించడంతో పాటు 72 గంటల పాటు ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన సీసీ టీవీ వెబ్ కాస్టింగ్ లైవ్ తమకు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తే, గ్రేటర్ రాజమహేంద్రవరం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా నడుచుకుంటోందని ధ్వజమెత్తారు. కందుకూరి వీరేశలింగం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద సెక్యూరిటీ చాలా దారుణంగా ఉందని, సీసీ కెమెరాలు ఎక్కడా పనిచేయడం లేదని, కెమెరాలు ఏర్పాటు చేసినా చోట వాటికి కనెక్షన్లు ఇవ్వలేదని వీడియోలు ప్రదర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీనిపై వెంటనే స్పందించి విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 38వ డివిజన్ నుంచి తమ పార్టీ తరఫున పోటీ చేసిన పప్పుల సాయి లక్ష్మీ ప్రసన్న భర్త నాగేంద్రకు చెందిన మొబైల్ దుకాణాలపై జీఎస్టీ అధికారులు ఎన్నికలు ముగిసిన వెంటనే దాడులు మొదలు పెట్టారని, 34 డివిజన్‌లో కొత్త బాల మురళీకృష్ణకు మద్దతుగా నిలిస్తే వ్యాపారాలు చేయబోనివ్వమని బెదిరింపులు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు తిరగాటి దుర్గ సతీమణి సరస్వతి పోటీ చేస్తున్న డివిజన్‌లో టీడీపీ నాయకులు పోలింగ్ బూత్‌లో దూరి రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. అక్కడ పోలింగ్ రోజు సాయంత్రం 4.30 గంటల తర్వాత వెబ్ కాస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ తరఫున క్లియర్ ఇమేజ్ ఉన్న మేయ ర్ అభ్యర్థిగా దాసి వెంకటరావు పోటీ చేశారని, అందువల్లనే కూటమి ప్రభుత్వానికి ఓడిపోతామనే భయం పట్టుకుందని విమర్శించారు.


