టీడీపీ నేత దూకుడుకు బ్రేకులు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత దూకుడుకు బ్రేకులు

Jun 26 2026 4:05 AM | Updated on Jun 26 2026 4:05 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): వైఎస్సార్‌ సీపీ నేత అప్రమత్తతతో టీడీపీ నేత దూకుడుకు అధికార యంత్రాంగం బ్రేకులు వేసింది. 114 ఏళ్ల చరిత్ర కలిగిన ఇన్నీసుపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకును సహకార చట్టం నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ (మ్యాక్స్‌) చట్టంలోకి మార్చేందుకు ఆ బ్యాంకు చైర్మన్‌, టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ బంధువు కోళ్ల అచ్యుత రామారావు (బాబు) ప్రతిపాదించారు. దీనికి సహకార శాఖ బ్రేకులు వేయడంతో ప్రజాధనానికి రక్షణ లభించింది.

ఏం జరిగిందంటే..

బ్యాంకు సర్వసభ్య సమావేశం ఈ నెల 28న నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చే ప్రతిపాదనను అజెండాలో 7వ అంశంగా చేర్చారు. దీనికి సభ్యుల ఆమోదం తీసుకుని, బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చేందుకు పాలకవర్గం అన్ని ఏర్పాట్లూ చేసింది. మ్యాక్స్‌ చట్టం ప్రకారం పాలకవర్గం ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం ఉండటంతో బ్యాంకు డిపాజిట్లు, నియామకాలపై బ్యాంకు ఖాతాదార్లు, సీనియర్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇన్నీస్‌పేట బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చే ప్రతిపాదనను విరమించుకోవాలని పాలకవర్గాన్ని జిల్లా సహకార అధికారి (డీసీఓ) ఎం.వెంకటరమణ ఆదేశించారు. దీంతో, మ్యాక్స్‌ చట్టంలోకి మార్చి.. ఇన్నీసుపేట బ్యాంకును తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు టీడీపీ నేత పన్నిన పన్నాగానికి బ్రేక్‌ పడింది. డీసీఓ ఆదేశాలపై డిపాజిటర్లు, సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదేశాల ద్వారా ప్రజాధనం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఫ ఇన్నీసుపేట అర్బన్‌ బ్యాంకును

మ్యాక్స్‌ చట్టంలోకి మార్చేందుకు యత్నం

ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఫిర్యాదుతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం

ఫ ప్రతిపాదనను విరమించుకోవాలని పాలకవర్గానికి డీసీఓ ఆదేశం

ఫ డిపాజిటర్లు, సభ్యుల హర్షాతిరేకాలు

డీసీఓ ఏమన్నారంటే..

ఫ ఈ వ్యవహారంతో సుమారు రూ.140 కోట్ల ప్రజా నిధులు ముడిపడి ఉన్నాయి. దీంతో. డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు.

ఫ బ్యాంకు ప్రయోజనాలను పరిరక్షించడానికి, సెక్షన్‌ 12(3) కింద మూడింట రెండు వంతుల సభ్యుల సమ్మతిని పూర్తి అవగాహనతో కూడిన పొందాలి.

ఫ సెక్షన్‌–13 కింద డిపాజిట్‌ ఉపసంహరణకు స్పష్టమైన అవకాశం కల్పించాలి.

ఫ ఇటువంటి అంశాలను ముందుగా క్షుణ్ణంగా పరిష్కరించాలి.

ఫ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల జారీ చేసిన పాలనాపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా మ్యాక్స్‌ చట్టంలోకి మారుతోందో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఫ వీటన్నింటి నేపథ్యంలో ఈ నెల 28న జరిగే సర్వసభ్య సమావేశంలో మ్యాక్స్‌ చట్టంలోకి మార్చే అంశాన్ని వాయిదా వేసుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement