బ్యాలెట్‌ బాక్సులకు భద్రత కరవు! | - | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ బాక్సులకు భద్రత కరవు!

Nov 29 2026 12:14 AM | Updated on Nov 29 2026 12:14 AM

● అర్ధరాత్రి తెరుచుకున్న

కౌంటింగ్‌ కేంద్రం తలుపులు

● ఒక్క కానిస్టేబుల్‌ మాత్రమే కాపలా

● ఈ నిర్లక్ష్య తీరుపై అనేక అనుమానాలు

రాజమహేంద్రవరం సిటీ: గ్రేటర్‌ రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులకు రక్షణ ప్రశ్నార్థకంగా మారడంతో సర్వతా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేషన్‌ పరిధిలోని 72 డివిజనల్లో ఈ నెల 26న ఎన్నికలు జరగ్గా, 30న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా బ్యాలెట్‌ బ్యాక్సులను నగరం నడిబొడ్డున ఉన్న కందుకూరి వీరేశలింగం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపర్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం అక్కడ హై సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. సంబంధిత అధికారులకు తప్ప సామాన్యులకు ప్రవేశం ఉండదు. కానీ ఆ కౌంటింగ్‌ కేంద్రం తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కేంద్రాన్ని పరిశీలించిన కార్పొరేటర్‌ అభ్యర్థులు ఈ విషయం గమనించి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, మేయర్‌ అభ్యర్థి దాసి వెంకట్రావు, ఇతర పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. దీంతో వారందరూ అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ తరుణ్‌ పహ్వడ్‌, కమిషనర్‌ రాహుల్‌ మీనా అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

తూతూమంత్రంగా కెమెరాలు

కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారులు తూతూమంత్రంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ చుట్టూ హై సెక్యూరిటీ జోన్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా అటువంటి చర్యలు కనిపించడం లేదు. చెట్లకు బిగించిన సీసీ కెమెరాలకు ఏవిధమైన కనెక్షన్‌ ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ వద్దకు సామాన్యులు సైతం వెళ్లేలా నిర్లక్ష్యంగా వదిలివేయడంపై రాజకీయ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రక్షణగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో 12 మంది సాయుధులైన సిబ్బందిని నియమించాల్సి ఉండగా, కేవలం ఒక కానిస్టేబుల్‌తో సరిపెట్టడం విస్మయానికి గురి చేసింది. కాగా.. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భధ్రత లేకపోవడం ప్రమాద సంకేతంగా భావించిన వైఎస్సార్‌ సీపీకి చెందిన పలువురు యువకులు ఎస్‌కేవీటీ కాలేజీ చుట్టూ తెల్లవార్లూ కాపలాగా గస్తీ తిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement