అక్రమ తవ్వకాలపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

అక్రమ తవ్వకాలపై చర్యలు

Jun 26 2026 4:05 AM | Updated on Jun 26 2026 4:05 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌లు కలెక్టర్‌ కీర్తికి గురువారం విజ్ఞప్తి చేశారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన వారి పైనే అక్రమార్కులు తిరిగి పోలీసు కేసులు పెడుతున్నారని, భౌతిక దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రాజా వివరించారు. కొన్నిచోట్ల చెరువుల్లో అనుమతులను ఉల్లంఘించి, పర్యావరణానికి హాని కలిగించేలా పది రెట్లు మట్టి తవ్వేసి, వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీటిపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. లారీల్లో అధిక లోడు వేసి, రాత్రింబవళ్లు తేడా లేకుండా మట్టి తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులు, మార్గదర్శకాలకు లోబడి మాత్రమే మట్టి తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. రాజానగరం మండలం మల్లంపేటలో చెరువు గట్టు తవ్వేయడంతో ఆయకట్టు రైతులు పంటలు వేసుకునే అవకాశం కోల్పోయారన్నారు. వర్షాకాలంలో చెరువులోకి వచ్చే వరద నీరు గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చెరువు గండి పూడ్చివేయడంతో పాటు గట్టు పటిష్టతకు చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువు గట్టుకు గండి కొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కలెక్టర్‌కు వైఎస్సార్‌ సీపీ నేతల వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement