శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Nov 29 2026 12:14 AM | Updated on Nov 29 2026 12:14 AM

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత శనివారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు న్యాయమూర్తికి శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. దేవస్థానం సూపరింటెండెంట్‌ ఐవీ రామారావు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్‌.ప్రియదర్శిని నూతక్కి తదితరులున్నారు. కాగా.. కార్తికమాసంలో శనివారం కావడంతో శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

నేడు రెండో దశ పంచాయతీ ఎన్నికలు

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, గోకవరం, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో 130 సర్పంచ్‌, 1,360 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది. మొత్తం 155 సర్పంచ్‌ స్థానాలకు 25 ఏకగ్రీవమయ్యాయి. అలాగే 1,806 వార్డు సభ్యులకు 446 మంది మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 130 సర్పంచ్‌ స్థానాలకు 356 మంది, 1,360 వార్డు సభ్యుల స్థానాలకు 2,928 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 5,80,579 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,83,221మంది పురుషులు, 2,97,341మంది మహిళా ఓటర్లు ఉన్నారు. .

పోలింగ్‌ సిబ్బంది నియామకం

1,912 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 6,726 మంది సిబ్బందిని నియమించారు. రిజర్వ్‌ సిబ్బందితో కలిపి 20 శాతం అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఎన్నికల విధుల కోసం మొత్తం 2,295 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేయగా, ఎన్నికల విధుల పర్యవేక్షణకు 192 మంది మైక్రోఅబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు శనివారం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి సంబంధిత పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ సిబ్బందిని తరలించారు. ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. మొత్తం 705 పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైన, అత్యంత సున్నితమైన కేంద్రాలుగా గుర్తించారు. మిగిలిన 1,207 సాధారణ పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రైతులకు

సాగునీరు అందించాలి

కోరుకొండ: మెట్ట ప్రాంతమైన కోరుకొండ మండలంలో వ్యవసాయ సాగుకు పుష్కర నీటిని సోమవారానికల్లా అందించాలని, లేదంటే ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆయనను శనివారం నర్సాపురంలో ఆ గ్రామంతో పాటు, గాదరాడ, కణుపూరు, దోసకాయలపల్లికి చెందిన రైతులు కలిసి, సాగునీటి సమస్యను తెలిపారు. స్పందించిన జక్కంపూడి రాజా మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులపై కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. సాగునీటిని సకాలంలో అందజేయకపోవడంతో దిగుబడి తగ్గి, పెట్టుబడి రాక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటి ఎద్దడి ఏర్పడిందని, పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదలచేయాలన్నారు. ఉద్యానవనాలకు కూడా నీటి కొరత ఏర్పడటంతో దిగుబడి తగ్గే పరిస్థితి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement