సీతానగరం: మండలంలోని ముగ్గళ్ల అంగన్‌వాడీ కేంద్రం దుస్థితిపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రావూరి ఛాయాదేవి విచారణ నిర్వహించారు. ఈ నెల 24న ‘సాక్షి’లో ‘వెలవెలబోతున్న అంగన్‌వాడీ సెంటర్’ శీర్షికన కథనం వెలువడింది. అంగన్‌వాడీ కేంద్రంలో ఒకే ఒక్క బాలుడున్నాడని, కేంద్రం పెంకుటింట్లో ఉందని, దానికి నెలకు రూ.2 వేల అద్దె చెల్లిస్తున్నారని, కేంద్రం శిథిలావస్థకు చేరిందని ఈ కథనంలో ‘సాక్షి’ పేర్కొంది. దీనిపై అధికారులు స్పందించారు. సీడీపీఓ సంధ్య ఆదేశాల మేరకు ముగ్గళ్ల సెక్టార్ సూపర్‌వైజర్ రావూరి ఛాయాదేవి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, విచారణ చేపట్టారు. ఈ కేంద్రాన్ని పిల్లలున్న ప్రాంతానికి మార్చాల్సిందిగా ఇదివరకే సూచించానని, ఏడుగురు పిల్లలు, ఒక గర్భిణి, ఇద్దరు బాలింతలు మాత్రమే ఉన్నారని, విచారణ నివేదికను సీడీపీఓకు అందించానని తెలిపారు. శుక్రవారం సెలవు కావడంతో అంగన్‌వాడీ వర్కర్‌కు శనివారం మెమో జారీ చేస్తామని సీడీపీఓ సంధ్య తెలిపారు.


