కడియం: మాధవరాయుడుపాలెంలోని ఏపీ పేపర్ మిల్లు కార్మికులకు అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. మిల్లు కార్మికులు 60 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన డిమాండ్లపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారి సహనాన్ని పరీక్షించడం తగదని హితవు పలికారు. కార్మిక నాయకులను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలన్నారు. మిల్లు 20 ఏళ్లుగా లాభాల్లో నడుస్తున్నప్పటికీ జీతాలు తగ్గుతూ వస్తున్నాయని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం కార్మికులు విధులు నిర్వహించి, సంస్థ పురోగతికి తోడ్పడ్డారన్నారు. తక్షణం అక్రమ లాకౌట్ ఎత్తివేసి, 59 మంది కాంట్రాక్టు, 11 మంది పర్మినెంట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్లు తెరచిన తరువాత కూడా కార్మికులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వేతన ఒప్పందాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావుకు మిల్లు కార్మికులతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సహా తామంతా అండగా ఉంటామని చెప్పారు. కార్మికులకు తమ వంతు సాయంగా రాజా రూ.50 వేలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గిరజాల బాబు, కొత్తపల్లి శివాజీ, రాణా హరిశ్చంద్ర, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.


