● టీడీపీతో అప్రమత్తంగా ఉండాలి ● సర్ కార్యక్రమంపై అజాగ్రత్త వద్దు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు
పెరవలి (కొవ్వూరు): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకుని అధికార టీడీపీ.. ఓట్లు గల్లంతు చేసే అవకాశం ఉందని, దీనిపై ప్రతి బూత్ కన్వీనర్ అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఓట్లు ఉండవని చెప్పారు. కొవ్వూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన శనివారం జరిగిన బూత్ కన్వీనర్ల సమావేశంలో వేణు మాట్లాడారు. చనిపోయిన, వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించడం సర్ లక్ష్యమని, కానీ, ఇంట్లో ఉన్నా లేనట్లుగా అధికార పార్టీ నాయకులు ఓట్లు గల్లంతు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటే నేడు ప్రభుత్వాలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాయని, ఓట్ల తొలగింపే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీలు ఓడిపోవడానికి ఓట్ల తొలగింపే ప్రధాన కారణమని అన్నారు. నిత్యం అబద్ధాలను సృష్టించటంలో టీడీపీ ఆరితేరిపోయిందని, ఆ పార్టీపై ప్రజలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. దోచుకో – దాచుకో అనే రీతిలో టీడీపీ నేతలు దొరికింది దొరికినట్లు దోచేస్తున్నారని, ఇసుక, మట్టి, మద్యం షాపుల దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ దోపిడీ పెరిగిపోయిందని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ నేడు ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు గాదె కింద పందికొక్కుల్లా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దీనిని బతికించుకోవడానికి యువతే ముందుకు రావాలని వేణు అన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారని, కానీ, ఎన్నికల్లో ఓట్లు లేకుండా చేస్తే వారు అనుకున్న వారే గెలుస్తారని ఆరోపించారు. సర్ కార్యక్రమం సందర్భంగా ఆయా బూత్‌లలో ఎవరి ఓట్లు తొలగించవచ్చు, ఎవరి ఓట్లు ఉండాలనే విషయాన్ని బూత్ కన్వీనర్లు నిశితంగా పరిశీలించాలని కోరారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వారి ఓట్లు ఉన్నాయో, తొలగించారో పరిశీలించుకునేలా విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి, సర్ పరిశీలకుడు వామిశెట్టి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, బుర్ర లక్ష్మణ్, ఉప్పులూరి సూరిబాబు, తోట రామకృష్ణ, టౌన్ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం, తాళ్లపూడి, చాగల్లు ఎంపీపీలు జొన్నకూటి పోసిరాజు, వీరాస్వామితో పాటు జిట్టా ఏడుకొండలు, ఇంటి వీర్రాజు, ముప్పిడి వీర్రాజు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వీరన్న, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు.
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ విద్యార్థిని టీచర్ కొట్టిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. నవోదయ ఎంట్రన్స్‌కు స్థానిక క్వారీ సెంటర్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో పదేళ్ల బాలుడు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెల 19న ఆ బాలుడిని కొంతమూరుకు చెందిన అతడి తండ్రి ఎస్.సూర్యనారాయణ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కుమారుడికి వాంతులవడంతో తండ్రి ఏమైందో ఆరా తీశాడు. వర్క్ చేయలేదని టీచర్ కాళ్లపై కొట్టాడని, అది మర్మావయవాలపై తగిలి విపరీతమైన నొప్పి వస్తోందని ఆ బాలుడు చెప్పాడు. దీంతో, వెంటనే సూర్యనారాయణ తన కుమారుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాలుడి మర్మావయవాలకు తీవ్రంగా గాయమైందని, అవసరమైతే వాటిని తీసేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. ఈ మేరకు సూర్యనారాయణ త్రీటౌన్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. దీనికి కారకుడైన ఆ ఇనిస్టిట్యూట్ ఉపాధ్యాయుడు వెంకట మోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఒడిశా టు తెలంగాణ
● చిత్రకొండ నుంచి కోదాడకు గంజాయి తరలింపు
● ఐదుగురి అరెస్టు ● 15.51 కేజీల సరకు స్వాధీనం
కోరుకొండ: ఒడిశా రాష్ట్రం చిత్రకొండ నుంచి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడకు గంజాయి తరలిస్తున్న ఐదుగురు విద్యార్థులను కోరుకొండ పోలీసులు అరెస్టు చేశారు. కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గంజాయి రవాణాపై విశ్వసనీయ సమాచారం మేరకు బూరుగుపూడి పెట్రోలు బంకు వద్ద ఎస్సై సీహెచ్‌వీ రమేష్ ఆధ్వర్యాన గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంగా కోదాడ ప్రాంతానికి చెందిన షేక్ నజీర్, షేక్ అశ్వక్, మహమూద్ అవేజ్‌ఖాన్, తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, తమ్మిశెట్టి పెద్దిరాజులు మోటార్ సైకిళ్లపై రెండు సంచుల్లో తరలిస్తున్న 15.51 కేజీల పొడి గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.77,550గా నిర్ధారించారు. నిందితుల నుంచి రెండు మోటార్ సైకిళ్లు, రెండు స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని, దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. నిందితులపై ఖమ్మంలో కేసులున్నాయని చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు విద్యార్థులు, యువత లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్నారన్నారు. నిందితుల్లో కొందరు ఫార్మసీ, ఇంజినీరింగ్ విద్యార్థులు కావడంతో యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నట్టు గుర్తించామని వివరించారు. గతంలో కూడా వీరు గంజాయి రవాణాకు పాల్పడినట్టు తెలిపారు. కాగా, సర్కిల్ పరిధిలోని కోరుకొండ, గోకవరం, సీతానగరం పోలీసు స్టేషన్లలో ఈ ఏడాది ఇప్పటి వరకూ నమోదైన 8 గంజాయి కేసులలో పోలీసులు 1,400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
డెల్టాలకు 11,700 క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు శుక్రవారం 11,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,800, మధ్య డెల్టాకు 2,400, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.20 అడుగులు ఉంది.


