పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుమ చక్రవర్తి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కారాగారాలు కేవలం శిక్ష అనుభవించే ప్రదేశాలుగా కాకుండా.. వ్యక్తిత్వ వికాసం, మానసిక పరివర్తన, సామాజిక పునరావాసానికి దోహదపడే కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని పట్నా హైకోర్టు న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జైలులోని వివిధ విభాగాలు, ఖైదీల సంస్కరణకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పునరావాసానికి అమలు చేస్తున్న వృత్తి శిక్షణ, ఖైదీల వసతి గృహాలు, వైద్య సేవలు, పారిశుధ్య నిర్వహణ, ఆహార పంపిణీ విధానం, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. జైలు అధికారులు ఆమెకు స్వాగతం పలికి, కారాగారంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ అనుమ చక్రవర్తి మాట్లాడుతూ, ఖైదీలు తమలోని ప్రతిభను వెలికి తీసుకుని, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవరచుకోవాలని సూచించారు. సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా తిరిగి స్థిరపడేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కారాగార పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, పచ్చదనం అభివృద్ధి చర్యలు, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ కూడా ఉన్నారు.


