● పేపరు మిల్లు సమస్య
పరిష్కారానికి నెలాఖరు డెడ్‌లైన్
● లేకపోతే నేనే ఆందోళన చేస్తా
● మంత్రి దుర్గేష్ ప్రకటన
● సమస్య పరిష్కరించాల్సిన అమాత్యుడి ప్రకటనపై
కార్మిక వర్గంలో విస్మయం
సాక్షి టాస్క్‌ఫోర్స్: స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చి పేపరు మిల్లు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్‌కు సైతం ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. దీంతో, పేపరు మిల్లు కాలుష్యంతో పాటు, కార్మికుల సమస్యలు ఓ కొలిక్కి వచ్చేస్తాయన్నంతగా అనుకూల మీడియాలో హోరెత్తించేశారు. తీరా సీన్ కట్ చేస్తే.. కడియం మండలం మాధవరాయుడుపాలెం పరిధిలోని ఏపీ పేపరు మిల్లు యాజమాన్యం తీరు యథాతథంగానే కొనసాగుతోంది. ఈ మిల్లులోని పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో, పవన్ కల్యాణ్ చేసింది హడావిడి మాత్రమేననే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికార కూటమి నాయకులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే పరిస్థితుల్లో లేరనే అభిప్రాయానికి కార్మికులు దాదాపు వచ్చేశారు.
మంత్రి తీరుపై కార్మికుల ఆశ్చర్యం
ఈ పరిస్థితుల్లో కడియం పేపరు మిల్లు కార్మికుల ఆందోళన శిబిరం వద్దకు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం హఠాత్తుగా వచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై మిల్లు యాజమాన్యం నెలాఖరుకల్లా స్పందించకపోతే తాను స్వయంగా ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. సమస్య పరిష్కరించే అధికారం ఉన్న రాష్ట్ర కేబినెట్ మంత్రి.. ప్రతిపక్ష నాయకుల మాదిరిగా ఆందోళన చేస్తానంటూ హెచ్చరించడం విచిత్రంగా ఉందని కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏదైనా తీపి కబురు చెప్పడానికి మంత్రి వస్తున్నారేమోనని ఆశ పడితే.. తమతో పాటు ఆందోళన చేస్తానంటూ ప్రకటించి వెళ్లిపోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు.
ప్రభుత్వం స్పందించదా?
మంత్రి దుర్గేష్ ప్రకటన నేపథ్యంలో ప్రజలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
● పేపరు మిల్లు ఏకపక్షంగా లాకౌట్ ప్రకటించింది. దీనిపై కార్మిక శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
● ఇప్పటికే కార్మికులు 60 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సుమారు 850 మంది పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబాలకు సంబంధించిన ఈ సమస్య పరిష్కరానికి ప్రభుత్వానికి ఎంత టైమ్ పడుతుంది?
● చర్చల పేరుతో హడావుడి చేస్తున్నారు తప్ప, మిల్లు యాజమాన్యం నుంచి కచ్చితమైన హామీ ఒక్కటైనా వచ్చిందా? కార్మికుల డిమాండ్లు నెరవేరుస్తారా? సమ్మె కాలానికి వేతనం చెల్లిస్తారా? వీటికి యాజమాన్యం నుంచి సమాధానం ఉందా?
● రాష్ట్ర ప్రభుత్వానికి మిల్లు యాజమాన్యం అతీతమా? వారిని ప్రత్యక్షంగా ఎందుకు చర్చల్లోకి తీసుకు రాలేకపోతున్నారు?
● యాజమాన్యం ఏకపక్షంగా లాకౌట్ ప్రకటించింది. అంతే ఏకపక్షంగా అర్ధరాత్రి ఉపసంహరించుకుంది. అంటే రాష్ట్రంలో కార్మికులకు న్యాయం జరిగే పరిస్థితుల్లేవా? వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదా? అలా చేయలేకే చర్చలు, ఆందోళనలు అంటూ కాలయాపన చేస్తున్నారా?
● కార్మికుల వైపే న్యాయం ఉందంటున్న మంత్రి.. అధికారం చేతిలో ఉండి కూడా యాజమాన్యంపై ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోవడం వెనుక ఉన్న మతలబేమిటి?
● కార్మికుల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఆందోళనలు, మద్దతు అంటూ షో చేస్తున్నారా? అటువంటిదేమీ లేకపోతే ఎంత సమయంలో కార్మికులకు న్యాయం చేస్తారు? అసలు చేస్తారా, లేదా అనేది బహిరంగంగా స్పష్టంగా ప్రకటించాలి.
● ప్రజలు లేవనెత్తుతున్న ఈ ప్రశ్నలపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.


